సుస్వర సేవా సౌరభం | Sakshi
Sakshi News home page

సుస్వర సేవా సౌరభం

Published Sun, Dec 27 2015 1:17 AM

సుస్వర సేవా సౌరభం

ఆదర్శం
ముంబై.
దాదర్-అంబర్‌నాథ్‌ల మధ్య నడిచే లోకల్ ట్రైన్ ప్రయాణికుల అరుపులు, కేకలతో కర్ణ కఠోరంగా ఉంది.
  ఆ సమయంలోనే ఉన్నట్టుండి  గిటారు స్వరాలు వినిపించసాగాయి. ఏదో మంత్రం వేసినట్లు, అప్పటి వరకు బాగా అల్లరి చేసిన పిల్లాడు రెండు చేతులూ కట్టుకొని బుద్దిగా కూర్చునట్లు... బోగీ మొత్తం నిశ్శబ్దమయమైపోయింది.
 ‘‘ ఎంత బాగా వాయిస్తున్నాడు కుర్రాడు’’... ప్రశంసలు ఆ మూల నుంచి ఈ మూల వరకు వినిపిస్తూనే ఉన్నాయి.
 

ఆనాటి ‘మొఘల్-ఏ-అజమ్’లోని ‘ప్యార్ కియాతో డర్నా క్యా...’ నుంచి నిన్నటి ‘బజ్‌రంగీ భాయి జాన్’లోని ‘సెల్ఫీ లేలేరే’ పాట వరకు రకరకాల ట్యూన్లను అద్భుతంగా ప్లే చేస్తున్నాడు ఆ కుర్రాడు. అతడి దగ్గర ఉన్న  డొనేషన్ బాక్స్‌లో ఇరవై రూపాయలు వేసిన బ్యాంకు అధికారి ఒకరు... ‘‘మంచి పని చేస్తున్నావు బేటా. ఎప్పటి నుంచో నీ పాటలు వింటున్నాను కానీ విషయం మాత్రం నిన్ననే తెలిసింది!’’ అంటూ భుజం తట్టాడు.  ఇంతకీ ఏమిటా విషయం?
 
అది తెలియాలంటే... ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ లోని క్యాన్సర్ వార్డ్‌లోకి వెళ్లాలి. రెండేళ్ల క్రితం సౌరభ్ తల్లి బ్లడ్ క్యాన్సర్‌తో ఈ హాస్పిటల్‌లో చేరింది. తమ్ముడు, మామయ్యలతో కలిసి ఈ హాస్పిటల్‌లో నాలుగు నెలలు ఉన్నాడు సౌరభ్. అప్పుడే  తనకు తెలియని మరో ప్రపంచాన్ని చూశాడు. ఆ ప్రపంచంలో ఎందరో పేదలు, వారి కన్నీళ్లు!
 
మహారాష్ర్టలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఎందరో పేద క్యాన్సర్ పేషెంట్లు ఈ హాస్పిటల్‌లో చేరుతుండే వారు. ఒకవైపు క్యాన్సర్ భయం, మరోవైపు కరెన్సీ భయం. వైద్యులు రాసిన మందులు కొనడానికి వాళ్ల దగ్గర డబ్బులు ఉండేవి కావు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు వారివి. ఆత్మీయుల యోగ క్షేమాలు చూస్తూ హాస్పిటల్‌లో ఉండాలా? రోజు కూలీకి వెళ్లాలా? ఒకవేళ వెళ్లకపోతే జేబులో ఇప్పుడున్న చిల్లర డబ్బులు కూడా ఉండవు.

అలా అని వదిలి వెళ్లలేని పరిస్థితి. ఈ రకమైన ఆలోచనలతో సతమతమవుతుండేవాళ్లు. వారి కన్నీటి కథలను మౌనంగా చదివాడు సౌరభ్.
 ఒకసారి సౌరభ్ వాళ్ల అమ్మకు అవసరమైన మందు హాస్పిటల్లో లభించలేదు. కానీ, ఒక పేషెంట్ తనకు తానుగా తన దగ్గరున్న ఆ మందును సౌరభ్‌కు ఇచ్చాడు. నిజానికి వేరే వాళ్లకు ఉచితంగా మందు ఇచ్చేంత ఆర్థికస్థాయి లేదు అతనికి. అయినా ఇచ్చాడు.

ఈ సంఘటన సౌరభ్‌లో ఎంతో మార్పును తీసుకువచ్చింది. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి... తన బాధలను మరిచి ఇతరుల బాధను తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి మంచి పని నేను మాత్రం ఎందుకు చేయకూడదు?’ అనుకున్నాడు. అందుకేం చేయాలా అని ఆలోచించాడు. తాను గిటార్ బాగా వాయించగలడు.

ఆ కళతోనే క్యాన్సర్ బాధితులైన పేదలకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనను అమ్మతో చెబితే మెచ్చుకుంది.  కాలేజీకి వెళుతున్నప్పుడు, తిరిగి ఇంటికి వస్తునప్పుడు లోకల్ ట్రైన్లో గిటార్ ప్లే చేయడం ప్రారంభించాడు. ఎందుకలా వాయిస్తున్నావ్ అని అడిగితే, తన ఉద్దేశాన్ని ప్రయాణికులకు చెబుతుండే వాడు.

వాళ్లు ఇచ్చే సొమ్మును క్యాన్సర్ బాధితుల కోసం వెచ్చించేవాడు. కొన్ని నెలల తరువాత అమ్మ చనిపోయింది. అయినా కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, విరాళాలు సేకరిస్తూనే ఉన్నాడు. తాను చేస్తున్న పనికి  అమ్మ ఆశీస్సులున్నాయనే విషయాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటాడు.
 
కాలేజీ చదువు తరువాత అంబర్‌నాథ్ లోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు సౌరభ్. అయినా ఇప్పటికీ రోజూ రైళ్లలో గిటార్ వాయిస్తుంటాడు.  రోజుకు కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా  డొనేషన్ బాక్స్‌లో పడుతుంటాయి.  ఆ డబ్బును ‘బ్రైట్ ఫ్యూచర్ అసోసియేషన్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు ఇస్తుంటాడు. సదరు సంస్థ ఆ మొత్తాన్నీ పేద క్యాన్సర్  పేషెంట్ల అకౌంట్స్‌కు బదిలీ చేస్తుంది.
 
ఇలా కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు... తనకు ఏ మాత్రం సమయం చిక్కినా క్యాన్సర్ వార్డ్‌లకు వెళ్లి గిటార్ ప్లే చేసి, అక్కడి గంభీరమైన వాతా వరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు సౌరభ్. ‘‘నేను ఏ చిన్న పని చేసినా... నా గురించి అందరికి గొప్పగా చెబుతుండేది అమ్మ.

ఇప్పుడు నేను చేస్తున్న మంచి పని గురించి స్వర్గంలో అందరికీ చెబుతూ ఉండవచ్చు’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. ఇతడి సేవ గురించి అమితాబ్ బచ్చన్‌కు కూడా తెలిసింది. ఆయన ఓసారి రైలు ఎక్కి, సౌరభ్ చేస్తోన్న పనిని చూసి ఎంతో మెచ్చుకున్నారు కూడా!

Advertisement
Advertisement