టీడీపీ నేతలను తప్పించే కుట్ర

17 Dec, 2015 02:33 IST|Sakshi
టీడీపీ నేతలను తప్పించే కుట్ర

‘కాల్‌మనీ’ కేసును తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం : శ్రీకాంత్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో టీడీపీ నేతలను తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కేసును తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించా రు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి బంధువుల పాత్ర ఉన్నట్లు వార్తలు వెలుగుచూస్తున్నా వారిని తప్పించేం దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. విజయవాడలో ఈ సెక్స్ రాకెట్ జరిగితే ఆ కోణాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా ఏదో జరుగుతున్నట్లుగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించడంలో ఆంతర్యం ఇదేనన్నారు. అధికార పార్టీ నాయకులను తప్పించే యత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్స్ రాకెట్‌ను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ గట్టిగా గళమెత్తిన తరువాత దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారని చెప్పారు.
 
 ‘సిట్’ ఏర్పాటు చేయాలి: ఉప్పులేటి
 కల్తీ మద్యం మృతుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లుగానే కాల్‌మనీ-సెక్స్ రాకెట్ పై కూడా సిట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉప నేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో డబ్బు కంటే మహిళలపై సాగిన లైంగిక వేధింపులే ప్రధానమన్నారు.

 మహిళలకు క్షమాపణ చెప్పాలి: రోజా
 టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాల్‌మనీ గ్యాంగులుగా ఏర్పడి అమాయక నిరుపేద మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. కాల్‌మనీ వ్యవహారాన్ని సామాజిక సమస్యగా చూడాలని, సీఎం చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె బుధవారం డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఇలాంటి దారుణాలు, దురాగతాలు జరుగుతుంటే భవిష్యత్తులో ఇక్కడకు వచ్చి జీవించాలనుకునే వారికి ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు