పశ్చిమాన ‘భూ’చోళ్లు!

27 Sep, 2016 08:30 IST|Sakshi
  • అధికార పార్టీ నేతల విశృంఖలత్వం
  • ఎడాపెడా ప్రభుత్వ భూముల కబ్జా
  • హెచ్చరిక బోర్డులు పీకేసి నిర్మాణాలు
  • ప్రైవేట్ ఒప్పందాలతో ఇతరులకు ధారాదత్తం
  • అడ్డంకులు లేకుండా చూస్తామని హామీలు
  •  ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు
  •  
    విశాఖపట్నం:  పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సర్వే నెం.107లో సుమారు 250 గజాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది. ఇది పలుమార్లు దురాక్రమణకు గురి కాగా అధికారులు వాటిని తొలగించి జిల్లా కలెక్టర్ పేరిట హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. కానీ స్థానిక ఎమ్మెల్యే అండదండలున్న టీడీపీ వార్డు నేత ఈ భూమిలో పాగావేశారు. హెచ్చరికలతో నాకు పనేంటి అన్నట్లు బోర్డు పీకేశారు. ఎవరికివ్వాల్సిన మామూళ్లు వారికివ్వడంతో సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వదిలేశారు.


    అదే అదనుగా మెయిన్ రోడ్డును ఆనుకొని పక్కా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేశారు. ఈ అక్రమ నిర్మాణ ప్రారంభోత్సవాన్ని కూడా ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదగానే వార్డు అధ్యక్షుడు బొడ్డేడి విజయ్ చేయించడం విశేషం. ఆ తర్వాత వీటిని అద్దెలకిచ్చేశారు. క్రమంగా పక్కనున్న మిగతా స్థలాన్ని కూడా కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో గజం రూ.30వేలకు పైనే పలుకుతోంది. ఆ లెక్కన ఈ భూమి విలువ రూ.70 లక్షల పైమాటే.

     అలాగే సర్వే నెం.170లో ఉన్న 220 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఓ కానిస్టేబుల్‌కు ధారాదత్తం చేశారు. ‘రెవెన్యూ, జీవీఎంసీ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తాం. మీరు ఇల్లు కట్టుకోండి’ అని అభయమిచ్చేశారు. అందుకోసం రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకుని లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు.

    రూ.4 లక్షల అడ్వాన్స్ కూడా సదరు కానిస్టేబుల్ సమర్పించుకున్నాడు. పచ్చ నేతలంతా దగ్గరుండి మరీ ఆ స్థలంలో పునాదులు కూడా వేయించారు. ఆ తర్వాత ముందుకెళ్లేందుకు కానిస్టేబుల్‌కు ధైర్యం చాల్లేదు. అనుమతులు వచ్చిన తర్వాతే ముందు కెళ్దామని వేచి చూస్తున్నాడు. అడ్డగోలుగా నిర్మించుకునే ధైర్యం ఉంటే ముందుకెళ్లిపోండి.. మేం చేసుకుంటాం అని అధికార పార్టీ నేతలు అభయమిస్తున్నా సదరు కానిస్టేబుల్ ముందుకెళ్లలేకపోతున్నాడు. అనుమతులైనా ఇప్పించండి లేదా నా డబ్బులైనా ఇచ్చేయండంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

     ఇదే రీతిలో దాడి అప్పారావునగర్‌లో గెడ్డ పోరంబోకు స్థలాన్ని ఓ టీడీపీ కార్యకర్త ఆక్రమించుకుని పక్కా భవనం నిర్మించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో పచ్చ నేతలు సాగిస్తున్న ఆగడాలకు అంతే ఉండదు.


     మా దృష్టికి రాలేదు
     అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు జీ హుజూర్ అంటూ వీరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ దురాక్రమణలపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. మా దృష్టికి రాలేదు, ఎవరు ఫిర్యాదుచేయలేదని సెలవిస్తున్నారు.

మరిన్ని వార్తలు