తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

15 Mar, 2016 05:07 IST|Sakshi

కొనసాగుతున్న ఉపరితలద్రోణి

 సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుంచి కొమరిన్ వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోనూ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉం దని తెలిపింది. తెలంగాణలో రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురవవచ్చని పేర్కొంది.

వీటి ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉంటుందని వివరించింది. మరోవైపు రాయలసీమలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాలల్లో ఉష్ణోగ్రత లు 40 డిగ్రీలకు దాటుతున్నాయి. అలాగే తెలంగాణలోని హైదరాబాద్, హన్మకొండ, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవి సాధారణకంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికం. ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడం మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు