భద్రాచలంలోనే మావోయిస్టుల మృతదేహాలు

3 Mar, 2016 02:52 IST|Sakshi
భద్రాచలంలోనే మావోయిస్టుల మృతదేహాలు

♦ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంధువులకు ఇవ్వని పోలీసులు
♦ తీర్పునకు ముందే రావడంతో సారక్క, సోనీ భౌతికకాయాల అప్పగింత
♦ మృతుల్లో మిగతా ఐదుగురి గుర్తింపు
♦ తప్పించుకున్న మావోయిస్టుల కోసం సరిహద్దులను జల్లెడ పడుతున్న ఖాకీలు
 
 భద్రాచలం/చర్ల/కొత్తగూడ: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించి, పోస్టుమార్టం అనంతరం వాటిని అక్కడే మార్చురీలో భద్రపరిచారు. రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ మానవ హక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా మార్చురీలోనే ఉంచారు. అయితే బుధవారం కోర్టు తీర్పునకు ముందే మృతుల బంధువులు కొందరు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా మడగూడేనికి చెందిన ధనసరి సారక్క (ఈమె తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మరదలు), మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన సోనీ(ఈమె గుంటూరు జిల్లాకు చెందిన గొట్టిముక్కల రమేశ్ అలియాస్ లచ్చన్న భార్య) మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.

 మొత్తం 8 మంది గుర్తింపు
 చర్లకు సమీపంలోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా.. వారిలో మంగళవారం పోలీసులు ముగ్గురిని గుర్తించారు. బుధవారం మరో ఐదుగురిని గుర్తించారు. అయితే వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. గుర్తించిన వారి వివరాలివీ.. 1.గొట్టిముక్కల రమేష్ అలియాస్ లచ్చన్న(52) క్రోసూరు మండలం, గుంటూరు జిల్లా, 2.మడకం బండి(30), తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప, 3.ధనసరి సారక్క అలియాస్ అనిత(35) వరంగల్ జిల్లా మడగూడెం, 4.కొత్తకుడ సృజన(25) వరంగల్ జిల్లా పైడిపల్లి, 5.యూసుఫ్ బీ అలియాస్ సోనీ(38) మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాచినపల్లి, 6.రాజు(25) (ఛత్తీస్‌గఢ్), 7.రామి(ఛత్తీస్‌గఢ్), 8.మడివి దేవి(ఛత్తీస్‌గఢ్).

 సారక్కకు కన్నీటి వీడ్కోలు
 సారక్క ఏడాది క్రితమే దళంలో చేరింది. కొద్దిరోజులు కొత్తగూడ ఏరియా దళ కమాండర్ భద్రు దళంలో పనిచేసిన ఈమె తాజా ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. బుధవారం ఆమె స్వస్థలం మడగూడెంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరి చూపు చూసేందుకు బంధువులు, అభిమానులు, నాయకుల పెద్దఎత్తున తరలివచ్చారు.

 కన్నీళ్లు పెట్టించిన కన్నపేగు..
 మావోయిస్టు అమర వీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా శాంత ఎన్నో కుటుంబాల కన్నీళ్లు తుడిచింది.  కానీ ఇప్పుడు పేగుబంధం ఆమెతో కన్నీరు పెట్టించింది.  ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సృజన(25) శాంత కూతురు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం చేరుకున్న ఆమె సృజన మృతదేహాన్ని చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించింది.
 
 అసలు ప్లీనరీ ఎందుకోసం?
 మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్న ఈ ప్లీనరీని ఎందుకోసం నిర్వహించారన్నది ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌తోపాటు మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్లీనరీలో పాల్గొన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం ఉంది. మూడ్రోజులపాటు జరిగిన ఈ ప్లీనరీ మంగళవారంతో ముగియూల్సి ఉండగా.. గ్రేహౌండ్స్ బలగాలు మెరుపుదాడి చేసి 8 మందిని కాల్చివేశాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే తునికాకు సేకరణలో రేటు నిర్ణయం, ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో  ఇసుక రీచ్‌ల వ్యవహారం, ఇటీవలి ఎన్‌కౌంటర్లు తదితర అంశాలను ఈ ప్లీనరీలో చర్చించినట్లు సమాచారం.
 
 కొనసాగుతున్న ఖాకీల వేట
 మంగళవారం నాటి ఎన్‌కౌంటర్ తర్వాత సుమారు 250 మందికి పైగా మావోయిస్టులు తప్పించుకుపోయారని అనుమానిస్తున్న పోలీసులు సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అటు తెలంగాణ.. అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రత్యేక అదనపు బలగాలను రంగంలోకి దించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.

మరిన్ని వార్తలు