ఆప్కోలో గోల్‌మాల్ రూ.600 కోట్లు? | Sakshi
Sakshi News home page

ఆప్కోలో గోల్‌మాల్ రూ.600 కోట్లు?

Published Thu, Mar 3 2016 7:58 AM

ఆప్కోలో గోల్‌మాల్ రూ.600 కోట్లు? - Sakshi

చేనేత సొసైటీలకు బదులు తమిళనాడు నుంచి వస్త్రాల కొనుగోళ్లు
* తక్కువ ధరకు నాసిరకం వస్త్రాలు తెచ్చి ఎక్కువ ధరకు అంటగట్టిన వైనం
* ఉత్పత్తే చేయని స్థానిక సొసైటీల పేరిట దొంగ బిల్లులు
* పాలకమండలి సభ్యులు, అధికారుల పాత్రపై అనుమానాలు
* ఆర్‌వీఎంకు వస్త్రాల సరఫరాలోనూ భారీగా అవకతవకలు
* నెల రోజులుగా ముందుకు సాగని త్రిసభ్య కమిటీ విచారణ
*  విచారణలో కమిటీకి సహకరించని టెస్కో పాలక మండలి, అధికారులు


 సాక్షి, హైదరాబాద్: చేనేత సహకార సంఘాల ముసుగులో ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో)లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. పాలకమండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న పాలనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని రూ. 600 కోట్ల మేర సొమ్మును పక్కదారి పట్టించారు. తమిళనాడులో పవర్‌లూమ్‌లపై తయారైన నాసిరకం వస్త్రాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకువచ్చి... ఇక్కడి చేనేత సహకార సంస్థల పేరిట ఎక్కువ ధరకు అంటగట్టారు. ఇందుకోసం తప్పుడు రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం వస్త్రోత్పత్తి చేయడం లేని చేనేత సహకార సొసైటీల నుంచి కూడా వస్త్రాన్ని సేకరించినట్లు, ఆ సొసైటీలు లావాదేవీలు జరిపినట్లు రికార్డులు తయారు చేశారు.

ఇలా సేకరించిన నాణ్యత లేని వస్త్రాన్ని రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సరఫరా చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా అంటగట్టారు. ఇందులో విద్యార్థులకే కోట్లాది మీటర్ల వస్త్రాన్ని సరఫరా చేశారు. ఒక్కో మీటర్ వస్త్రంపై మూడు నుంచి నాలుగు రూపాయల చొప్పున కమిషన్ రూపంలో జేబులో వేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది జూలైలో ఆప్కోను విభజించి తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)ను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర విభజన (అపాయింటెడ్ డే) తర్వాత కూడా ఉమ్మడిగానే వస్త్రాల కొనుగోలు, ఇతర లావాదేవీలు జరగడంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 ఉత్పత్తే లేని సొసైటీల నుంచి కొనుగోళ్లు!
 తెలంగాణలో 545 చేనేత సహకార సంఘాలు ఉండగా.. వాటిలో కేవలం 60 సొసైటీలు మాత్రమే చురుగ్గా వస్త్రోత్పత్తి చేస్తున్నాయి. ఈ సొసైటీల ద్వారా తయారయ్యే వస్త్రాల విలువ రూ.50 కోట్లకు మించి ఉండదని అంచనా. కానీ రాష్ట్రంలోని సొసైటీల నుంచే సుమారు రూ.300 కోట్ల విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసినట్లు ఆప్కో అధికారులు రికార్డులు సృష్టించారు. తమిళనాడు నుంచి ఏమాత్రం నాణ్యత లేని వస్త్రాలను తెచ్చి ఇక్కడి సొసైటీల్లో ఉత్పత్తి చేసినట్లు దొంగ రసీదులు చూపారు. ఉదాహరణకు ప్రస్తుతం టెస్కో పాలక మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీ కొన్నేళ్లుగా అంగుళం వస్త్రాన్ని కూడా ఉత్పత్తి చేయడం లేదు. కానీ ఆ నేత తమ సొసైటీ ఏటా వస్త్రోత్పత్తి ద్వారా రూ.50 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు రికార్డులు సృష్టించాడు.

ఇదే తరహాలో కొందరు పాలక మండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై బినామీ లావాదేవీలు చూపారు. కేవలం రాజీవ్ విద్యా మిషన్‌కు సరఫరా చేసిన వస్త్రాల ద్వారానే రూ.400 కోట్లు పక్కదారి పట్టినట్లు అంచనా. ఇక చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి రూ.133 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉండగా... ప్రస్తుతం ఆప్కో గోదాముల్లో కోటి రూపాయల విలువ చేసే వస్త్రాలు కూడా నిల్వ లేవు. దీనిపైనా లెక్కలు తేలాల్సి ఉంది. మరోవైపు బకాయిలను సాకుగా చూపుతూ సంఘాల నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో చేనేత కార్మికుల వద్ద రూ.5 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు పేరుకుపోయాయి. ఆరు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 త్రిసభ్య కమిటీతో విచారణ
 అపాయింటెడ్‌డే నుంచి జరిగిన లావాదేవీలపై ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా చేనేత విభాగం డిప్యూటీ డెరైక్టర్ రామగోపాల్, ఏడీలు వెంకటేశ్వర్లు, రత్నమాలలతో కూడిన కమిటీని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఏర్పాటు చేశారు. సహకార సంఘాల వారీగా సేకరించిన వస్త్రం, ఏ ప్రభుత్వ విభాగానికి ఎంత సరఫరా చేశారు వంటి అంశాలపై ఈ కమిటీ ఆప్కో నుంచి వివరాలు కోరింది. అయితే ఈ వ్యవహారంలో కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ఓ కీలక అధికారి పాత్ర ఉండటంతో.. కమిటీకి సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలిసింది. ఆప్కో అక్రమాలపై లోతుగా విచారణ జరిగితే తప్ప పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపించడం లేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement