సింహవాహనంపై శ్రీనివాసుడు

18 Sep, 2015 10:19 IST|Sakshi

తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు శుక్రవారం ఉదయం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై విహరించారు. స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు.

 

జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మార్మోగుతున్నాయి.

కాగా  సాయంత్రం ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది.

మరోవైపు కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు వెలసిన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా విలసిల్లుతూ ఉంటోంది. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకునికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే స్వామివారికి జరిగే అన్ని సేవలలో... ప్రతి శుక్రవారం జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ అభిషేక సేవలో స్వామివారి మూలవిరాట్‌కు కొన్ని ప్రత్యేక పదార్ధాలతో మర్ధనా చేస్తారు. అందుకే తిరుమలేషుని అర్చవతార రూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ అభిషేక ప్రత్యేకత గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు 'సాక్షి'కి వివరించారు.

మరిన్ని వార్తలు