నేడు జెడ్పీ మీటింగ్‌

1 May, 2017 23:55 IST|Sakshi
నేడు జెడ్పీ మీటింగ్‌

- తాగునీరు, ధాన్యం కొనుగోళ్లపై చర్చ జరిగేనా?
- అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ జెడ్పీటీసీలు


సాక్షి, మెదక్‌: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనుంది. సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ రాజమణి మురళీయాదవ్‌ అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం జరుగనుంది. రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మెదక్‌ జిల్లా జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం మూడు మాసాలకోమారు సమావేశం జరుగుతున్నప్పటికీ మెదక్‌ జిల్లా సమస్యలు పెద్దగా చర్చకు రావడం లేదు. అలాగే జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరగలేదు. జిల్లాలో ప్రస్తుతం ప్రజలు తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

జిల్లాలోని 300 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. మంచినీటి పథకాలు చాలా వరకు పనిచేయక పోవడం, భూగర్భ జలాలు పడిపోయి బోరుబావులు, చేతిపంపులు పనిచేయడం లేదు. దీంతో పల్లెల్లోని ప్రజలు నీటికోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు రూ.26 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసినా.. ఇప్పటి వరకు నిధులు రాలేదు. దీంతో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నిధులు లేక ఆర్‌డబ్లు్యఎస్‌ శాఖ సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రబీలో ధాన్యం పండినా దాన్ని కొనుగోలు చేసేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మూడు రోజులుగా కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. రవాణా సమస్య ఉండటంతోపాటు తూకంలో రెండు కిలోలు అదనంగా పక్కకు తీసి పెట్టాలన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

తూకాల్లోమోసానికి పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో లెవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ జెడ్పీటీసీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ జెడ్పీటీసీలు మంగళవారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీరు, ధాన్యం కొనుగోలు అంశాలనే ప్రధానంగా లెవనెత్తనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఈజీఎస్‌ జెడ్పీటీసీ సభ్యులకు రూ.8లక్షల చొప్పున నిధులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పనులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశం కూడా మంగళవారం నాటి జెడ్పి సర్వసభ్య సమావేశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు