ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

2 Oct, 2016 18:14 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రతాప్‌రెడ్డి

టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం గజ్వేల్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ తదితర పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజల సమస్యలను మరిచి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సహేతుకంగా లేదని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో 5లక్షలు, మరో జిల్లాలో 6లక్షలు, ఇంకో జిల్లాలో 40  లక్షల జనాభా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు ప్రయత్నం జరగాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షులు బొల్లారం ఎల్లయ్య, నగర పంచాయతీ కౌన్సిలర్‌ ఆర్‌కె. శ్రీనివాస్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు విరాసత్‌అలీ, షరీఫ్‌, నాయకులు మతీన్‌, హన్మంతరెడ్డి, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు