ఉద్యోగం వచ్చేసరికి... ప్రాణం పోయింది

10 Mar, 2016 11:31 IST|Sakshi
ఉద్యోగం వచ్చేసరికి... ప్రాణం పోయింది

కలలు నెరవేరకుండానే నిరుద్యోగి కన్నుమూత
ఏడాది కాలం కొనసాగిన నియామక ప్రక్రియ
గ్రూప్-4 నియామకాలపై నిరుద్యోగుల్లో ఆందోళన

 
గుంటూరు(నగరంపాలెం): ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నెలల తరబడి కలలు కన్న ఓ వికలాంగుడు కన్నుమూశాడు. ఆశించిన ఉద్యోగం చేతికందే నాటికి అలసిపోయిన ఆశలతో తుదిశ్వాస విడిచాడు. పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న ఎడతెగని ఆలస్యం అతనిలో తీవ్ర నైరాశ్యం నింపింది. దీంతో మానసిక ఆందోళనకు లోనై ఈ నెల ఒకటో తేదీన కన్నుమూశాడు. పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు(41) అంధుడు. జిల్లాలో 2015 మార్చి 31వ తేదీన వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్‌లో క్లాస్-4 ట్యాంక్ క్లీనర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ నియామక ప్రక్రియ కొనసాగింది. నాగరాజు మెరిట్‌లిస్ట్‌లో, షార్టు లిస్టులో అర్హత సాధించటంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యాడు. అనంతరం వికలాంగత్వం జన్యునిటీ సర్టిఫికెట్ కోసం జనవరిలో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫిబ్రవరిలో ఆ సర్టిఫికెట్ అందింది. దీంతో నియామక ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ఈనెల 1న హైబీపీ కారణంగా తలలో నరాలు పగిలి నాగరాజు చనిపోయినట్లు వికలాంగశాఖ కార్యాలయానికి సమాచారం వచ్చింది.

ఏడాదికాలం కొనసాగిన ప్రక్రియ..
గత సంవత్సరం మార్చి 31న జిల్లాలో క్లాస్-4, గ్రూప్-4కు సంబంధించి 74 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. క్లాస్-4కు సుమారు 3,700 దరఖాస్తులు రాగా, వాటిని క్లాసిఫికేషన్ చేసి మెరిట్ లిస్టు తయారు చేయటానికి వికలాంగుల శాఖ అధికారులకుఐదునెలల సమయం పట్టింది. సెప్టెంబరులో లిస్టు విడుదల చే శారు. నెలరోజులు అభ్యంతరాలు స్వీకరించారు. డిసెంబర్‌లో షార్ట్ లిస్టును విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జన్యునిటీ టెస్టుకోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేసేవారు.

జనవరిలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో సర్టిఫికెట్‌లు అందజేశారు. నియామక ఉత్తర్వులు సిద్ధం చేసి గురువారం ఉదయం అభ్యర్థులకు ఇవ్వనున్నారు. ఇక గ్రూప్ 4 నియామకాలపై ఇప్పటి వరకు మెరిట్‌లిస్ట్ మాత్రమే విడుదల చేశారు. దానికి షార్టు లిస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే. జరుగుతున్న ఆలస్యంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

మరిన్ని వార్తలు