యూపీ ముఠా అరెస్టు

9 Aug, 2016 21:24 IST|Sakshi
  • ఆయుధాలు స్వాధీనం.. డీఎస్పీ తిరుపతన్న వెల్లడి
  • సంగారెడ్డి రూరల్‌: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముఠాను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. సంగారెడ్డి పట్టణం లాల్‌సాబ్‌గడ్డకు చెందిన మహ్మద్‌రీయాసద్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజుయాదవ్‌ కులబ్‌గూర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో కూలీగా పని చేస్తున్నారు.

    ఈ క్రమంలో రీయాసద్‌కు రాజుయాదవ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి ఆయుధాలతో ధనవంతులను బెదిరించి డబ్బులు సంపాదించాలన్న పథకం వేశారు. ఆందుకు అవసరమైన ఆయుధాలను ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన అజయ్‌కుమార్‌ యాదవ్, వికాశ్‌ యాదవ్‌ ద్వారా రాజు యాదవ్‌ తెప్పించాడు. ఈ క్రమంలో ఈ నెల 8న సాయంత్రం పసల్‌వాది వద్దగల దాబాలలో రూరల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

    అనుమానాస్పదంగా కనిపించిన ఈ నటుగురిని అదుపు లోకి తీసుకుని తనిఖీ చేయగా వారి నుంచి 2 దేశీయ తపంచాలు, 3బుల్లెట్లు, రెండు కత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి విచారించగా ఈ ఆయుధాలతో ధనికులను బెదిరించాలనే పథకం వేసినట్లు నిందితులు తెలిపారని డీఎస్పీ పేర్కొన్నారు. సోమవారం అరెస్ట్‌ చేసిన ముఠా సభ్యులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. సమావేశంలో రూరల్‌ సీఐ నరేందర్, యస్‌ఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు