ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు!

21 Oct, 2016 15:12 IST|Sakshi
ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు!
ఉద్యోగభద్రతపై యూహెచ్‌సీల సిబ్బంది కలవరం
నిర్వహణను ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించిన ప్రభుత్వం
16 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలంటున్న ఉద్యోగులు
సాక్షి, రాజమహేంద్రవరం :  పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ) 16 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తూ, ఇన్నేళ్ల సర్వీసు కారణంగా  కొలువు ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతుందని, బతుక్కి భరోసా దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఉన్న ఉద్యోగమైనా ఉంటుందా, ఊడుతుందా అన్న ఆందోళన పట్టుకుంది. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 2000లో ఏర్పాటు చేసిన యూహెచ్‌సీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అపోలో, ధనుష్‌ ఆస్పత్రులకు అప్పగించింది. ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి భంగమూ ఉండదని ప్రభుత్వం చెబుతున్నా వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహణలోకి వచ్చిన తమను భవిష్యత్‌లో నిబంధనల మేరకు అర్హతలు, నైపుణ్యం లేవంటూ తొలగిస్తారేమోనన్న ఆందోళనలో ఆక్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)లు, సీవోలు, వైద్య సహాయకులు  ఉన్నారు. 
19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది
జిల్లాలో 19 యూహెచ్‌సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక సీవో, వైద్య సహాయకులు ఉన్నారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, కాకినాడ, రాజమహేంద్రరం కార్పొరేషన్ల పరిధిలోని మెుత్తం 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి నిర్వహణను చేపడుతున్న అపోలో, ధనుష్‌ సంస్థలు.. ‘ఇ–యూపీహెచ్‌సీ’ల పేరుతో పట్టణ పేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యూహెచ్‌సీలను ధనుష్, మిగతా జిల్లాల్లో ఉన్న వాటిని అపోలో నిర్వహించనున్నాయి. ఆ రెండు సంస్థలూ మూడేళ్లపాటు ఈ సేవలు అందించనున్నాయి. ఇ–యూపీహెచ్‌సీల నిర్వహణకు అవసరమయ్యే నిధులు జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్‌ (ఎన్‌యూహెచ్‌ఎం) ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతమున్న సేవలతోపాటు ప్రాథమిక ఆరోగ్య రక్షణ, టెలీ మెడిసిన్‌ సదుపాయాలు పట్టణ పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగశాల, జనరల్‌ ప్రాక్టీషనర్, నర్సింగ్‌ సేవలను అదనంగా కల్పించనున్నారు. 
కొందరిని తొలగించిన ‘అపోలో’
అయితే ధనుష్‌ సంస్థ అప్పటికే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తుండగా, అపోలో మాత్రం తమ పరిధిలోని యూహెచ్‌సీల్లో  కొంత మందిని తొలగించింది. సిబ్బంది ఆందోళన చేయడంతో తొలగించిన వారిలో కొందరిని తిరిగి తీసుకుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో ఉత్పన్నమైతే తమ బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో పని చేస్తూ వచ్చిన సిబ్బంది సగటు వయస్సు 40కి పైగా ఉందని, తమకు మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు. 
2006లో 90 శాతం  ప్రభుత్వోద్యోగాలు
యూహెచ్‌సీలను 2000లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వీటి నిర్వహణను స్థానిక ఎన్‌జీవోలకు అప్పగించింది. సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించింది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రతిభ, పని చే సిన కాలం ఆధారంగా ప్రభుత్వోద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌ లభించింది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో యూహెచ్‌సీల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలలో దాదాపు 90 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఇదే ఆశతో ప్రతి నెలా అరకొర జీతాలు కూడా  రాకున్నా 16 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళితే ఇన్నేళ్లూ తాము చేసిన సేవలకు గుర్తింపు లేకుండా పోతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే పోస్టుల్లో గతంలో లాగే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు