నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం

28 Nov, 2016 22:55 IST|Sakshi
నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం
విశాఖ జోన్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఓంకారేశ్వర్‌
భానుగుడి (కాకినాడ) : దేశంలో పన్ను పరిధిలోకి రాకుండా బ్లాక్‌మనీ రూపంలో చలామణిలో ఉన్న సొమ్ము రూ.14.5 లక్షల కోట్లని, అందులో రూ.ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉండగా మిగిలిన నల్లధనాన్ని డిసెంబరు 30 నాటికి ఏ మూలనఉన్నా వెలికితీసేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని విశాఖపట్నం జోన్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఓంకారేశ్వర్‌ హెచ్చరించారు. సోమవారం స్థానిక మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నల్లకుబేరులకు పలు హెచ్చరికలు జారీచేశారు. 2017 జనవరి నుంచి జీఎస్‌టీ బిల్లు అమలు కానుందని, దాచుకున్న నల్లధనాన్ని బయటపెట్టకుంటే కటాకటాల పాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న సొమ్ములో రూ.7వేల కోట్లు ఉగ్రవాదుల వద్ద, రూ.700 కోట్లు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఉన్న మావోయిస్టుల వద్ద ఉందని ఇది రికవరీ కాదన్నారు. మిగిలినదంతా ఏ రూపంలో ఉన్నా పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 25 కోట్ల పాన్‌కార్డులు జారీచేస్తే అందులో ఐదుకోట్ల మంది మాత్రమే వాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి విధాన నిర్ణయానికి కొందరు మోకాలడ్డుతూ పన్ను ఎగవేద్దామనుకుంటున్నారని, రానున్న చట్టాలతో అడ్డులన్నీ తొలగిపోనున్నట్టు పేర్కొన్నారు. కెన్యాలో 80 శాతం లావాదేవీలన్నీ నగదు రహితమేనని, మున్ముందు మనదేశం యావత్తు అదే తరహా వ్యవస్థ ఏర్పాటు కానుందన్నారు. పన్ను చెల్లించకుండా దాచినది ఏదైనా ( బంగారం, భవనాలు, స్థలాలు) అది బ్లాక్‌మనీ లిస్టులోకే వస్తుందన్నారు. అలా దాచినవారెవరైనా కఠినశిక్షలు అనుభవించక తప్పదని  ఓంకారేశ్వర్‌  హెచ్చరించారు. వ్యాపారస్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 300 కోట్ల నగదు స్వాధీన పరుచుకున్న చరిత్ర ఉందన్నారు. ఇక అంతా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగనున్నందున దాచినవన్నీ బయటపెట్టి శిక్షల నుంచి తప్పించుకోవాలని సూచించారు. ఈ నగదు రహిత లావాదేవీల కారణంగా పేదప్రజలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందుతాయన్నారు. ఈ సమావేశంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గ్రంధినారాయణరావు(బాబ్జీ), పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు