డ్రైవరు లేకుండానే కదిలిన బస్సు

12 Jul, 2016 03:01 IST|Sakshi
డ్రైవరు లేకుండానే కదిలిన బస్సు

* విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వైనం   
* తృటిలో తప్పిన ప్రమాదం

ఆత్మకూరురూరల్ : న్యూట్రల్‌లో ఉన్న బస్సు డ్రైవరు లేకుండానే ముందుకు కదిలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని డ్రైనేజీ కాలువలోకి ఒరిగిన సంఘటన ఆత్మకూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బస్సు నిండా ప్రయాణికులున్నా అదృష్టవశాత్తుఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు మర్రిపాడు మార్గంలోని గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. అయితే అదే సమయంలో నెల్లూరు మార్గంలో ప్రయాణికులు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది ఆ బస్సును నెల్లూరు రూట్లో తిప్పేందుకు నిర్ణయించారు.

దీంతో బస్సునిండా ప్రయాణికులు ఎక్కారు. డిపో నుంచి వెలుపలికి వచ్చిన బస్సుకు నెల్లూరు బోర్డు లేకపోవడంతో న్యూట్రల్‌లో ఉంచి డ్రైవరు బోర్డు తెచ్చేందుకు డిపోలోకి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి ఒరిగింది. స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడ్డాయి. అదే సమయంలో సమీపంలోని విద్యుత్ సిబ్బం ది ఏఈ ఆధ్వర్యంలో తీగల మరమ్మత్తులు చేపట్టి ఉండటంతో సరఫరా నిలిపివేశారు. బస్సుపై తీగలు తెగిపడిన సమయంలో సరఫరా లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. విద్యుత్ స్తంభం విరిగిపోయింది. సమీపంలోని పలువురు ఆందోళన చెందుతూ బస్సువద్దకు గుమిగూడారు. ప్రయాణికులు సైతం కొంతసేపు కేకలు వేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
 
కట్టలు విరిగి..
రామన్నగారిపల్లి(కలువాయి): చింతలపాళెం వెళ్తున్న బస్సు కట్టలు విరిగి అదుపుత ప్పిన సంఘటన సోమవారం సాయంత్రం రామన్నగారిపల్లి సమీపంలో జరిగింది. వివరాలు..కలువాయి నుంచి చింతళపాళెం వెళ్తున్న బస్సుకు రామన్నగారిపల్లి వద్దకు వచ్చే సరికి కట్టలు విరిగిపోయాయి. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయి తాటిమానుకు ఆనుకుని నిలిచిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసి ఉంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు