వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ దాడి

16 Jul, 2016 03:15 IST|Sakshi
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ దాడి

శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భైరి ఢిల్లీరావు(రమేష్)పై స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి దాడి చేశారు.   108 సహాయంతో రిమ్స్ ఆసుపత్రిలో ఢిల్లీరావు చేరారు. ఢిల్లీరావు తలకు, కుడి కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలను పొందుతున్నారు. ఢిల్లీరావు తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను సాక్షికి వివరించారు. భైరి ప్రాంతానికి చెందిన భైరి శివప్పడు, బి.సుదర్శనరావు, బి.ప్రకాష్, బి.మురళీ, సాధు శిమ్మ సూర్యనారాయణ, ఎండు అమ్మన్నరావు, ఎండు లక్ష్మణరావు, తెలుగు రాజులు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఢిల్లీరావు ఆరోపించారు.

భైరి గ్రామంలో తనకు, భైరి శివప్పడుకు చెందిన ఎకరాన్నర స్థలంలో గట్టు కోసం కొంత కాలంగా వాదనలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల ఓ సర్వేయరును పిలిపించి గట్టు సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం చెరుకుతోట ఆ స్థలంలో ఉన్న కారణంగా కొద్ది రోజులు సర్వేను వాయిదా వేయాల్సిందిగా సర్వేయర్ సూచనల మేర కు నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో భైరి శివప్పడు సూచనల మేరకు జేసీబీ సాయంతో  పొలంలో ఉన్న గట్టును తొలగించేందుకు ప్రయత్నించగా, తాను ఆ జేసీబీ డ్రైవర్‌కు జరిగిన విషయం ఫోన్ ద్వారా తెలియజేయడంతో  గట్టును తొలగించే ప్రయత్నాన్ని విరమించినట్లు చెప్పారు.

అది మనసులో పెట్టుకొని గురువారం రాత్రి పొలం నుంచి తనతో పాటు బైరి గ్రామానికి చెందిన కంచు శ్రీను, కె.గణేష్, కోటిపల్లి గణేష్, భూర్లి రాజారావు, బైరి జగదీష్‌లు తిరిగి వచ్చి  ఆర్టీసీ కాంప్లెక్ వద్ద  విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో  భై రి శివప్పడు మరికొందరు సమ్మిడిలు, కర్రలతో తమపై దాడికి పాల్పడ్డారన్నారు. ఊహించని ఈ సంఘటనతో అక్కడ నుంచి కొందరు పారిపోయారని తెలిపారు. 108 సహాయంతో రిమ్స్‌లో తాను గురువారం అర్ధరాత్రి చేరి వైద్యసేవలు పొందుతున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు