కొత్త పుంతలు... పాత కంతలు!

10 Feb, 2015 00:38 IST|Sakshi

ప్రణాళికా సంఘం రద్దయి కొత్తగా ఏర్పాటైన ‘నీతి ఆయోగ్’ పాలకమండలి తొలి సమావేశం తీరుతెన్నులు చూసినవారికి ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. అధికారంలోకొచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అత్యంత కీలకమైన తొలి విధాన నిర్ణయం నీతి ఆయోగ్ ఏర్పాటు. దాని స్వరూప స్వభావాల గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాలు కొత్త సంస్థపై పూర్తి అవగాహన కల్పించలేకపోయాయి. అయితే, ఆదివారంనాటి సమావేశంలో ప్రధాని చేసిన ప్రసంగం ఈ దిశగా కొంత ప్రయత్నం చేసింది.

రాష్ట్రాల అవసరాల మేరకే పథకాలు రూపొందించడం...నిధులు, సాంకేతికతల్లో వాటికి సాధికారత కల్పించడం, సహకార సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. పై స్థాయిలో పథకాలు రూపొందించి రాష్ట్రాలపై రుద్దే పాత విధానానికి స్వస్తి పలికి...వాటి అవసరాలకు తగిన పథకాలు అమలుచేయడానికి సహకరిస్తామన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న పథకాల్లో కొన్నిటిని రద్దు చేయడం, మరికొన్నిటిని రాష్ట్రాలకు బదిలీ చేయడంవంటి ప్రతిపాదనలున్నాయి. అందుకోసం సీఎంలతో ఒక ఉపసంఘం కూడా ఏర్పాటుచేస్తారు.

ఇదికాక రాష్ట్రాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ఒక ఉపసంఘం, నిరంతర ‘స్వచ్ఛ భారత్’ కోసం మరో ఉపసంఘం ఏర్పాటు కాబోతున్నాయి. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి అంశాల్లో రెండు టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కనుక ఆ రెండూ...వాటికి సంబంధించిన పథకాలూ ఇకపై రాష్ట్రాల పరిధిలోనే ఉండబోతాయన్న అభిప్రాయం కలుగుతుంది.
 
సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మోదీ చెప్పారు గనుక  ఆర్థిక విధానాల రూపకల్పనలో, ఆర్థికాభివృద్ధిలో కేంద్రమూ, రాష్ట్రాలూ కలిసి పనిచే స్తాయనుకోవచ్చు. రాష్ట్రాల అభిప్రాయాలకు విలువుంటుందని భావించవచ్చు. ప్రణాళికా సంఘం పనితీరు దీనికి భిన్నం. విధాన రూపకల్పన పూర్తిగా ఆ సంస్థే చూసుకునేది. ఆ విధానాలపై అది కేవలం రాష్ట్రాల అభిప్రాయాలను మాత్రమే అడిగేది. వాటి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే అమలు చేయించేది. నీతి ఆయోగ్ మాత్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రతిపాదనలేమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా పథకాలు రూపొందిస్తుందని  చెబుతున్నారు. అయితే, దీన్నే వికేంద్రీకరణగా చెప్పడం సరికాదు.

అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు పూర్తిగా స్థానిక సంస్థలకివ్వడమే వికేంద్రీకరణలోని కీలకాంశం. స్థానిక సంస్థల కార్యకలాపాలను వెలుపలినుంచి సమీక్షిస్తూ, అవసరమైన సూచనలిస్తూ...అవి విజయవంతం కావడానికి తోడ్పడటం కేంద్ర, రాష్ట్రాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. అలా అయినప్పుడే అది నిజమైన వికేంద్రీకరణ అవుతుంది. అయితే, ఆ విషయంలో మోదీ ప్రసంగం స్పష్టత ఇవ్వలేదు. నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం కోరుతూ, వికేంద్రీకరణను ప్రస్తావించిన సీఎంలు స్థానిక సంస్థల విషయంలో మాత్రం తమ వైఖరేమిటన్నది చెప్పలేదు.

ఇక నిర్మాణరీత్యా నీతి ఆయోగ్ కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు...నిపుణులతో ఉండే మేథో బృందంగా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు... ఈ సంస్థలో పరిశోధన, కన్సల్టెన్సీ, టీమ్ ఇండియా విభాగాలుంటాయని తెలిపింది. ఈ వివరాలను చూస్తే రద్దయిన ప్రణాళికా సంఘానికీ, నీతి ఆయోగ్‌కు పెద్ద తేడా లేదనిపిస్తుంది. లోగడ ఉన్న ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉన్న జాతీయాభివృద్ధి మండలి(ఎన్‌డీసీ)కి జవాబుదారీగా ఉండేది. ఎన్‌డీసీ స్థానంలో ఇప్పుడు సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండే పాలకమండలి ఏర్పడింది.
 
అయితే,  ‘సహకార సమాఖ్య’కు ప్రతీకగా ఉండబోయే నీతి ఆయోగ్ తొలి సమావేశాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు పాత పద్ధతిలోనే నిధుల గురించి, ఇతర సమస్యల గురించి కేంద్రానికి వినతులు చేసుకోవాల్సివచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకూ ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆర్థిక లోటును భరించే విషయంలోనూ కేంద్రం పార్లమెంటు వేదికగా ఎన్నో హామీలు ఇచ్చివున్నది. అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ కూడా అందుకు పట్టుబట్టింది. తీరా అధికారంలోకొచ్చాక ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది.

ఒకపక్క సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూనే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శించడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? ఒక మెరుగైన వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్నవారు ఇలాంటి అంశాల్లో ఇంకా మూస వైఖరినే అవలంబించడం సరైంది కాదు. అటు తెలంగాణ సైతం వచ్చే వేసవి కాలంనాటికి రాష్ట్రం ఎదుర్కోబోయే విద్యుత్ సమస్యల గురించి ప్రస్తావించింది. ఆదుకోవాలని కోరింది. ఇక కేంద్రం ఆధ్వర్యంలో ఉండే పథకాలు నానాటికీ చిక్కిపోయి ఇప్పటికి 66 మిగిలితే వాటిని కూడా సాధ్యమైనంతవరకూ కుదించబోతున్నారు.

ఇప్పటికే ఉపాధి హామీ పథకం అటకెక్కడం ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల అమలు తర్వాత చాలా పథకాలు కనుమరుగయ్యాయి. సామాజిక బాధ్యతలను క్రమేపీ తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల్లో ఎన్ని మిగులుతాయో అనుమానమే. పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, అనారోగ్యంవంటివి ఇంకా సమస్యలుగానే మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం వంటివి కుదిస్తే దాని ప్రభావం గ్రామీణ పేదలపై తీవ్రంగా ఉంటుంది.

నీతి ఆయోగ్ ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధికార వికేంద్రీకరణ గురించి సమీక్షించేటపుడు స్థానిక సంస్థల అధికారాల గురించి పట్టించుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన అర్ధంలో నూతన వ్యవస్థ ఆవిర్భవించిందన్న అభిప్రాయం కలుగుతుంది. లేనట్టయితే పేరులో తప్ప, పథకాల కోతలో తప్ప మిగిలిందంతా ఒకటేనన్న భావన ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలు