మళ్లీ ‘సంక్షేమ బాట’లో...

4 Apr, 2019 00:17 IST|Sakshi

దేశంలో ఇరవైయ్యేడేళ్ల క్రితం ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రారంభించి సంక్షేమాన్ని క్రమేపీ అట కెక్కిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ స్వరం మారింది. మంగళవారం ఆ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాల సందడే అధికం. జాతీయ స్థాయిలో ఇది కాంగ్రెస్‌కు కొత్త కావొచ్చుగానీ... 2004లోనే ఆ పార్టీ నాయకుడిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేకానేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి, వాటిని జయ ప్రదంగా అమలు చేసి కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని ఆశ్చర్యపరిచారు. ఆయన చేపట్టిన పలు పథకాలను ఇతర రాష్ట్రాల్లోని వేరే పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అధ్యయనం చేసి అమలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వాన ఆనాడున్న యూపీఏ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు.  ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ఇందిరాగాంధీ కాలానికి, వైఎస్‌ సంక్షేమ పథానికి మళ్లిందని చెప్పుకోవాలి. 54 పేజీల మేనిఫెస్టో నిరుద్యోగులు, నిరుపేదలు, రైతులు, మహిళలు తదితర వర్గాల వారికి ఎన్నో వాగ్దానాలు చేసింది.

నిరుపేదలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని మేనిఫెస్టో చెప్పింది. అలాగే ఆరోగ్య సంరక్షణ హక్కు చట్టం చేస్తామని తెలిపింది. ఆరోగ్య భద్రత పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైనది. కేవలం నిరుపేదలైన కారణంగా మెరుగైన వైద్య సేవలందక ఎందరో అకాల మృత్యువాత పడుతున్నారు. తమకున్నదంతా ఊడ్చి పెట్టి వైద్యం చేయించుకుని పూట గడవటం ఎలాగో తెలియక ఇబ్బందులు పడుతున్నవారున్నారు. ఈ వర్గాలవారు ఎంత పెద్ద జబ్బు చేసినా కార్పొరేట్‌ ఆసుపత్రిలో  ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు వైఎస్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం తోడ్పడింది.  ఇదొక్కటే కాదు... అత్యవసర సమయాల్లో ఆపదలో చిక్కుకున్నవా రిని, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్‌ సర్వీసులను కూడా ఆయన ప్రారంభించారు. పల్లె వాకిళ్లలో నేరుగా ప్రాణావసర ఔషధాలను ఉచితంగా అందించే 104 సేవలు అమల్లోకి తెచ్చారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభిస్తామని చెబుతోంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఆరోగ్యానికి 3 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.  చాలా దేశాలు తమ జీడీపీల్లో సగటున దాదాపు 9 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాయి. మనం మాత్రం ఇప్పటికీ ఒకటిన్నర శాతం దగ్గరే ఉండిపోయాం. ఈ విషయంలో పాలకులు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న 20 శాతం కుటుంబాలకు...అంటే అయిదు కోట్ల కుటుంబాలకు నెలకు రూ. 6,000ను కనీస ఆదాయ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని మేనిఫెస్టో తెలిపింది. దీన్ని పేదరికంపై సర్జికల్‌ స్ట్రయిక్‌గా మేనిఫెస్టో అభివర్ణించింది. ఉదారవాద ఆర్థిక విధానాల తర్వాత చేతివృత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎందరో పూట గడవటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కనీస ఆదాయ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే ఆ వర్గాలవారికి ఊరట దొరుకుతుంది. అయితే ఇలాంటి పథకాలు అమలు చేయడానికి అవసరమైన వనరుల కల్పనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. రాష్ట్రాల భాగస్వామ్యం కూడా తీసుకుంటా మంటే అమలు సజావుగా ఉండదు. రైతులకు రుణాల నుంచి విముక్తి కలిగిస్తామని, పంటలకు మెరుగైన మద్దతు ధరలు కల్పించి, పెట్టుబడి ఖర్చు తగ్గేలా చేస్తామని చెప్పడం ఆకర్షణీయమైనదే. అలాగే రుణం చెల్లించలేని రైతులపై క్రిమినల్‌ కేసులు పెట్టే పద్ధతికి స్వస్తి చెబుతామంటున్నది. విద్యారంగానికి జీడీపీలో 6 శాతం కేటాయిస్తామని మేనిఫెస్టో చెబుతోంది. పదో తరగతి వరకూ ఉచిత విద్య అందిస్తామంటున్నది. ప్రతి బడిలో అర్హులైన ఉపాధ్యాయుల్ని, ఇతర సౌకర్యాలను సమకూరుస్తామని హామీ ఇస్తోంది.

మంచి ఆలోచనే. కానీ వైఎస్‌ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం అంతకన్నా చాలా ముందుకుపోయింది. అట్టడుగు వర్గాల పిల్లలు సైతం ఇంజనీర్లు, డాక్టర్లయ్యేందుకు దోహదపడింది. వారు ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేం దుకు సాయపడింది. పర్యవసానంగా ఎన్నో పేద కుటుంబాలు మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విద్యారంగానికి సంబంధించి ఇంకా ఆ స్థాయి ఆలోచన చేయలేకపోయింది. ప్రభుత్వ రంగంలోని 34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అందులో 4 లక్షల ఖాళీలను ఏడా దిలోగా భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఉంటే ఈ హామీకి విశ్వసనీయత మరింత పెరిగేది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లయినా, మహిళలకు చట్టసభల్లో, ఉద్యోగాల్లో 33 శాతం కోటా అయినా 2009నాటి మేనిఫెస్టో వాగ్దానాలే. ఆ తర్వాత అయిదేళ్ల పాలనలో వాటిని పట్టించుకోలేదన్న సంగతి అందరికీ గుర్తుంది.

ఇక సగటున ఏడాదికి 47 రోజులైనా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయలేకపోతున్న ప్రస్తుత దశలో ఏకంగా 150 రోజులు ఉపాధి కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేస్తోంది. కానీ అందుకవసరమైన నిధుల సంగతిని మాత్రం ప్రస్తావించలేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమేమంటే మైనారిటీలకు సంబంధించి సచార్‌ కమిటీ సిఫార్సుల ప్రస్తావన లేదు. 2009, 2014 మేనిఫెస్టోల్లో ఆ సిఫార్సులు అమలు చేస్తామని వాగ్దానం చేసిన పార్టీ ఇప్పుడు వాటి అవసరం లేనంతగా ఆ వర్గాలు సామాజికంగా ఎదిగాయని అనుకుంటున్నదా? విద్వేష నేరాల కట్టడికి నూతన చట్టం తెస్తామని మాత్రం హామీ ఇచ్చింది. ఇంకా స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షించేందుకు వీలుగా ‘రాజద్రోహ’ నేరాన్ని ఆపాదించే భారత శిక్షా స్మృతిలోని 124–ఏ సెక్షన్‌ను తొలగిస్తామని చెబుతోంది. పార్టీల మేనిఫెస్టోలు అనేవి కేవలం హామీల చిట్టాలు కాదు. వాటిద్వారా ఆ పార్టీలు ఇవ్వదల్చుకున్న రాజకీయ సందేశం అంతర్లీనంగా ఉంటుంది. అలా చూస్తే చాలా అంశాల్లో కాంగ్రెస్‌ వైఖరి మారిందన్న సంకేతం కనబడుతుంది. అయితే దీన్ని ఏమేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుందో చూడాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌కు ఎదురుదెబ్బ

దుర్వినియోగానికి తావీయొద్దు

పరిష్కారం అంచుల్లో కర్ణాటకం

ఏపీకి ‘నవరత్నాల’ హారం

అన్నదాతకు ఆసరా ఎలా?

జనం చూస్తున్నారు...జాగ్రత్త!

మళ్లీ ‘రాజద్రోహం’

‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా...

గ్రామీణంవైపు అడుగులు

ఆశల సర్వే!

ఎట్టకేలకు...

మళ్లీ అదే తీరు!

అత్యంత అమానుషం

అమెరికా ఒత్తిళ్లు

మంచంపట్టిన ప్రజారోగ్యం

‘మూకదాడుల’ బిల్లు జాడేది?

విలక్షణ పాలనకు శ్రీకారం

మమత ‘మందుపాతర’

నెరవేరిన జలసంకల్పం

జమిలి పరీక్ష

కీలెరిగి వాత

పసితనంపై మృత్యుపంజా

ఇంత దారుణమా!

వికటించిన మమతాగ్రహం

అట్టుడుకుతున్న హాంకాంగ్‌

దౌత్యంలో కొత్త దారులు

జన సంక్షేమమే లక్ష్యంగా...

సరైన తీర్పు

విదేశీ ‘ముద్ర’!

ఆర్‌బీఐ లక్ష్యం సిద్ధిస్తుందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌