సొంత గూటికి వలస పక్షులు

1 Apr, 2014 00:31 IST|Sakshi
సొంత గూటికి వలస పక్షులు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాక, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న వెంకటస్వామి(కాకా) తనయులు ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తనతోపాటే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ఐకే రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఆయ న టీఆర్‌ఎస్‌లో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ఎట్టకేలకు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.

 కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి తనయులు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా సొంత గూటికి చేరుకోవడంతో ఆయన  వర్గీయులు కూడా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్‌ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నారు. కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కాం గ్రెస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కొంత కాలంగా తటస్థంగా ఉన్నారు. ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో కోనప్ప కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

 హస్తంలో ఇక టిక్కెట్ల రాజకీయం
 ఈ నలుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌లో టిక్కెట్ల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగనున్నాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానంలో పోటీ చేయాలని భావిస్తుండటంతో అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండిపడే అవకాశం ఉంది. సిర్పూర్‌లో కోనేరు కోనప్ప తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండటంతో అక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఉత్కంఠ మొదలైంది. టిక్కెట్ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే ఐకే రెడ్డి ఢిల్లీలో సోమవారం ఉగాది రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ స్థానం నుంచి బరిలో దిగుతారనే అంశంపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

 నిర్మల్ ‘సిట్టింగ్’ పదిలమేనా?
 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యే ఒక్కరి పేరే ప్రతిపాదించింది. కొత్తగా పనితీరు అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆందోళనలో పడ్డారు. పనితీరు బాగాలేని చోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దించుతామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది. కాగా మహేశ్వర్‌రెడ్డి పనితీరుపై నిర్మల్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. మహేశ్వర్‌రెడ్డిని నిర్మల్ నుంచి కాకుండా, ప్రత్యామ్నాయ స్థానం నుంచి బరిలోకి దించితే ఈ అసంతృప్తిని అధిగమించ వచ్చనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

 సిర్పూర్ ‘సీటు’కు తీవ్ర పోటీ
 సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కోనప్ప ఐకే రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇప్పుడు సిర్పూర్ తెరపైకి కోనప్ప రాకతో ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పోటీ మరింత పెరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఏఐసీసీ సభ్యులు సుల్తాన్ అహ్మద్, ఏపీపీఎస్పీ సభ్యుడు పి.రవీందర్‌రావు తదితరులు టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు కోనప్ప రాకతో టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్న వారి సంఖ్య మరింత పెరిగినట్లయింది.

 చెన్నూర్ ఆశావహులపై వినోద్ నీళ్లు
 టీఆర్‌ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి జి.వినోద్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నెలకొంది. మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన చెన్నూరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. వినోద్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో చెన్నూరులో బలమైన నేతలెవరూ తెరపైకి రాలేదు. సొత్కు సంజీవరావు, డి.శ్రీనివాస్, ఎం.సంపత్, వినయ్ తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. ఇప్పుడు వినోద్ రాకతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌లో కొనసాగిన ఎంపీ వివేక్  ఇప్పుడు మళ్లీ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు