టీడీపీని వీడని తోట ముడి | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడని తోట ముడి

Published Tue, Apr 1 2014 12:20 AM

టీడీపీని వీడని  తోట ముడి

సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ మంత్రి తోట నరసింహం తెలుగుదేశం పంచన చేరడం జిల్లాలో ఆ పార్టీలో మెజార్టీ నేతలకు పుండు మీద కారం చల్లినట్టుంది. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారి మధ్య సీట్ల సిగపట్లే తేలని తరుణంలో.. తోట రాక పార్టీ పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టింది.
 
తోట రాకతో పడ్డ పీటముడి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. తోట టీడీపీలోకి రావడంతోనే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు ఖాయమైందని అనుచరులు ప్రచారం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు సహా పలువురు నేతలు ఇచ్చిన 24 గంటల అల్టిమేటమ్‌తో దిగొచ్చిన చంద్రబాబు వారిని హైదరాబాద్‌కు పిలిపించారని, జగ్గంపేట సీటు చంటిబాబుకే కేటాయిస్తున్నట్టు చెప్పి తాత్కాలికంగా బుజ్జగించగలిగారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
ఇందులో వాస్తవమెంతనేది పక్కన బెడితే హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన తోట.. కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నట్టు తనకు తానుగా ప్రకటించుకుని పార్టీలో మరో వివాదానికి తెర తీశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే తోట ఇలా ప్రకటించారు. ఆ విషయాన్ని ఆ సమయంలో నాయకులు సీరియస్‌గా పరిగణించలేదు.
 
అయితే కాకినాడ పార్లమెంటు సీటు ఆశిస్తున్న కెట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం ఆశలకు తోట గండి కొడుతున్నారనే సంకేతాలతో ఆ వర్గం తీవ్రంగా స్పందించడంతో వివాదం బజారుకెక్కింది. తోట చేరికతో మొదట  జగ్గంపేటకే పరిమితమైన ప్రకంపనలు ఇప్పుడు కాకినాడను కూడా తాకాయి. గ త ఆరేడు నెలలుగా విశ్వం సీటు కోసం ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు హఠాత్తుగా తోటను తీసుకువచ్చి,
 
 టీడీపీని వీడని ‘తోట’ ముడి
 ఆయన వైపు మొగ్గుచూపితే అధిష్టానానికి సరైన గుణపాఠం చెబుతామని విశ్వం అనుచరులు తెగేసి చెబుతున్నారు. తమ నిరసనను గత వారం రోజులుగా వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.
 
 మామా, అల్లుళ్లు పార్టీని ముంచేస్తారా?
తోటకు కాకినాడ పార్లమెంటు సీటు కేటాయిస్తున్నట్టు అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేనప్పుడు కంగారు పడాల్సిన  పని లేదని పార్టీ జిల్లా నేతలు విశ్వం వర్గీయులకు నచ్చచెబుతున్నారు. తోట తనకు తాను ప్రకటించుకుంటే సరిపోదని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశ్వం అనుచరులు, కైట్ విద్యార్థులు ఇటీవల ఆయనకే కాకినాడ పార్లమెంటు సీటు ఇవ్వాలని జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప చెప్పిన మాటలను బట్టి తోటకు సీటు ఇంతవరకు ఖాయమవలేదనే విషయం స్పష్టమైందంటున్నారు.
 
 అయితే.. అటు జగ్గంపేట అసెంబ్లీ సీటు, ఇటు కాకినాడ పార్లమెంటు సీటు విషయంలో తోట చిచ్చుపెట్టారని పార్టీ నేతలు, కేడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఁజిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోవడంతో టీడీపీలోకి వచ్చిన తోటకు సీటు ఇచ్చి ఇంత కాలం పార్టీ కోసం అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొన్న వారికి అన్యాయం చేస్తారా?అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
 తోట మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో పొసగని పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మామ మెట్ల, అల్లుడు తోట కలిసి పార్టీని ఏమి చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదని, నమ్ముకున్న వారిని నట్టేట ముంచేస్తారా అని కేడర్ ప్రశ్నిస్తోంది. కాగా వారి ఎత్తుగడలను సాగనివ్వబోమని పార్టీ ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement
Advertisement