ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసిన చిరంజీవి

19 Apr, 2014 16:42 IST|Sakshi
గంజి చిరంజీవి

(ఎన్.నాగరాజు-మంగళగిరి)
 గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి అభ్యర్థి గంజి చిరంజీవి ఎట్టకేలకు పోలీసుల అండతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా తులసీ రామచంద్ర ప్రభు పేరును టిడిపి నిన్న ప్రకటించింది. అతని ఎంపిక పట్ల వ్యతిరేకత రావడంతో పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పోతినేని శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్లు కూడా అతను ప్రచారం చేసుకున్నారు. చివరకు తెల్లవారుఝామున 3 గంటలకు గంజి చిరంజీవికి పార్టీ బిఫాం ఇచ్చారు.

ఉదయం నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరిన చిరంజీవిని పోతినేని శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకున్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతినేని అనుచరులు అతనిని నిర్భంధించారు. చివరకు అతనిపై దాడికి కూడా దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.  పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిరంజీవిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు.  భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయాలనుకున్న చిరంజీవి ఇంత గొడవ జరగడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. పోలీసుల రక్షణతో బయటపడిన చిరంజీవి ర్యాలీ లేకుండా   నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉండగా, మంగళగిరి రూరల్  టిడిపి అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ కూడా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ విధంగా మంగళగిరిలో టిడిపి నాయకులు, కార్యకర్తలు  విడిపోయి ఘర్షణ పడే స్థితికి చేరుకున్నారు.
 

మరిన్ని వార్తలు