అక్కడ ఒకసారి గెలిస్తే అంతే!

27 Apr, 2014 19:04 IST|Sakshi
అక్కడ ఒకసారి గెలిస్తే అంతే!

ఎన్నికలు వచ్చాయంటే కొన్ని నియోజకవర్గాలలో సెంటిమెంట్లు, అక్కడ జరిగిన వింతలు, విశేషాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తుంటాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కొన్ని సంఘటనలు ఒకే రకంగా జరుగుతుంటాయి. విశాఖ నగరంలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో  ఉత్తర నియోజకవర్గం ఆ కోవకు చెందినదే. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కసారి గెలిచినవారు మాజీలుగా మిగిలిపోవలసిందే. ఆ సెంటిమెంటే ఇక్కడ కొనసాగుతోంది. ఎక్కువగా ఇక్కడ కొత్త మొఖాలే పోటీలో కనిపిస్తుంటాయి. ఒక్కసారి గెలిచినవారికి టికెట్ రాకపోవడమో లేక  పరాభవం పొందడమో జరుగుతుంటుంది. ఇదీ ఇక్కడ రికార్డ్. ఆనవాయితీగా ఈ సారి కూడా కొత్తవారే  ఎన్నికల బరిలో నిలిచారు.

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇది విశాఖ -1నియోజకవర్గంగా ఉందేది.  2009 ఎన్నికలకు విశాఖ నగరంలోని రెండు నియోజకవర్గాలను నాలుగుగా విడదీశారు. ఉత్తర నియోజక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎస్.రంగరాజు, పిన్నింటి వరలక్ష్మి, పల్లా సింహాచలం, రాజాన రమణి మరోసారి గెలవలేదు.  చాలామందికి టిక్కెట్లే రాలేదు. గత ఎన్నికల్లో రంగరాజుకు కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో తైనాల విజయ్ కుమార్ ఎమ్మల్యే అయ్యారు. ప్రస్తుతం తైనాల విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపికి మద్దతు ప్రకటించారు.

ప్రతి ఎన్నికల్లో సాదారణంగా కాంగ్రెస్‌ - టీడీపీల మధ్య పోటీ జరుగుతుండేది.  ఈ సారి రాజకీయ ముఖచిత్రంపైకి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది.  టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బిజెకి కేటాయించారు. ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్ సిపి తరపున చొక్కాకుల వెంకటరావు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా పోటీ ఇచ్చే స్థితిలో లేరు.  చొక్కాకుల వెంకటరావు  రాజకీయాలకు కొత్త అయినా  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభంజనంతో అతను  ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఆయన ధాటికి మిగిలినవారు చతికిలబడిపోయారు.

బిజెపి అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు ఆర్థిక బలంతో టిక్కెట్ సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.  బిజెపి సీనియర్ నేతలు ఎందరో ఉన్నా, వారిని కాదని విష్ణుకుమార్ రాజుకు టిక్కెట్ కేటాయించడం వెనుక పెద్ద కధే నడిచినట్లు సమాచారం.  బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు, ఇక్కడ లోక్సభ అభ్యర్థి కంభంపాటి హరిబాబు ఎన్నికల ఖర్చు అంతా తానే భరిస్తానని మాట ఇవ్వడం వల్లే విష్ణుకుమార్ రాజుకు టిక్కెట్ ఇచ్చారని సొంత పార్టీ నేతలే  విమర్సిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత చలపతిరావు తనయుడు పివిఎన్ మాధవ్ టిక్కెట్  ఆశించారు. సీనియార్టీ ని పక్కన పెట్టి సిద్దాంతాలను గాలికొదిలేసి  ఎక్కడో ఉన్న విష్ణు కుమార్ రాజుకు బిజెపి టిక్కెట్ ఇవ్వడం పట్ల  ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా ఉన్నాయి. బిసి వర్గాలను పక్కన పెట్టడం, వారిని చిన్నచూపు చూడటం బిజెపి అభ్యర్ధికి ప్రతికూలంగా మారింది. దానికి తోడు టిడిపి నేతలు అందరూ బిజెపి  అభ్యర్ధి తీరుపై మండిపడుతున్నారు.ఆర్ధిక పరమైన గొంతెమ్మ కోరికలు కోరుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య ఆర్ధిక పరమైన గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రతిదానికి టిడిపి శ్రేణులు అలుగుతుండటంతో ఇదెక్కడి గొడవరా బాబూ అంటూ బిజెపి అభ్యర్ధి  లబోదిబో మంటున్నారు. దాంతో ఇక్కడ  బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.  

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జగన్పై జనం పెట్టుకున్న ఆశలు, విజయమ్మ పోటీ చేయడం  అన్నీ వెంకట రావుకు బాగా కలిసి వచ్చాయి. దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు