ఆలోచనలు అధికమైతే అల్జీమర్స్!

29 Oct, 2014 00:04 IST|Sakshi
ఆలోచనలు అధికమైతే అల్జీమర్స్!

ఎక్కువగా ఉద్వేగపడటం, దేని గురించయినా తీక్షణంగా ఆలోచిస్తూ ఉండటం, కొన్ని విషయాల్లో.. కొందరి గురించి ఈర్ష్య కలిగి ఉండటం... చాలా మంది మహిళలు ఇలాంటి ఆలోచనలకు అతీతులు కాదు. అయితే వీటన్నింటినీ కొంచెం హద్దులో పెట్టుకోవాలని, లేకపోతే వృద్ధాప్యంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు వైద్యపరిశోధకులు. అనవసరమైన ఆలోచనలు నిద్రలేకుండా చేస్తున్నట్లయితే... వృద్ధాప్యంలో మహిళలు అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు అధికం అవుతాయని పరిశోధకులు అంటున్నారు. ఉన్న బాధ్యతలకు అనవసరమైన ఆలోచనలు తోడు అయినప్పుడే ఇలాంటి ప్రమాదం ఉంటుందని వారు పేర్కొన్నారు.

మెదడును తొలిచేసే ఆలోచనల ఫలితంగా తరచూ మూడీగా మారిపోవడం... రాత్రుళ్లు నిద్రపోకుండా ఎక్కువసేపు ఆలోచిస్తూ గడిపేయడం... నిద్రలో కూడా ఇలాంటి టెన్షన్‌లే వెంటాడుతుండటం నరాల పనితీరుపై ప్రభావితం చేస్తుందని, అది మహిళల్లో అల్జ్జీమర్స్‌కు దారి తీస్తుందని పరిశోధకులు వివరించారు. భవిష్యత్తులో అల్జీమర్స్ బారిన పడకుండా ఉండాలంటే అనవసర ఆలోచనలను మానేయమనేది వారి సలహా!
 

మరిన్ని వార్తలు