గుండె అయోర్టిక్‌ వాల్వ్‌  టావర్‌తో వెరీ వెల్‌

2 May, 2019 00:30 IST|Sakshi

గుండె కవాటాల్లోని అయోర్టిక్‌ వాల్వ్‌ దెబ్బతిన్నప్పుడు వాల్వ్‌ మార్పిడి ప్రక్రియలో వచ్చిన సరికొత్త మార్పు ఇది. అయోర్టిక్‌ వాల్వ్‌ అనే గుండె కవాటం పనితీరులో మార్పులు వచ్చి, అది సమర్థంగా పని చేయనప్పుడు ఆపరేషన్‌ అవసరం లేకుండానే ఆ వాల్వ్‌ను మార్చే ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.  టావర్‌ లేదా టావీ అని పిలిచే ఈ వాల్వ్‌ మార్పిడి పద్ధతి గురించి, ఈ ఆధునిక సాంకేతికతతో శస్త్రచికిత్స అవసరం లేకుండానే తగిన చికిత్స చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. 

గుండె కవాటాలు పనిచేసే తీరు ఇది 
మన గుండె... రక్తాన్ని అన్ని అవయవాలకూ చేరవేస్తుందన్న విషయం తెలిసిందే. రక్తాన్ని పంప్‌ చేసే క్రమంలో అది లయబద్ధంగా స్పందిస్తుంది. తన స్పందనల్లో భాగంగా అది ముడుచుకుపోయినప్పుడు రక్తం ధమనుల్లోకి చేరుతుంది. మరి అలాంటప్పుడు గుండె విప్పారినప్పుడు రక్తం వెనక్కు రావాలి కదా. కానీ అలా జరగదు. గుండె లోపల ఉండే నాలుగు వాల్వ్స్‌ అయిన అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మోనిక్‌ అనేవి రక్తం ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి.

ఇందులో అయోర్టిక్‌ వాల్వ్‌ అనేది ఎడమవైపున ఉన్న కింది గది ముడుచుకుపోగానే రక్తాన్ని ప్రధాన ధమనిలోకి వెళ్లేలా చూసి, మళ్లీ అక్కణ్నుంచి రక్తం వెనక్కు రాకుండా మూసుకుపోతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చూద్దాం. మనం గాలిని పంప్‌ చేసినప్పుడు మోటార్‌సైకిల్‌ లేదా కారు టైర్‌ తాలూకు ట్యూబులోకి గాలి వెళ్తుంది. కానీ అదే గాలి మళ్లీ అదే దారి నుంచి వెనక్కు రాలేని విధంగానే ఈ వాల్వ్స్‌లు కూడా రక్తప్రవాహాన్ని ఒకేవైపు వెళ్లేలా చూస్తాయి. 

అయోర్టిక్‌ వాల్వ్‌ అంటే...? 
గుండెకు ఉన్న నాలుగు వాల్వ్‌లలో అయోర్టిక్‌ వాల్వ్‌ అనేది చాలా ప్రధానమైనది. ఇది గుండె  నుంచి... శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని తీసుకుపోయే ప్రధానమైన ధమనిలోకి రక్తాన్ని పంప్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. మనిషి గుండె ప్రతి రోజూ కనీసం ఒక లక్షసార్లు స్పందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా జరిగిన ప్రతిసారీ అయోర్టిక్‌ వాల్వ్‌ తెరచుకొని, రక్తాన్ని ఎడమవైపు కింది గది నుంచి ధమనిలోకి ముందుకు పంపుతుంది. ఇలా జరగగానే మళ్లీ మూసుకుపోయి ఆ రక్తం వెనక్కు రాకుండానూ చూస్తుంది. ఇలా ఒక రోజులో కనీసం 7000 లీటర్ల పరిమాణమంత రక్తాన్ని అది పంప్‌ చేస్తూ ఉంటుంది.

ఈ విధంగా అది మనం ఈ భూమి మీద పుట్టడానికి ముందే... అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పని మొదలుపెట్టి... మన చివరి శ్వాస వరకూ పని చేస్తూనే ఉంటుంది. ఇంత పనిని తట్టుకొని అది కనీసం 50 ఏళ్ల పాటు,సమస్య రాని కొందరిలోనైతే జీవితాంతం ఎలాంటి అవరోధం లేకుండా పనిచేస్తుంది. అయోర్టిక్‌ వాల్వ్‌ చివరిలో అది తెరచుకోడానికీ, మూసుకోడానికీ వీలు కల్పిస్తూ  మూడు తలుపుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి అచ్చం... మెర్సిడెజ్‌ బెంజ్‌ చిహ్నంలా ఉండి, ముక్కోణాకృతిలో ఉండే మూడు ఆకుల్లా ఆ తలుపులు తెరచుకుంటూ మూసుకుంటూ ఉంటాయి.

ఇలా రోజులో లక్షసార్లు జరిగే ప్రక్రియలో అవి ఎంతో కొంత గాయపడుతుంటాయి. మన ఒంట్లో మిగతా చోట్ల గాయాలు మానినట్టే... అక్కడా మానిపోతుంటాయి. అయితే ఇలా గాయాలు మానే క్రమంలో అక్కడ కొంత కండ పేరుకుంటూ ఉంటుంది. ఇలా గాయాలవుతూ, మానుతూ ఉండటం జరిగే ప్రక్రియలో అక్కడ క్యాల్షియమ్‌ పేరుకుపోయి వాల్వ్‌ మునుపటంత మృదువుగా ఉండక క్రమంగా కాస్త గట్టిబారుతుంది. దాంతో మునుపటంత తేలిగ్గా తెరచుకోలేకపోతుంటుంది. అది గట్టిబారిపోయి, సన్నబడటాన్ని‘స్టెనోసిస్‌’ అంటారు.

మనం నీళ్లపైప్‌ను కాస్త బిగుతుగా చేసి పట్టుకుంటే... నీళ్లు మరింత బలంగానూ, మరింత ఒత్తిడితోనూ చాలా దూరం వెళ్తుంటాయి కదా. అలాగే వాల్వ్‌ సన్నబడ్డప్పుడు రక్తం కూడా బలంగా ప్రవహిస్తుంటుంది. దాంతో ఒత్తిడి పెరిగి వాల్వ్‌ మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. కాలక్రమంలో ఈ స్టెనోసిస్‌ తీవ్రత మరింత పెరిగినప్పుడు గుండె పంపింగ్‌ మరింత బలంగా జరగాల్సి రావడంతో క్రమంగా అది బలహీనపడుతుంది. దాంతో క్రమంగా అది గుండె వైఫల్యానికి (హార్ట్‌ ఫెయిల్యూర్‌కి) దారి తీస్తుంది. అది ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. 

ఎవరెవరిలో స్టెనోసిస్‌ సాధారణం 
►వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు పెరుగుతూ ఉంటుంది. 
►డయాబెటిస్‌ ఉన్నవారిలో లేదా కొలెస్ట్రాల్‌ మోతాదులు చాలా ఎక్కువగా ఉన్నవారిలో
►క్యాన్సర్‌ వంటి జబ్బులకు ఛాతీకి రేడియేషన్‌ తీసుకున్న వారిలో
►అయోర్టిక్‌ వాల్వ్‌కు గతంలో ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు.  
►కొందరిలో పుట్టుక నుంచి అయోర్టిక్‌ వాల్వ్‌ లోపం ఉన్నప్పుడు. (ఇలా పుట్టుకతో అయోర్టిక్‌ వాల్వ్‌ లోపం ఉన్నవారిలో కొందరిలో వాల్వ్‌నకు మూడు తలుపులకు బదులు రెండే ఉంటాయి. ►మరికొందరిలో ఒకటే ఉంటుంది. అందువల్ల రక్తసరఫరా సరిగా జరగదు). 

అయోర్టిక్‌ వాల్వ్‌ సన్నబడినప్పుడు కనిపించే లక్షణాలు 
అయోర్టిక్‌ వాల్వ్‌ సన్నబడినప్పుడు దాని తీవ్రతను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అది కొద్దిపాటి సన్నబడిన దశ (మైల్డ్‌); ఓ మోస్తరుగా సన్నబడిన దశ (మాడరేట్‌); బాగా ఎక్కువగా సన్నబడిన దశ (సివియర్‌). ఈ మూడింటిలో తొలి రెండు దశల్లో లక్షణాలేమీ కనబడవు. అయితే చివరిదైన సివియర్‌ దశలో ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. 

►ఛాతీలో అసౌకర్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (మరీ ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా ఏమీ చేయకుండా ఉన్నప్పుడు కూడా)
►కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం లేదా స్పృహతప్పడం     
►వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం ∙కాళ్ల వాపు కనిపించడం. 

ఆపరేషన్‌ లేకుండానే అయోర్టిక్‌ వాల్వ్‌కు చికిత్స... 
ఆయోర్టిక్‌ వాల్వ్‌లో వచ్చే మార్పులు అనేవి దాని ఆకృతి మారడం వల్ల జరిగే మార్పులు (అంటే మెకానికల్‌ మార్పులు)గా చెప్పవచ్చు. అందుకే ఈ సమస్యను మందులతో చక్కబరచడం సాధ్యం కాదు. కాకపోతే కొన్ని రకాల మందులతో రక్తప్రవాహంలో కొద్దిపాటి మార్పులు తెచ్చి తాత్కాలికంగా గుణం కనబడేలా చూడవచ్చేమోగానీ, అది శాశ్వత ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వదు. అందుకే వాల్వ్‌ను మార్చడం ద్వారా అది మునుపటిలా ఉండేలా చక్కదిద్దడమే దీనికి పరిష్కారం. గతంలో దీన్ని  గుండె శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దేవారు. అయితే ఇలా శస్త్రచికిత్స చేయడం వల్ల రోగిని 2 – 4 రోజుల పాటు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో, ఆ తర్వాత మరో 3 – 5 రోజుల పాటు వార్డ్‌లో ఉంచి చికిత్స అందించాలి.

ఆ తర్వాత మరో 6 వారాలు ఇంటి దగ్గర  విశ్రాంతి తీసుకోవాల్సిన (పోస్ట్‌ ఆపరేటివ్‌ రీ–హాబిలిటేషన్‌) అవసరం ఉంటుంది. ఇక కొందరైతే వయసు పరంగానూ లేదా మరికొన్ని దీర్ఘకాలిక జబ్బుల వంటి ఇతర కారణాల వల్ల శస్త్రచికిత్సకు అనువుగా ఉండరు. శస్త్రచికిత్స చేస్తే వారికి ప్రాణాపాయం ముప్పు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి వారు తమ పరిమితుల కారణంగా చికిత్స తీసుకోలేకపోతే జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) విషమించి, ఆయాసపడుతూ చాలా కష్టంగా బతుకీడ్చాల్సి వస్తుంది. 

‘టావర్‌’ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు? 
టావర్‌/టావీ ప్రక్రియ కోసం వంటిపైన ఎలాంటి కోతా పెట్టనక్కర్లేదు. కేవలం తొడ దగ్గర, మెడ దగ్గర రెండు చోట చిన్న గాట్లతోనే ఆ వాల్వ్‌ను మార్చడం సాధ్యమే. ఈ సరికొత్త ప్రక్రియనే ‘టావర్‌’ అంటారు. ట్రాన్స్‌కేథటర్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ అనే మాటకు సంక్షిప్తరూపమే టావర్‌. అలాగే దీన్ని టావీ అని కూడా అంటారు. అంటే ఇది ట్రాన్స్‌కేథటర్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌ అనే మాటకు సంక్షిప్త రూపం. ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, కార్డియాక్‌ అనస్థిసిస్ట్, కార్డియాక్‌ ఇమేజింగ్‌ నిపుణులతో పాటు కార్డియాక్‌ సర్జన్‌ ఈ ప్రక్రియను నిర్వహించే బృందంలో ఉంటారు. ఇది కూడా కరోనరీ యాంజియోగ్రఫీ లేదా యాంజియోప్లాస్టీ జరిపే విధంగానే ఉంటుంది.

తొడ దగ్గర ఒక చిన్న గాటు పెట్టి, ధమని లోకి వాల్వ్‌ను ప్రవేశపెట్టి దాన్ని గుండెవరకు తీసుకెళ్తారు. దాంతో సాధారణ శస్త్రచికిత్సలో మాదిరిగా ఛాతీ ఎముకలను కోయాల్సిన అవసరం ఉండదు. పైగా అనుకూలురైన కొందరు రోగులకు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రక్రియకు దాదాపు గంట సేపు పడుతుందంతే. నిజానికి ఈ ప్రక్రియ ముగిసిన రోజే సాయంత్రం ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే ముందుజాగ్రత్త కోసం రోగిని 24 గంటల పాటు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచుతారు. దాంతో సాధారణ ఆపరేషన్‌లో మాదిరిగా మాదిరిగా రోగి కనీసం వారం రోజులైనా (రెండు రోజులు ఇంటెన్సివ్‌ కేర్‌లో, ఆ తర్వాత మిగతా రోజులు వార్డ్‌లో) ఉండాల్సిన అవసరం ఉండదు.

ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం కూడా అవసరముండదు. చికిత్స ముగిసిన వారం రోజుల తర్వాత వారు తమ సాధారణ కార్యకలాపాలకు హాజరు కావచ్చు. ఒక నెల రోజుల తర్వాత యథావిధిగా తమ ప్రయాణాలు చేయవచ్చు. మునుపు తాము చేసే పనులన్నీ ఎలాంటి అంతరాయం లేకుండానే చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది రోగుల్లో రక్తాన్ని పలచబార్చే మందులు లేదా ఇతరత్రా మందులు కూడా ఏవీ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారు అంతకు ముందు వాడినవి కూడా చాలా రకాల మందులు ఉపయోగించాల్సిన అవసరమూ 
పడకపోవచ్చు. 

ఇప్పుడు కొత్త ఆశారేఖ టావర్‌
అయోర్టిక్‌ వాల్వ్‌ విషయంలో అది సరిగా పనిచేయక సన్నబడినప్పుడు దాన్ని శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా సరిచేయాల్సి వస్తుంది. కానీ ఇటీవల సరికొత్త ప్రక్రియ ద్వారా ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే వాల్వ్‌ను మార్చవచ్చు. దాంతో ఏవైనా కారణాల వల్ల శస్త్రచికిత్స చేయించుకోలే వారు, శస్త్రచికిత్స అంటే భయపడే వారు, వయసు పెరిగిన కారణంగా శస్త్రచికిత్సతో ప్రాణాపాయం వంటి ముప్పు ఉన్నవారికి ‘టావర్‌/టావీ’ అనే చికిత్స వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. 

ప్రస్తుతానికి ఖరీదైన ప్రక్రియే  
ప్రస్తుతం ఈ వాల్వ్‌లో మూడు రకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. యూఎస్‌కు చెందిన వాల్వ్‌ చాలా ఖరీదైనది. దీనికి దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. మన దేశం కూడా ఈ వాల్వ్‌ను తయారు చేస్తోంది. దీనికి దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు కావచ్చు. అయితే ఇప్పుడు ఈ వాల్వ్‌లను తయారు చేసే సంస్థలు చాలానే వస్తున్నాయి. దాంతో మార్కెట్‌లోకి కొత్త కొత్త వాల్వ్‌లు రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. ఫలితంగా కొద్దికాలంలోనే ఇది మరింత చవగ్గా లభ్యం కావచ్చు. అంటే సాధారణ అపరేషన్‌కు రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు ఖర్చయితే... దాదాపు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపే లేదా ఆపరేషన్‌ ఖర్చులోనే భవిష్యత్తులో ఈ వాల్వ్‌ల మార్పిడి ప్రక్రియ ‘టవర్‌’ సాధ్యమయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవు.

డాక్టర్‌ అనూప్‌ అగర్వాల్, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్, 
ప్రోక్టర్‌ ఫర్‌ టావర్‌ ప్రొసిజర్,కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు