కుందేళ్లు చిన్నవి.. లాభాలు పెద్దవి!

17 Apr, 2018 04:04 IST|Sakshi

అరకొరగా చదువుకున్న మహిళలు చాలా మంది వంటింటికే పరిమితం అవుతున్నప్పటికీ.. దృఢసంకల్పంతో ముందడుగేస్తున్న రాధమ్మ వంటి మహిళా రైతులు ఆదర్శప్రాయమైన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. వివిధ పంటల సాగుతోపాటు బర్రెలు, కుందేళ్ల పెంపకం చేపట్టారు. వివిధ నగరాల్లో తమ కుందేలు మాంసాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం ద్వారా చేతినిండా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ ఇంటర్‌ వరకు చదువుకున్నారు. తొలినాళ్లలో టైలరింగ్‌ చేసిన ఆమె ఆ తర్వాత వ్యవసాయం, పశుపోషణ, కుందేళ్ల పెంపకంపై దృష్టిపెట్టారు. గ్రామ సమీపంలో ఓ షెడ్డు నిర్మించి రూ. 5 లక్షల పెట్టుబడితో మూడేళ్ల క్రితం కుందేళ్ల పెంపకం ప్రారంభించారు. 300 కుందేళ్లతో పెంపకం ప్రారంభించగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు చేరింది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్‌ రకం గడ్డిని సాగు చేస్తున్నారు. దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్క పొడిని దాణాగా ఇస్తున్నారు. నలుగురు కూలీలను నియమించారు.


ఆడ కుందేలు నెలకోమారు 5–10 పిల్లలు పెడుతుంది. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుంది. పిల్లలు నాలుగు నెలల్లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు పెరుగుతాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై కుందేళ్ల మాంసం సరఫరా చేస్తున్నారు. మార్కెట్‌లో కుందేలు మాంసం కిలోకి రూ.650 ధర పలుకుతున్నది.

కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ.లక్ష నికరాదాయం వస్తున్నదని రాధమ్మ తెలిపారు. పదెకరాలలో మూడు బోర్లు వేయించి వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతోపాటు 10 బర్రెలను పోషిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని, రైతుగా తనకు చాలా సంతృప్తిగా ఉందని రాధమ్మ(89855 97106) సంతోషంగా తెలిపారు.
– ఈటి సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా

మరిన్ని వార్తలు