అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ! 

10 Mar, 2019 01:42 IST|Sakshi

తత్త్వ రేఖలు

ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. అది సనాతనమైనదైనా నిత్యమైనది. శరీరం నశించినా, నశించనిదని కఠోపనిషత్తు కొన్ని వేలసంవత్సరాల కిందటే ఘోషించింది. ఇదే విషయాన్ని ‘శక్తి నిత్యత్వ నియమం’ ద్వారా ఆధునిక భౌతిక శాస్త్రమూ చెప్తోంది. మన ఋషులు విశేషమైన చింతన చేసి భగవంతుడు, దేవుడు, పరంధాముడు అంటూ వివిధ నామాలు సూచించకుండా సర్వాంతర్యామికి చక్కని అర్థాన్నిచ్చే ‘ఆత్మ’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ‘ఐతరేయోపనిషత్తు’ నొక్కి వక్కాణిస్తుంది. ఆత్మకు పదార్థ లక్షణాలైన ఆకారం, రంగు, రుచి, వాసనలు ఏమీ లేకపోయినా అది పదార్థంగా రూపొంది అన్ని లక్షణాలను ప్రదర్శిస్తూ, తిరిగి తనలోనే లయం చేసుకుని శక్తిగా మార్చుకుంటూ నిత్యనూతనంగా ఉంటూవస్తోంది. ‘ఈశావాస్యోపనిషత్తు’ ఆత్మనుండి అదే ఆత్మను తీసివేసినా, అంతే ఆత్మ మిగులుతుందని చెబుతూ పూర్ణమైన ఆత్మ నుండే ఆత్మ ఉద్భవించిందని అనటం గమ్మత్తుగా అనిపిస్తుంది. అంటే ఆత్మ అన్నింటికన్నా ముందే ఉన్నట్టుగా అర్థమవుతుంది. 

మరి ఆత్మను చూడడం సాధ్యమౌతుందా? అంటే ఆత్మను అర్థం చేసుకున్న వారికి సాధ్యమే అనిచెప్పవచ్చు. అర్థం చేసుకున్న వారు ఆచరిస్తే ఆ ఆత్మను, దాని నుండి ఉద్భవించే అనిర్వచనీయమైన అలౌకిక ఆనందాన్ని అనుభవించవచ్చు. చరాచరప్రపంచమంతా తానే అయిన ఆత్మే పదార్థమూ, ఆ పదార్థాన్ని ఆవరించిఉన్న శక్తినీ చూసే ప్రతి వస్తువు, కాంతి, ఉష్ణం, శబ్దం మొదలైనవన్నీ ఆత్మే. అంతేకాక మన మనోవాక్కాయ కర్మలు అన్నీ ఆత్మలో భాగమే. ఆత్మ నుండి పరిణామం చెంది పదార్థంగా రూపొందినవి కాబట్టి, పదార్థాలకు స్వాభావికంగా భౌతిక లక్షణాలు ఉండటం సహజం. ఈ సహజ భౌతిక లక్షణాలే ఆత్మను అర్థం చేసుకోకుండా అడ్డుపడేవి. దీనినే మాయ అన్నారు. ఈ మాయకు అతీతంగా ఆలోచిస్తేనే ఆత్మను అర్థం చేసుకోగలము. అర్థం చేసుకున్నా అది అనంతమైంది కాబట్టి, కన్నులతో సంపూర్ణంగా చూడలేము.

అందుకు విశేషమైన సాధన చేయాలి. ఆ సాధనకు మనసు లోలోతుల నుండి తృష్ణ ఉద్భవించాలి. అప్పుడే ఏకాగ్రత సాధ్యమై, సాధకుడు సమాధి స్థితిని చేరుకుని తద్వారా లయ స్థితిని పొందుతాడు. అప్పుడే ఆత్మానుభవం సాకారమౌతుంది. అప్పుడు సాధకుని అరిషడ్వర్గాలు నశించి అమేయుడౌతాడు. అతని మనోవాక్కాయకర్మలన్నీ ఆనందాన్నీ, మంగళాన్నీ వెదజల్లుతాయి. అప్పుడు అతడే శివుడౌతాడు. ప్రతి ఒక్కరూ శివత్వాన్ని పొందితే ప్రకృతే పులకరించిపోతుంది. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాదమహర్షి ఆత్మ గురించి ఇక ఇంతకన్నా  చెప్పలేం అన్నట్టుగా, ఆ సర్వోత్కష్టమైన ఆత్మ గురించి నాకు తెలిసినంతగా, సాధ్యమైనంతగా మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందకరం. ఈ ఆత్మానుభూతికి అవకాశం ఇచ్చిన ఆత్మస్వరూపులకు శిరసానమామి. 
– గిరిధర్‌ రావుల

మరిన్ని వార్తలు