క్యాన్సర్ కౌన్సెలింగ్

9 Jul, 2015 00:50 IST|Sakshi

పెట్-సీటీ స్కాన్ అవసరమా?
 నేను ఓవరీ (అండాశయ) క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. ఇందులో భాగంగా శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఆ తర్వాత ఆరు సైకిల్స్ పాటు కీమోథెరపీ కూడా తీసుకున్నాను. చివరి సైకిల్ కీమో 2014 మే నెలలో తీసుకున్నాను. నేను ప్రతి 3 నెలలకోసారి డాక్టర్ చెక్‌అప్‌కు వెళ్తుంటాను. ఈ సారి చెకప్‌కు వెళ్లినప్పుడు పెట్-సీటీ స్కాన్ తీయించుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇప్పుడు నేను పెట్-సీటీ స్కాన్ చేయించుకోవడం అవసరమా? సలహా ఇవ్వగలరు.
 - సుజాత, తుని

 కీమోథెరపీని ఆరు సైకిల్స్ పాటు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాలు ప్రతి మూడు నెలలకోసారి మీరు డాక్టర్‌కు చూపించుకోవాలి. ఆ తర్వాత మరో ఐదేళ్ల పాటు ప్రతి 4- 6 నెలలకోసారి డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. మీ మెరుగుదల, పురోగతిని పరీక్షించి అంతా బాగుందో లేదో డాక్టర్లు పరీక్షిస్తారు. ఈ సమయంలో మళ్లీ పెట్-స్కాన్‌గానీ లేదా మరో రకమైన పరీక్షగానీ అవసరం లేదు. మీలో ఎలాంటి ఇతరత్రా లక్షణాలు కనిపించకపోతే అంతర్జాతీయ క్యాన్సర్ కేర్ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సమస్యగానీ లేదా లక్షణాలు గాని కనిపిస్తుంటేనే పరీక్షలు అవసరమవుతాయి. సమస్యలూ, లక్షణాలేమీ లేకపోతే డాక్టర్లు క్లినికల్‌గా చేసే సాధారణ పరీక్షలే చాలు.

 మా అబ్బాయి వయసు మూడున్నర ఏళ్లు. అతడికి ‘రెటినోబ్లాస్టోమా’ అనే కంటి క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక్కడి స్థానిక డాక్టర్ చూపి కన్ను తొలగించాలని సలహా ఇచ్చారు. ఆయన చెప్పిన విషయం వినగానే మా కుటుంబమంతా షాక్‌కు గురైంది. మీరు ఈ విషయంలో ఏదైనా సలహా ఇవ్వగలరా?
 - సహదేవరావు, సూర్యాపేట
 ఈరోజుల్లో రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్‌కు చాలా రకాల చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. చాలారకాల కేసుల్లో ఇప్పుడు కంటిని తొలగించకుండానే కంటి క్యాన్సర్‌కు చికిత్స చేసే ఆధునిక విధానాలు ఎన్నో అందుబా టులో ఉన్నాయి. కంటిలోని కంతిని తగ్గించడానికి కీమోథెరపీ ఇవ్వడంతో పాటు, దానికి క్యాన్సర్‌ను తగ్గించడానికి లేజర్ చికిత్సనూ చేసే విధానాన్ని అనుసరిస్తాం. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ కూడా అవసరం కావచ్చు. కొన్నిసార్లు స్థానికంగా ‘ప్లాక్ బ్రాకీథెరపీ’ లేదా ‘ఎక్స్‌టర్నల్ రేడియోథెరపీ’ వంటివీ అవసరం కావచ్చు. మీ బాబు కన్నును కోల్పోకుండానే క్యాన్సర్‌కు చికిత్స లభించి, ఆ వ్యాధి నయం కావడానికి మీరు స్థానికంగా కాకుండా అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు ఉండే అధునాతన క్యాన్సర్ కేంద్రాలకు వెళ్లమని నా సూచన.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు