పిల్లల మతంలోకి మారిపోదాం

10 Jul, 2014 23:08 IST|Sakshi
పిల్లల మతంలోకి మారిపోదాం

దైవికం
 
ద్వేషం కన్నా భయంకరమైనది దురభిమానం. ఈ రెండిటికన్నా భయంకరమైనవాడు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ ద్వేషం యూదుల మీద. హిట్లర్ దురభిమానం తన సొంత జాతి మీద. సొంత జాతి అంటే మళ్లీ క్రిస్టియానిటీ అని కాదు. యూదులు కాని వారెవరైనా తన సొంత జాతే అన్నట్లు ఉండేవారాయన. పైగా యూదులు అల్పులని, తక్కినవారు ఎంతో ఉత్కృష్టమైన ఆర్యసంతతి మూలాల నుంచి వచ్చినవారని హిట్లర్‌కి ఓ నమ్మకం.

మనుషుల పోలికల మీద కూడా దీర్ఘమైన ఆయన పరిశీలన ఒకటి ఉండేది. ఆర్యులంటే ఇలా ఉంటారని, యూదులంటే అలా ఉంటారని ఏవో పిచ్చి అభిప్రాయాలు ఉండేవి. 1935లో ఆయన ప్రచార బృందం... ‘ఇదిగో మన ఆర్యజాతి ఇంత పరిపూర్ణంగా, ఇంత సర్వోత్కృష్టంగా ఉంటుంది’ అంటూ జాబిల్లి వంటి ముఖం, బూరెల్లాంటి బుగ్గలు ఉన్న ఆరు నెలల చిన్నారి ఫొటోను పోస్టర్ల మీద, చిన్న చిన్న కార్డుల మీద ప్రింట్ చేయించి జర్మనీ అంతటా పంచి పెట్టింది. దీన్ని బట్టి మనుషులలోని ద్వేషభావం, దురభిమానం ఏ స్థాయిలో ఉంటాయో అర్థమౌతుంది.
 
హిట్లర్ చనిపోయాడు. యుద్ధం ఆగిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి. తాజాగా ఇప్పుడు బయట పడిన నిజం ఏమిటంటే, ఆ పాప.. హిట్లర్ అనుకున్నట్లుగా ‘ఆర్యన్ బేబీ’ కాదనీ, యూదుల బిడ్డ అని! హిట్లర్ బతికి ఉండగా ఈ సంగతి తెలిస్తే ఎలా ఉండేదో కానీ, ప్రొఫెసర్ హెస్సీ టఫ్ట్ మాత్రం ‘‘బాబోయ్, నాజీలు నన్ను బతకనిచ్చేవారు కాదు’’ అంటున్నారు చిరునవ్వుతో. ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసులో ఉన్న హెస్సీ ఎవరో కాదు, ఆనాటి ఆర్యన్ బేబీనే! ఇంతకీ ఆ పాప ఫొటో నాజీలకు ఎక్కడిది?

హెస్సీ తండ్రి జాకబ్. తల్లి పాలైన్ లెవిన్‌సన్స్. ఇద్దరికీ మ్యూజిక్ తెలుసు. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదా అని 1928లో లాట్వియా నుంచి బెర్లిన్ వె ళ్లారు. ఒక అపేరా కంపెనీలో జాకబ్‌కి ఉద్యోగం వచ్చింది కానీ, అతడు యూదుడు అని తెలిసిన వెంటనే ఉద్యోగంలోంచి తొలగించారు. తర్వాత ఆయన సేల్స్‌మేన్‌గా చేరారు. 1935 నాటికి యూదులపై నాజీల ద్వేషం, దౌర్జన్యం మితిమీరిపోయాయి. అప్పటికి హెస్సీకి ఆరు నెలలు. బొద్దుగా, అందంగా ఉండేది.

ఓ రోజు తన ముద్దుల బిడ్డను చంకనేసుకుని బెర్లిన్‌లో పేరున్న ఫొటోగ్రాఫర్ హాన్స్ బాలిన్ దగ్గరకు తీసుకెళ్లి ఫోటో తీయించుకొచ్చారు పాలైన్. తర్వాత కొన్నాళ్లకు అదే ఫొటో నాజీల పత్రిక ‘సనీ ఇన్స్ హవుజ్’ ముఖచిత్రంగా వచ్చింది. అది చూసి పాలైన్ విపరీతంగా భయపడిపోయారు. నాజీలకు తెలిస్తే తమ చిరునామా వెతుక్కుంటూ వచ్చి మరీ ముప్పు తిప్పలు పెడతారన్న ఆలోచన రాగానే ఆమె గొంతు తడారిపోయింది.

పరుగున ఆ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి ‘‘ఇదెలా జరిగింది?’’ అని అడిగారామె. ‘‘ఓ అదా...’’ అంటూ నవ్వారాయన. ‘‘ఆ పత్రిక ఆర్యన్ బేబీల అందాల పోటీలు పెడితే మీ పాప ఫొటో పంపాను. నాజీల దురభిమానాన్ని దెబ్బతియ్యాలనే అలా చేశాను. పసికందుల్లో కూడా వీళ్లు జాతి భేదాలను చూడ్డం ఘోరం కదా’’ అన్నారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు పాలైన్ దంపతులు నాజీల కంటపడకుండా తమ బిడ్డను కాపాడుకున్నారు.
 
ఈ విషయాలన్నీ ఇప్పుడు హెస్సీ వల్ల వెలుగులోకి వచ్చాయి. ఎనభయ్యేళ్ల క్రితం తన ముఖచిత్రంతో వచ్చిన పత్రికను ఆమె ఇజ్రాయిల్‌లోని మారణహోమ స్మారక పురావస్తుశాలకు విరాళంగా ఇస్తూ నాటి సంగతులను మీడియాకు వెల్లడించారు.
 
ద్వేషానికి కారణాలు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రేమకు కార ణాలు ఉండకూడదు. ఉంటే అది దురభిమానమో, స్వార్థాభిమానమో అవుతుంది. అంతకన్నా అకారణమైన ద్వేషమే నయం. ఏ కారణమూ లేకుండా మొలకెత్తని ప్రేమ కన్నా అది హీనమైనదేం కాదు. పిల్లలు, దేవుడు ఒకటే నంటారు. హిట్లర్ పసిపిల్లల్లోనూ తన జాతినే వెతుక్కున్నాడు తప్ప దేవుణ్ని గానీ, దైవాంశ ఉండే పసితనాన్ని కానీ చూడలేకపోయాడు.  పిల్లలందరిదీ ఒకే మతం. అది దైవమతం. అందుకే పిల్లలు పెద్దవాళ్లయ్యాక కట్టే గుడులు, చర్చిలు, మసీదుల కంటే కూడా చిన్నప్పుడు ఇసుకలో వాళ్లు కట్టే గుజ్జనగూళ్లే అసలైన దేవాలయాలు అనిపిస్తాయి ఒకోసారి. వాటిల్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. మనం చూడగలిగితే!
 
- మాధవ్ శింగరాజు
 

మరిన్ని వార్తలు