చాకిరీ 60% భూమి 14%!

16 Oct, 2018 05:15 IST|Sakshi

వ్యవసాయంలో మహిళల శ్రమ వాటా రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా, మహిళా రైతులుగా వారికి గుర్తింపు పెద్దగా దక్కటం లేదు. పితృస్వామిక వ్యవస్థ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతుల హక్కులకు గుర్తింపు లేకుండా పోతోంది. ఈ నెల 15న జాతీయ మహిళా రైతుల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా. కమతాలు చీలిపోయి చిన్నవి అవుతున్న కొద్దీ, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతున్న కొద్దీ పురుషులు ఇతర రంగాలవైపు దృష్టి సారించడం పెరుగుతోంది.

అనివార్యంగా వ్యవసాయ పనులన్నీ మహిళలపైనే పడుతున్నాయి. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్‌ అంచనా ప్రకారం మన దేశంలో ఆహారోత్పత్తిలో మహిళల శ్రమ 60–80 శాతం. పాడి పరిశ్రమలో 90%. ఇది ఇంటిపనికి అదనం. 2010–11 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. దేశంలో 11 కోట్ల 87 లక్షల మంది సాగుదారులుంటే ఇందులో 30.3% మంది మహిళా రైతులు. 14.43 కోట్ల వ్యవసాయ కూలీల్లో 42.6% మహిళలు.అయినా, మహిళలకు భూమిపై హక్కు 14% మాత్రమే. 2015 జనాభా గణన ప్రకారం.. వ్యవసాయ రంగంలో ఉన్న 86 శాతం మంది మహిళల పేరు మీద సెంటు భూమి కూడా లేదు. మహిళలకు భూమి హక్కు వచ్చినప్పుడే రైతుగా ప్రభుత్వ సహాయాన్ని, రుణాలను, శిక్షణావకాశాలను పొందగలుగుతారు.  

అభివృద్ధి చెందుతున్న మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించి గుర్తింపు ఇస్తే వ్యవసాయ ఉత్పత్తి 2.5–4% వరకు పెరుగుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌.ఎ.ఓ.) అంచనా వేస్తోంది.
వ్యవసాయ పనుల్లోని ప్రతి దశలోనూ నడ్దివిరిచే చాకిరీ చేసే మహిళల శ్రమ తగ్గించే యంత్రపరికరాలను, వారికి తగినట్టుగా తక్కువ బలాన్ని వినియోగించాల్సిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేయడం అవసరం. ఇప్పుడున్న యంత్ర పరికరాలన్నీ పురుషులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినవే. మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసే యంత్ర పరికరాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళా రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది!

మరిన్ని వార్తలు