సేంద్రియ ఆక్వా సాగుకు ఎంపెడా సమాయత్తం!

6 Feb, 2018 00:21 IST|Sakshi

చేపలు, రొయ్యల సాగులో సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) సమాయత్తమవుతున్నది. సేంద్రియ ఆక్వా సాగులో ఖర్చు పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ఆక్వా రైతులు వెనుకడుగు వేస్తుంటారు. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థలు ముందుకొస్తున్నందున ఇక మీదట ఆ ఇబ్బంది ఉండబోదని ఎంపెడా చైర్మన్‌ ఎ.జయతిలక్‌ అంటున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద వినియోగదారుల సహకార సంస్థ ‘కూప్‌ కో–ఆపరేటివ్‌’కు అత్యంత నాణ్యమైన సేంద్రియ ఆక్వా సాగు, అంతర్జాతీయ సేంద్రియ ఆక్వా సర్టిఫికేషన్‌ పద్ధతులు తదితర అంశాల్లో పాతికేళ్ల అనుభవం ఉంది.

గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సీఫుడ్‌ షో–2018లో కూప్‌ కోఆపరేటివ్‌తో ‘ఎంపెడా’ అవగాహన కుదుర్చుకుంది. దేశీయంగా ఆక్వా సంస్థలు, రైతులతో సేంద్రియ ఆక్వా సాగు చేయించడంతోపాటు 15% అదనపు ధరకు కొనుగోలు చేయడానికి కూప్‌ కో–ఆపరేటివ్‌ అంగీకరించిందని ఎంపెడా చైర్మన్‌ తెలిపారు. సేంద్రియ సాగుకు సీడ్‌ను అందించేందుకు హేచరీ, మేత తయారీ కర్మాగారం, సేంద్రియ సాగు పద్ధతులపై సాంకేతిక సహకారం, శిక్షణ, దేశ,విదేశీ మార్కెట్ల కోసం సర్టిఫికేషన్, ఒప్పంద కొనుగోళ్లు.. వీటన్నిటిలోనూ ఆ సంస్థ తోడ్పాటును అందించనుంది. వియత్నాంలో సేంద్రియ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్న కూప్‌ కో–ఆపరేటివ్‌.. దిగుమతి చేసుకున్న ఆక్వా ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌లో తన 2,200 అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు