ఎవరీ యోధానుయోధుడు?

8 Sep, 2014 23:17 IST|Sakshi
ఎవరీ యోధానుయోధుడు?

పురాతనం
 
తవ్వకాల్లో పురాతన వస్తువులే కాదు... చరిత్ర కూడా బయటపడుతుంది!  ఈ అవకాశం సైబిరియాలో మరోసారి వచ్చింది. పదకొండవ శతాబ్దానికి  చెందిన ఒక యుద్ధ వీరుడి సమాధిని సైబిరియాలోని ఒమ్‌స్క్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బాణాలు, రక్షణకవచం... మొదలైన యుద్ధ సామాగ్రితో పాటు కొప్పెరలాంటి రకరకాల వస్తువులు ఈ సమాధిలో కనిపించాయి. ‘‘ఇదొక సంచలనాత్మక ఆవిష్కరణ’’ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ సమాధి ద్వారా ఆనాటి సంస్కృతి, యుద్ధతంత్రాలు, చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
 
అయిదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉన్న  ఈ యుద్ధ వీరుడికి ఎడమ చేయి లేదు. యుద్ధంలో పోరాడే క్రమంలో చేయిని పోగొట్టుకొని ఉండొచ్చునని శాస్త్రవేత్తల అంచనా. సమాధిలో కంచు నాణెం ఒకటి  కనిపించింది. దేవుళ్లతో సంభాషించడానికి ఇదొక మాధ్యమంగా ఆనాటి ప్రజలు భావించేవారు. అస్తిపంజరం ముక్కుపై ఎలుగొడ్డు పన్ను, తలకు వస్త్రంతో చేసిన శిరస్త్రాణం తొడిగి ఉంది. దీనికి ఇరువైపుల జేబులు ఉన్నాయి.... ఇదంతా మతాచారానికి సంబంధించిన వ్యవహారమై ఉంటుందని ఊహిస్తున్నారు.

‘‘ఇప్పటికిప్పుడు  కొత్త విషయాలేమీ  చెప్పలేంగానీ, భవిష్యత్‌లో చెప్పడానికి మాత్రం చాలా ఉంది’’ అని తవ్వకాల్లో బయటపడిన సమాధిని ఉద్దేశించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, సైబిరియాకు చెందిన శాస్త్రవేత్త డా. కోరుసెన్‌కో అన్నారు.‘‘చనిపోయిన తరువాత గౌరవనీయులైన ప్రముఖులకు, యోధానుయోధులకు  చేసే అంతిమసంస్కారానికి సంబంధించిన ఆనవాళ్లు సమాధిలో లభించాయి. ఈ ప్రముఖుడు ఎవరో తెలుసుకోవాల్సి ఉంది’’ అంటున్నారు శాస్త్రవేత్తలు.
 
‘‘ఈ యోధుడికి తనను తాను పరిచయం చేసుకోవాలనే కోరిక అకస్మాత్తుగా కలిగినట్టుంది’’ అని చమత్కరించారు కోరుసెన్‌కో.  మరి ఆ  యోధానుయోధుడు ఎవరో, తన గురించి తాను ఏం చెబుతాడో వేచి చూద్దాం.
 

మరిన్ని వార్తలు