అదేపనిగా కూర్చొనే ఉంటున్నాను...  ఆరోగ్యం చెడకుండా సలహా ఇవ్వండి

19 Jan, 2018 00:38 IST|Sakshi

లైఫ్‌స్టైల్‌ కౌన్సెలింగ్‌

నేను ఐటీ ప్రొఫెషన్‌లో ఉన్నాను. ఒకసారి ఆఫీసులోకి వచ్చాక నేను నా కంప్యూటర్‌ ముందు కూర్చున్నాననంటే మళ్లీ సాయంత్రం వరకూ లేచే పరిస్థితి ఉండదు.  అంతంత సేపు అదేపనిగా కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్‌ అంటున్నారు. వారనేది వైద్యపరంగా కరక్టేనా? నా ప్రొఫెషన్‌ను దృష్టిలోపెట్టుకొని, నా ఆరోగ్యం కాపాడుకోడానికి తగిన సలహాలు ఇవ్వండి. 
– సమీర్, హైదరాబాద్‌ 

కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చొనే ఉండటం చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్‌–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, వృత్తిపరంగా బైక్‌మీద కూర్చొనే చాలాసేపు ప్రయాణం చేస్తూ ఉండటం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం అవసరం.  పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌లో నిమగ్నం కావడం అనే కారణాలతో అదేపనిగా కూర్చొనే ఉంటారు. ఇక పెద్దలు తమ ఆఫీసు పనుల్లో మునిగిపోయి కూర్చొనే ఉంటారు. 

కొన్ని సూచనలు : 
∙మీ బెడ్‌రూమ్స్‌లో టీవీ / కంప్యూటర్‌ / ల్యాప్‌టాప్‌ లను ఉపయోగించకండి  ∙మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి  పిల్లలకు మీరు ఇచ్చే బహుమతుల్లో పిల్లలకు శారీరక ఆరోగ్యం చేకూర్చే బంతులు / ఆటవస్తువుల వంటివి ఉండేలా చూసుకోండి ∙మీరు ఆఫీసుకు వచ్చే ముందర లోకల్‌ బస్సుల్లో, లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేవారైతే ఆ టైమ్‌లో కూర్చుని ప్రయాణం చేయకండి. ∙ఎస్కలేటర్‌ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి ∙రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ∙మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్‌ తీసుకోండి ∙మీకు దగ్గరి కొలీగ్స్‌తో మాట్లాడాల్సి వస్తే మొబైల్‌ / మెయిల్‌ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడండి 

వ్యాయామంతో  నిద్రపడుతుందా...  పట్టదా? 
నేను దాదాపు రోజుకు 14 గంటలు కూర్చొనే పనిచేస్తుంటాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొంతమంది ఫ్రెండ్స్‌ అంటున్నారు. నేను సందిగ్ధంలో ఉన్నాను. దయచేసి సలహా ఇవ్వండి. 
– అనిల్‌కుమార్, విశాఖపట్నం
 
మీరు విన్న రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. 

మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల  వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్‌ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు.  అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్‌ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్‌ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్‌)గా కాకుండా... మాడరేట్‌ ఎక్సర్‌సైజ్‌ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్‌ ఆడటం, డాన్స్‌ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. 
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

మరిన్ని వార్తలు