కాదు.. రాంగు!

26 Apr, 2018 00:01 IST|Sakshi
కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన హెల్త్‌ టిప్‌ 

లెఫ్టా? రైటా? 

అరటిపండు ఒలిచిపెట్టినట్లు విషయం చెప్పాలని ప్రయత్నించిన కేంద్ర ఆరోగ్యశాఖ ట్విట్టర్‌లో ఆ.. ప్రయత్నం చేసి అభాసుపాలైంది! ‘మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇలానా? ఇలానా? అంటూ కింది ఫొటోను పోస్ట్‌ చేసింది. నియంత్రణ లేకుండా జంక్‌ఫుడ్‌ తినేస్తే ఎడమ వైపు ఉన్నట్లు, క్రమబద్ధంగా నియమిత ఆహారం తీసుకుంటే ఎడమ వైపు ఉన్నట్లు మీ దేహం తయారవుతుందని చెప్పడం ఆరోగ్యశాఖ ఉద్దేశం. అయితే దీనిపై  కొందరు తీవ్రంగా స్పందించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా  ట్విట్టర్‌లోంచి ఈ ఫొటోను తొలగించారు ఆరోగ్యశాఖ అధికారులు. ‘మీరేం చెప్పదలచుకున్నారు? లావుగా ఉంటే అనారోగ్యం అనీ, బక్కపలుచగా ఉంటే అరోగ్యమనీనా?’ అని రీట్వీట్‌లు వచ్చాయి.

‘‘అసలు మీరీ హెల్త్‌ టిప్‌ను విడుదల చేసేటప్పుడు వైద్యనిపుణులను ప్రశ్నించారా?’’ అని కొందరు ప్రశ్నించారు.  స్త్రీ దేహాన్ని రెండుగా వర్గీకరించి చూపడంపై మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు. ‘‘స్త్రీలు లావుగా, సన్నగా ఉండడం అనేది సాధారణంగా తినే తిండిని బట్టి కాకుండా.. డయాబెటిస్, హార్మోన్‌ అసమతౌల్యతలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి వాటిని బట్టి ఉంటుంది. ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి జీవనశైలిని మార్చుకోండని చెప్పడానికి స్త్రీలను కించపడేలా ఉన్న ఈ ఫొటోను జనంలోకి పంపించడం ఏమిటని వైద్యులు కూడా కొందరు తమ అసహనాన్ని వ్యక్తం చేయడం విశేషం. నిజమే కదా! తేలిగ్గా చెప్పబోయి, మహిళల్ని తేలికచేసినట్టయింది!

మరిన్ని వార్తలు