రొమ్ము కేన్సర్‌కు ఉల్లి, వెల్లుల్లి మంత్రం 

25 Sep, 2019 03:01 IST|Sakshi

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా రొమ్ము కేన్సర్‌ విషయంలో మాత్రం ఇది అక్షరాల వాస్తవమని, ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండేందుకు ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు బఫెలో, ప్యూర్టరికో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్యూర్టరికోలోని కొంతమందిని నిశితంగా పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకొచ్చామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గౌరీ దేశాయి తెలిపారు.

ఉల్లి, వెల్లుల్లితో ప్యూర్టరీకన్లు చేసే సోఫ్రిటో అనే వంటకం అసలే తినని వారితో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు తినే మహిళలకు రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం 67 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్‌ నుంచి రక్షణకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయన్న గత అధ్యయనాల ఆధారంగా తాము ఈ పరిశోధన చేశామని చెప్పారు. యూరప్, అమెరికాల కంటే ప్యూర్టరికోలో ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువని, ఈ కారణంగా ఇక్కడ రొమ్ము కేన్సర్‌ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాల్స్, ఆర్గానోసల్ఫర్‌ పదార్థాలు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. రోమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న 314 మందితో పాటు లేని 346 మందిపై 2008– 2014 మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు