నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను

22 Mar, 2015 23:54 IST|Sakshi
నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను

అవిశ్రాంతం -అరవై తర్వాత
 
రాళ్లపల్లి వెంకట నరసింహారావు... ఇంత పొడవు పేరు చెబితే అయోమయం కలుగుతుంది. రాళ్లపల్లి... అనగానే చక్కటి ఉచ్ఛారణ, స్పష్టమైన హావభావాల వ్యక్తీకరణతో అనేక పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. నాటకరంగ నేపథ్యమే తనను ఇంత వరకు నడిపించిందని చెప్పే రాళ్లపల్లి ‘చెడ్డసినిమా ఉంటుందేమో కానీ చెడ్డ నాటకం ఉండదంటారు. రాబోయే ఆగస్టు 15వ తేదీతో డెబ్బైలోకి అడుగు పెట్టనున్న ఆయన అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవితాన్ని ‘అవిశ్రాంతం’గా మలుచుకున్న వైనం ఆయన మాటల్లోనే...
 
‘‘అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వృత్తిలో కొంత విరామం దొరికినట్లయింది. అప్పటి వరకు ఏడాదికి 365 రోజులు పని చేసిన స్థితి నుంచి నా పని వారానికి మూడు రోజులకే పరిమితమైంది. అది నేను తెచ్చుకున్న విరామం కాదు. ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రభావంతో వచ్చిన విరామం. విద్యార్థి అవతారమెత్తి ఆ ఖాళీని బిజీగా మలుచుకున్నాను. 2011లో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సులో చేరాను. డిస్టింక్షన్‌లో పాసయ్యాను కూడా. ఇప్పుడు ఎం.ఫిల్ చేస్తున్నాను. రిటన్ టెస్ట్ పూర్తయింది. థీసిస్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత పీహెచ్‌డి చేద్దామనుకుంటున్నాను.
 
అరవై ఆరేళ్ల విద్యార్థి!

ఇన్నేళ్లు నటించిన తర్వాత ఇంక నటన గురించి చదువుకోవడమేంటి- అని విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ, విద్యార్థిదశను ఆస్వాదించాను. ఈ తరం యువతతో కలిసి చదువుకోవడం నాకూ- వారికీ పరస్పరం ఉపయుక్తంగానే సాగింది.  గతంలో సాంఘిక నాటకాలు రాసిన నేపథ్యం ఉండడంతో నటన, ఉచ్చారణ, అభినయం వంటి అంశాలలో పాఠాలు చెప్పగలిగినంత పట్టు వచ్చింది. ఏదైనా అంశం మీద ఉపన్యసించగలిగిన సామర్థ్యం అలవడింది.
 
నాటకం చూడాలి లేదా చదవాలి!

నా దైనందిన జీవితం ఎప్పుడూ ఉదయం ఐదూ ఐదున్నరకే మొదలవుతుంది. పూజ, ధ్యానం తర్వాత ఉపాహారం. ఏదైనా ఓ నాటకాన్ని తీసుకుని చదవడం, మిత్రులను సంప్రదించి నాటక ప్రదర్శన, సాధన గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాను. భోజనం తర్వాత ఓ అరగంట సేపు టీవీ చూస్తాను. సాయంత్రమైతే రవీంద్రభారతిలోనో, తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్‌లోనో ప్రదర్శించే నాటకాలకు ఆహ్వానాలు సిద్ధంగా ఉంటాయి. మూడు రోజుల కిందట కూడా జ్యోతిరావు ఫూలే మీద నాటకం చూశాను. 1966లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ప్రదర్శించడం... వంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ విరామమే తగిన సమయం.
 
నాటకానికి టికెట్టు కొనడమా!

థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించే నాటకాలకు తప్పకుండా వెళ్తుంటాను. మిత్రబృందంతో కలిసి నాటకాలు ప్రదర్శిస్తుంటాను. నేను పదిసార్లు అమెరికాకు వెళ్లాను. ప్రతిసారీ ఏదో ఒక నాటకాన్ని చూసేవాడిని. మన దగ్గర టికెట్ కొని నాటకం చూసే అలవాటే లేదు. అలాగని నాటకానికి ఆదరణ తగ్గలేదు. కళాపోషకులు ఆసక్తి కొద్దీ ప్రదర్శిస్తే చూసే వాళ్లు మాత్రం ఉన్నారు. గత ఏడాది యాంకర్ ఝాన్సీ మొదలైన వాళ్లం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఒంగోలులో నాటక ప్రదర్శనకు రాత్రి తొమ్మిదికి మొదలైనా సరే ప్రేక్షకులు ఉన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే నాటకం ప్రధానస్రవంతిలోకి రావాలని కోరుకుంటూ పని చేసుకుపోవడం మా వంతు. ఇంకా నాటకాలు వేయడం వల్ల మేము నాటకరంగానికి చేస్తున్న మేలు ఏమీ ఉండదు. ఇదంతా మమ్మల్ని మేము పనిలో నిమగ్నం చేసుకుని సంతోషంగా ఉండడానికే.
 
కళాకారులకు ప్రోత్సాహంగా...

పేదరికంలో ఉన్న రంగస్థల నటులకు సన్మానం చేసి పదివేల నుంచి పాతిక వేల వరకు నగదు బహుమతినివ్వడం అనే ఓ వ్యాపకాన్ని పెట్టుకున్నాను. మిత్రుల సహకారంతో ఎనిమిదేళ్లుగా ఆగస్టు 15వ తేదీన నా పుట్టిన రోజు నాడు ఒకరికి బహుమతి ఇస్తున్నాను. మందుల వంటి కనీస ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి నా శక్తి కొద్దీ నేను అందిస్తున్న చిన్న ఆసరా.
 
నాకు చేతనైంది నటించడం... నేర్పించడం

నేను మూడు వేల నాటకాలు వేశాను, ఏడు వందలకు పైగా సినిమాలు చేశాను. నాకు చేతనైంది నటించడం, ఎలా నటించాలో నేర్పించడం, చక్కటి కథను ఆసక్తికరమైన కథనంతో తీర్చిదిద్దడం వంటివే. బహుశా అవే నన్ను అవిశ్రాంతంగా ఉంచుతూ నన్నింకా బతికిస్తున్నాయేమో! (నవ్వు)
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు:రాజేశ్ రెడ్డి

 
ముగింపు లేని కథ, మారని సంసారం, జీవన్‌మృతుడు నాటకాలను రాశారు.


వరవిక్రయం నాటకాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాతికకు పైగా ప్రదర్శనలిచ్చారు.

మరిన్ని వార్తలు