ఈ కాలమ్ మీదే చర్చా వేదిక | Sakshi
Sakshi News home page

ఈ కాలమ్ మీదే చర్చా వేదిక

Published Mon, Mar 23 2015 12:00 AM

ఈ కాలమ్ మీదే చర్చా వేదిక - Sakshi

పాఠకులకు ఆహ్వానం...
 ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
 
దైవం కొలువైన చోటు...

గత రెండు వారాల్లో ‘రీడర్స్ కాలమ్’లో ప్రచురితమైన ఉత్తరాలు చదివిన తరువాతన నాకు కూడా రాయాలనిపించి ఇది రాస్తున్నాను. చెట్లు పెంచడం, చెట్లను రక్షించుకోవడం అనేది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు... మన కోసం మనం చేస్తున్న పని. మరి ఈ పనికి కూడా లెక్కలేసుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ‘చెట్టు అనేది ఒక వనరు కాదు... అది మన పచ్చటి జీవితం’ అని అర్థమైన రోజు ఎవరూ చెట్లను కొట్టేయడానికి సాహసించరు. రెండు నెలల క్రితం నా స్నేహితుడు ఫోన్‌లో నాతో మాట్లాడుతూ అన్నాడు-‘‘కొత్త ఇల్లు కడదామని ప్లాన్ చేసి పనిలోకి దిగాను. పాత ఇంటి ఆవరణలో ఉన్న రెండు చెట్లను కొట్టేస్తే కంఫర్టబుల్‌గా కట్టొచ్చు అని చెప్పాడు మేస్త్రీ. అవసరమైతే ఆ చెట్ల కిందనైనా కాపురం చేస్తానుగానీ కొట్టివేసే ప్రసక్తి లేదు అని చెప్పా’’
 
 స్నేహితుడి మాటలు నాకెంతగా సంతృప్తినిచ్చాయో..! ఈ మాట ఎంతోమందికి చెప్పి ఉంటాను. మన ఇంట్లో చెట్టు నాటితే అది మన ఇంటికి మాత్రమే ఉపయోగపడదు. అడగక పోయినా పక్కింటి వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. అది చెట్టు గొప్పదనం. చెట్లకు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి. అందులో ప్రతి నిబంధన, నియమం చెట్లను కాపాడే విధంగా ఉండాలి. శిక్షలు కఠినంగా ఉండాలి. మన దేశంలో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పుడు ఒక మంచి పని కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉంటే తప్పేమిటి? ఆలయాలకు వెళ్లినప్పుడు ఆలయం చుట్టూ చెట్లు కనిపిస్తాయి. మనమందరం దైవం కోసం ఆలయంలోకి వెళుతుంటాము. నిజానికి దైవం అనేది సజీవమైన చెట్లలోనే ఉన్నదని నా నమ్మకం. చెట్లకు నమస్కరిస్తే దైవానికి రెండు చేతులెత్తి నమస్కరించినట్లే!
 - వి.కుమారస్వామి, కర్నూల్
 
ఇవెక్కడి పోస్టర్‌లండీ బాబూ!
కుటుంబసభ్యులతో కలిసి బజారుకు వెళదామంటే భయంగా ఉంది. దీనికి కారణం సినిమా పోస్టర్లు! ఎటు చూసినా అసభ్యమైన సినిమా పోస్టర్లు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. సినిమాల్లో అశ్లీలం సంగతి తరువాత విషయం... ముందు ఈ గోడల మీద అశ్లీలం సంగతి తేల్చాలి. ఈ పోస్టర్ల వల్ల అడపాదడపా యాక్సిడెంట్లు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గోడల మీద పోస్టర్లు వేయవచ్చా? వేస్తే ఎలాంటివి వేయాలి? దీనికి సంబంధించి ఏదైనా నియమనిబంధనావళి ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం అశ్లీల పోస్టర్లను గోడల మీద అతికించినందుకు ఆ సినిమా నిర్మాత, థియేటర్ యజమాని తదితరులపై కేసు బుక్ చేయాలి. మా వీధిలో గోడపై అతికించిన ఒక పోస్టర్ చూసి నా కోపం నషాలానికి అంటింది. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాను. సదరు పోలీసు వారు మాత్రం పెద్దగా స్పందించలేదు. ‘ఇదో పెద్ద సమస్యా!’ అన్నట్లుగా కూడా మాట్లాడారు. గోడల మీద అశ్లీల పోస్టర్లు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీలో ఎవరైనా చెబుతారా?
 - ఆర్.వినయ్ కుమార్, హైదరాబాద్
 
 మార్కులే ప్రాధాన్యం కావొద్దు!
 పరీక్షలు పిల్లల్నే కాదు... పెద్దల్ని కూడా భయపెడుతున్నాయి. మార్కులు కుప్పలు తెప్పలుగా తెచ్చుకోవడానికి అందరూ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. పరీక్షల ఉద్దేశం మార్కులు, ర్యాంకులు కాదు... ఎంత నేర్చుకున్నారు అనేది!  అందుకే 75 శాతం మార్కులు పుస్తకాల నుంచి ఇవ్వాలి. మిగతా 25 శాతం సామాజిక స్పృహకు చెందినవి ఉండవు. పర్యావరణం, దేశభక్తి, ట్రాఫిక్ నియమాలు, పెద్దలను గౌరవించడం... ఇలా ఏదైనా కావచ్చు... నిత్యజీవితానికి సంబంధించిన విషయాలలో విద్యార్థుల అవగాహనను పరీక్షించి దానికి తగినట్లు మార్కులు ఇవ్వాలి. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు. లోకజ్ఞానం కూడా ఈనాటి విద్యార్థిలోకానికి అవసరం.
 - బోగిరెడ్డి శ్రీనివాసరావు, వనస్థలిపురం, హైదరాబాద్-70
 
 ఆ ఆప్యాయత... ఇంగ్లీష్‌లో ఎక్కడిది?!
 తెలుగు భాష అభివృద్ధికి ప్రతివారు వారి వారి స్థాయిలో తగిన చర్య తీసుకోవాలి. మన మాతృభాష తెలుగు భాషకు ఉండవలసిన గౌరవం ఎప్పడూ ఉంటూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తూ తెలుగులో సంతకం ఎంతమంది చేస్తున్నారు? తమిళ, కన్నడ వాసులు వారి మాతృభాషలోనే సంతకం చేస్తున్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత సమాజం ఆంగ్ల భాషతోనే నడుస్తోంది అనేది కాదనలేని సత్యం. అయితే మాతృభాషలో అవగాహన ఉంటేనే మిగిలిన ఏ ఇతర భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చు. మావాడికి తెలుగు రాదు, తెలుగులో రాయలేడు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మారాలి. నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్కా, వదిన పిలుపులలో ఉన్న ఆప్యాయత, అనురాగం మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ పిలుపులలో ఉందా?
 - సాయి ప్రకాష్, విశ్రాంత ఉప తహసీల్దార్, విశాఖపట్నం.
 
 బాల్యం నుంచే...
 స్త్రీలపై జరిగే అత్యాచార ఘటనల గురించి చదివినప్పుడల్లా బాధేస్తుంది. స్త్రీలను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. మన తల్లి, చెల్లి కూడా స్త్రీ లే కదా! అత్యాచారానికి గురైన స్త్రీ కూడా ఎవరికో చెల్లిగానో, తల్లిగానో, భార్యగానో, కూతురిగానో ఉంటుంది కదా! స్త్రీల పట్ల గౌరవ, మర్యాదలతో ఉండాల్సిన సంస్కృతిని బాల్యం నుండే నేర్పితే... సమాజం తల దించుకునే సంఘటనలు జరగవు.
 - పంపన సాయిబాబు, తెలుగు ఉపాధ్యాయులు, తోలెరు.

Advertisement
Advertisement