పెట్టుబడులకు ఇది తగిన సమయం

2 Oct, 2015 23:57 IST|Sakshi
పెట్టుబడులకు ఇది తగిన సమయం

అక్టోబర్ 3 నుంచి 9 వరకు
 

 
టారో బాణి
 
 ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)

అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోండి. ఇతరుల మాట వినవద్దు. పనిపరంగా ఈ వారంలో  కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీకూ, మీ జీవిత భాగస్వామికీ భేదాభిప్రాయాలు రావడం వల్ల చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు సంయమనం పాటించడం మంచిది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కలిసొచ్చేరంగు: ఆరంజ్
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
ఈ వారమంతా విందు వినోదాలతో గడిచిపోతుంది. మీ చుట్టూ జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలన్న నిశ్చయానికి వస్తారు. మీ లవర్‌కీ మీకూ మధ్య భేదాభిప్రాయాల వల్ల మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. పనిపరంగా మాత్రంగా మీరు చాలా స్పష్టంగా, స్థిరంగా ఉంటారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తారు. కలిసొచ్చే రంగు: బ్లూ షేడ్స్
 
జెమిని (మే 21-జూన్ 21)

కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకెళతారు. మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమైన ఉత్సాహాన్ని, శక్తిని పుంజుకుంటారు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. పనిపరంగా గతంలోకన్నా చాలా నిజాయితీగా, అంకితభావంతో పని చేస్తారు. క్రమశిక్షణ పాటిస్తారు. జీవిత భాగస్వామికి న్యాయం చేసేవిధంగా నడుచుకుంటారు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)

అనుకోని విధంగా కొన్ని చిక్కులు, ఇబ్బందులు వచ్చి, మానసికాందోళన కలిగిస్తాయి. పనిపరంగా భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో మరింత శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తున్న వారి అభిరుచులకు తగ్గట్టు మంచి భాగస్వామి లభిస్తారు. కలిసొచ్చే రంగు: లేత ఊదారంగు
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

 మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకోవలసిన అవసరం ఉంది. పనిపరంగా విస్తృతంగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్నేహితులందరూ నిజమైన స్నేహితులు కారని తెలుసుకుంటారు. ఓ అభిప్రాయం విషయంలో మీకు, మీ జీవిత భాగస్వామికీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: క్రీమ్
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
కొన్ని విషయాలలో మీ అభిప్రాయాలను, నిర్ణయాలను మార్చుకోవలసి రావచ్చు. మీ పంతాన్ని వదులుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీ అంచనాలకు తగినట్టుగా పనులు జరగకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. మీ మనసు ప్రేమను, స్వాంతనను కోరుకుంటుంది. కానీ అది లభించకపోవచ్చు. కలిసొచ్చే రంగు: బ్లూ
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఈ వారం మీకు సమృద్ధిగా డబ్బు వస్తుంది. అదృష్టం కలిసి రావడం వల్ల అనూహ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దయగా, ప్రేమగా వ్యవహరించడం వల్ల మీకు కూడా వారి ప్రేమ లభిస్తుంది. పనిపరంగా పెద్దవాళ్లు, సీనియర్లు చెప్పినట్లు నడుచుకోవడం మంచిది. స్నేహితులతో విందు వినోదాలతో గడుపుతారు. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
విలాస వస్తువులను కొనుక్కుంటారు. చాలా కాలంగా కష్టపడి పని చేస్తున్నందుకుగాను మీరు మీ వృత్తి, ఉద్యోగ వ్యాపారాలకు సెలవుపెట్టి సేదతీరతారు. డబ్బును లెక్కాపత్రం లేకుండా ఖర్చుపెట్టి, ఆ తర్వాత బాధపడేకంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. ఉద్యోగంలో లేదా గృహంలో మార్పులు జరగవచ్చు. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
పెట్టుబడులు పెట్టడానికి, సంపదను పెంచుకోవడానికీ ఇది తగిన సమయం. గతాన్ని తవ్వుకుని బాధపడేకంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం అవసరం. ధైర్యంగా జీవించండి. ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రంగా పని చేయండి. అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోండి. ధ్యానం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. కలిసొచ్చే రంగు: వయొలెట్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
మేలైన, మెరుగైన జీవితం గడుపుతారు. దీర్ఘకాలంగా ఉన్న ఒక స్నేహబంధం ఆత్మీయబంధంగా మారవచ్చు. స్నేహబంధాలు పెంచుకోవడం మంచిది. సన్నిహితులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామికి ఆసరా ఇవ్వండి. వారాంతాన్ని బయటికెళ్లి హాయిగా గడపండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
గడ్డు కాలం గడిచిపోయింది. ఆహ్లాదకరమైన సమయం ముందుంది. అదృష్టం కలిసి వస్తుంది. మరింత మెరుగైన జీవితం గడుపుతారు. అభివృద్ధికి ఆస్కారం ఉంది. ఖర్చులకు తగ్గ రాబడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా కొత్త విషయాలను నేర్చుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా, నిర్మలమైన మనస్సుతో ఉండండి. కలిసొచ్చే రంగు: పింక్
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
సృజనాత్మకంగా గడుపుతారు. ముఖ్య విషయంలో బంధువుల సహకారం లభిస్తుంది. సానుకూల భావనంతో ఉండటం వల్ల అనుకున్నది సాధిస్తారు. కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. ఒక స్త్రీ మూలంగా మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంత వేగంగా ఖర్చు పెడతారో, అంత వేగంగానూ సంపాదిస్తారు. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
ఇన్సియా కె.
టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 సౌర వాణి
 

ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
మీతో వ్యతిరేకించే వ్యక్తులతో ధర్మబద్ధంగానూ, నిజాయితీగానూ మీరు మాట్లాడే కారణంగా వాళ్లలో శత్రుత్వం క్రమక్రమంగా తగ్గుతుంది. ఎవరితోనూ విభేదించాల్సిన కాలం కాదిది. అలాగే రుణాలు ఇచ్చినవారు కూడా మీ మాట నేర్పరితనాన్ని గమనించి ఒత్తిడిచేయడం మానుకుంటారు. మీమాటే మీకు విజయమంత్రం.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
మీకు సంపాదనిచ్చే వ్యాపారం మీకు నిరాశని కల్గించవచ్చు. మీకు అనుకూలంగా ఉంటారనుకున్నవారు తాత్కాలికంగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ, సమయానికి ముఖం చాటేయవచ్చు. మీకు యదార్థమనిపించిన పక్షంలో అలాంటి వ్యక్తులతో సూటిగా మాట్లాడండి తప్ప, మొహమాటపడవద్దు. మీ ధైర్యం మీకు శ్రీరామరక్ష.
 
జెమిని(మే 21-జూన్ 21)
ఆదాయం ఎంతగా వృద్ధి చెందుతుందో దానికి మించి శారీరక శ్రమ చేయవలసి వస్తుంది. ఎక్కడ, ఏ పనిలో ఉన్నా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆలోచనలే వస్తూ, పరధ్యానంగా ఉండే అవకాశం వుంది. సమయం చిక్కక పై అధికారులు చెప్పిన పనిని చేయని పక్షంలో ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా వ్యవహరించండి.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, పాతవాటిని మార్పుచేయడం జరిగే అవకాశముంది. ఎంత ఖర్చవుతుందో అంతకి సరిపోను ఆదాయం లభించే వీలుంది. ఒక కుటుంబ వ్యవహారం మీ మనస్సుని నిరంతరం బాధిస్తూనే ఉంటుంది. ఆ వ్యవహారం మరికొంత ముదిరే అవకాశమున్నా మీకు ఏ హానినీ కలగజేయదని గమనించండి.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
ఋణాలు తీరినప్పటికీ ఆర్థికంగా లోటుతో ఉండి ఎలా ఈ లోటుని పూరించాలా అనే దిగులుతో ఉంటారు. మీదైన కులవృత్తినీ, ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి తప్ప, ఆర్థికమైన లోటు పూడ్చాలనే ఉద్దేశంతో మరో వ్యాపారంలో వేలు పెట్టకండి. గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా మళ్లీ ఇబ్బందిలో పడవచ్చు. మంచిరోజులొస్తున్నాయి.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఎంత నియంత్రించుకోవాలని ప్రయత్నించినా ఖర్చుల విషయంలో నియంత్రణ అసాధ్యం కావచ్చు. బంధువులు ఋణాన్ని యాచిస్తే తిరస్కరించగల ధైర్యం మీకు వస్తుంది. అది చాలు మీ అభివృద్ధికి. ఈవారం మొత్తం మీకు మీరుగా ఏ నిర్ణయాన్ని చేయకుండా అనుభవజ్ఞుల్ని సంప్రదించండి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త పాటించండి.
 
లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
భర్తది ఈ రాశి అయితే భార్య, భార్యది ఈ రాశి అయితే భర్త పరస్పర అనుకూల భావాలతో  ఉండడం అవసరం. కొత్తకొత్త సలహాలిచ్చేవారిని దరిచేరనీయకండి. మీ కుటుంబ సౌధానికి ఉన్న పునాదుల్ని కదిలించే ప్రయత్నాన్ని వారు చేయవచ్చు. హానిని చేయాలన్న ఉద్దేశం వారికి ఉండకపోవచ్చుగాని ఫలితం మాత్రం అలాగే ఉండవచ్చు, జాగ్రత్త!
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే దుర్వినియోగం చేస్తారు. శని పీడ  తొలగడం కోసమే ఈ వ్యయం అవుతుంది. మీ అభిమానాన్ని దెబ్బతీసే చర్యలూ, పరిస్థితులూ  ఎదురు కావచ్చు. అలాగే మీవైపున ఎందరో ఉండి కూడా, ఏమాత్రం ఆదుకోలేని స్థితి మీకు కలగవచ్చు. శనిస్తోత్రాన్ని పారాయణం చేయేడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

చేసిన, చేస్తున్న ఏ ప్రయత్నమైనా శీఘ్రంగా కాదుగాని, తప్పక సిద్ధిస్తుంది. వృత్తిలో మీ శ్రమకి తోడుగా మీ పై అధికారులు మరో వృత్తి, ఉద్యోగ బాధ్యతల్ని కూడా అప్పగించే అవకాశముంది. జాగ్రత్తతో ఉండాలి. కార్యసిద్ధి విషయంలో ఎదురుచూపు తప్పదు. మీ సంతానానికి సంబంధించిన విద్య కొద్దిగా మందకొడిగా ఉండవచ్చు.    
 
క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20)
ఎంత చేసినా మీ కుటుంబంలోని వ్యక్తులకెందుకో మీ విషయంలో అసంతృప్తి అలా ఉంటూనే ఉండచ్చు. అనుకున్న ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. అనవసర వ్యయం జరుగుతోందనే అభిప్రాయం, దానితోబాటు నిరాసక్తీ వంటి కారణాలుండవచ్చు. తీర్థయాత్ర చేస్తారు. దంపతులు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించడం అవసరం.
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
విద్యార్థి దశలో ఉన్న మీ సంతానం విషయంలో మీకు కొన్ని సందేహాలు, భయాందోళనలూ ఉండవచ్చు. అయితే వారి మీద సంపూర్ణ దృష్టిని నిలిపి వాళ్లని సరిగా పర్యవేక్షణ చేస్తున్న పక్షంలో మానసిక అశాంతి ఉండదు. మొదటిసారి మీ అభ్యర్థనకే మీ మాట వింటారని చెప్పలేం కానీ, కనీసం 4,5 రోజులపాటు ప్రయత్నించడం అవసరం.
 
పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20)
మొక్కుబడి తీర్చుకోవాలన్న నిర్ణయానికి వస్తారు. మీ వ్యాపారానికి సంబంధించిన వాహనాన్ని కొంటారు. వచ్చే ఆదాయంతో ఎలా వ్యయం చేసుకోవాలనే గట్టి ఆలోచనని మీరు అమలు చేసి పాటించదలిస్తే మీ కుటుంబం ఓ మార్గదర్శక కుటుంబ అయినట్లే. ఆస్తులకి సంబంధించిన వ్యవహారాలను మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా