కాటమ రాయుడా... కదిరి నరసింహుడా...

1 Mar, 2017 00:09 IST|Sakshi
కాటమ రాయుడా... కదిరి నరసింహుడా...

పుణ్యతీర్థం
మార్చి 7 నుంచి ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు

ఆ దేవుడు కాటమరాయుడు. ఆయనే కదిరి నరసింహుడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి దివ్య క్షేత్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉంది. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రం మార్చి 7 నుంచి వారం రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది. భక్త ప్రహ్లాదుని సహిత నారసింహుని క్షేత్రం భారత దేశంలో మరెక్కడా లేదు. ఒక్క కదిరిలోనే ఉంది. అది తెలుగువారికే సొంతమైన మరో విశేషం.

శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్య కశిపుని శిక్షణకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని భావించిన మహర్షులు, దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు ‘సోత్రాద్రి’ అని పేరు వచ్చింది. దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ‘ఖ’ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.

ఖాద్రి చెట్ల నుంచి...
కదిరి పక్కన ఉన్న కొండపై పూర్వం ఖదిర వృక్షాలు (చండ్ర చెట్లు లేదా మడుగు దామర లేదా ఇండియన్‌ మల్బరీ) ఎక్కువగా ఉండేవని ఈ చెట్ల దగ్గర ఉన్న పుట్టలో నారసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడని కనుక ఈ నారసింహుణ్ణి ఖాద్రి లక్ష్మీ నరసింహుడు అన్నారని మరో కథనం. స్వామి స్వయంభువుగా వెలిశాడనేదానికి గుర్తుగా అభిషేకం చేశాక హృదయ భాగం నుంచి స్వేద బిందువులు కనిపిస్తాయని ఇది స్వామి వారి మహిమ అని భక్తులు భావిస్తారు.

పాలెగాడి గోవులు...
ఈ ప్రాంతాన్ని పదవ శతాబ్దంలో పాలించిన రంగనాయకులు అనే పాలెగాడి గోవులు రోజూ కదిరి కొండపైకి వెళ్లి అక్కడ ఖాద్రీ వృక్షాల కింద గల పుట్టలో ఉన్న నరసింహస్వామికి పాలు ఇచ్చి వచ్చేవనీ, దీని దరిమిలా రంగనాయకులు తనకు తెలియకుండానే రోజు రోజుకూ శ్రీమంతుడు అయ్యాడని కథనం. చివరకు ఒకరోజు స్వామి రంగనాయకుల కలలో కనిపించి తాను స్వయంభువుగా వెలిశానని, తన విగ్రహాన్ని వెల్లడించి గుడి కట్టించమని కోరాడని తత్ఫలితంగా రంగనాయకులు గుడి కట్టాడని కథనం. అయితే ఆనాటి మూలవిరాట్టు కాలగతిలో అదృశ్యమవగా బుక్కరాయల కాలంలో ఆ తర్వాత హరిహరరాయల కాలంలో చివరిగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.

భృగు మహర్షి తపోస్థలం...
విష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, ఈ తపస్సుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిసి ఉన్నానని, తన విగ్రహాలను వెల్లడి చేసి పూజాదికాలు నిర్వహించమని కోరినట్టు కథనం. ఇది జరిగింది వసంత మాసంలో కనుక భృగువు కోనేరు నుంచి నారసింహుని విగ్రహాలను బయటకు వెల్లడి చేసింది వసంత మాసంలోనే కనుక ఈ స్వామిని వసంత వల్లభుడు అని కూడా అంటారు. విగ్రహాలు వెల్లడైన కోనేటిని ‘భృగు తీర్థం’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం భృగు మహర్షి కాలం నాటి ఈ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి దివ్యతేజస్సుతో ఉండటం భక్తులు గమనిస్తారు. ఇలా ఉత్సవ విగ్రహాలు ఇంత తేజస్సుతో ఉండటం దేశంలోని వేరే ఏ గుడిలోనూ చూడలేమని భక్తులు అంటారు.

కంభాల రాయుడు... కాటమ రాయడు...
దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా నరసింహావతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపం నందలి çస్తంభం (కంబం) నుంచి స్వామి ఆవిర్భవించాడు కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటాడు. అలా ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి.. అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా.. అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని ‘కాటం’ అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు పాల్గొంటారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఉపవాసంతో గొడ్డువెలగల నుండి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తున్నారు.

బేట్రాయి స్వామి దేవుడా...
కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామికి తెలుగు ప్రాంతం కంటే కూడా కర్ణాటక ప్రాంత భక్తులు ఎక్కువ. విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ‘పారు వేట’ ఒక ముఖ్య కార్యక్రమం. శ్రీదేవి, భూదేవిలతో వసంతవల్లభుడు క్రూరమృగాలను వేటాడటానికి కదిరి కొండకు వస్తాడనడానికి సంకేతంగా అర్చకులు ఈ ‘పారువేట’ను నిర్వహిస్తారు. ఈ పారువేట వల్ల ‘వేట రాయడు’ కాస్త కన్నడభాష వల్ల ‘బేట్రాయుడు’ అయ్యాడు. మృగాల నుంచి ప్రజలను రక్షించడం పాలకుడి ధర్మం. మనసులో సంచరించే దుష్ట ఆలోచనలనే క్రూరమృగాలను స్వామి సంహరిస్తాడన్న దానికి సంకేతంగా కూడా పారు వేటను చెప్పుకోవచ్చు. – చెరువు శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ కదిరి, అనంతపురం

కదిరికి చేరుకోవడం ఎలా?:
ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం ఆర్‌టీసీ బస్టాండ్‌ నుండి ప్రతి 10 నిమిషాలకు  ఒక బస్సు ఉంది. అక్కడి నుంచి ఈ క్షేత్రం 90 కి.మీ. పుట్టపర్తి నుంచి కేవలం 40 కి.మీ దూరం. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదంటే న ల్లమాడ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుండి మదనపల్లి మీదుగా లేదంటే  పీలేరు, రాయచోటి మీదుగా కూడా రావచ్చు.

పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు: కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించుకున్న పిమ్మట కదిరి–రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్‌ పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శించ వచ్చు. వీటిని చూసేందుకు కదిరి ఆర్‌టీసీ బస్టాండ్‌ నుండి బస్సు సౌకర్యం ఉంది. పుట్టపర్తిని కూడా దర్శించుకోవచ్చు.

దేశంలోనే 3వ అతి పెద్ద తేరు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనారసింహుడు బ్రహ్మరథంపై దర్శనమిస్తాడు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130  ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడేళ్ల క్రితం మరమ్మతులు కూడా చేయించారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం.

భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడు ఒక్క కదిరిలోనే ఉన్నాడు. ఈ దర్శనం ఇంకెక్కడా జరగదు. స్వామికి పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేది ఇక్కడే. ప్రతి నెలలో స్వాతినక్షత్రం రోజు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. అది భక్తులు చూసి తీరాల్సిన సేవ. – పార్థసారథి, ఆలయ ప్రధాన అర్చకులు
 

మరిన్ని వార్తలు