కాలేజ్‌ సీటు కోసం సత్యాగ్రహం

28 Feb, 2019 02:44 IST|Sakshi

నేడు నేషనల్‌ సైన్స్‌ డే

తొలి మహిళా సైంటిస్ట్‌ కమలా సోహానీ

శాస్త్రీయ విజ్ఞానాన్ని వినువీధిలో విహరింపజేయాలనే అభిలాషతో నిరంతరం శ్రమించి.. ఆ క్రమంలో లైంగిక వివక్షకు గురై అనేక అవమానాలు,అడ్డంకులు దాటుకుని గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన మహిళ కమలా సోహాని.బ్రిటీష్‌ కాలంలోనే నాటి లింగ వివక్షను ఆత్మస్థయిర్యంతో ఒంటరిగాఎదుర్కొని శాస్త్రీయ విజ్ఞాన శాస్త్రంలో వినూత్న పరిశోధనలతో రాణించిన ఆ ధీశాలిని ఈ ‘సైన్స్‌ డే’రోజు తప్పక స్మరించుకోవాలి. 

మహిళల ఉన్నతవిద్యకు అవకాశాలు అంతంత మాత్రం కూడా లేని కాలంలో 1912 సెప్టెంబర్‌ 14న మధ్యప్రదేశ్‌ని ఇండోర్‌లో జన్మించారు కమలా సోహాని. ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన కమల చదువులో ముందునుంచి విశేష ప్రతిభ కనబరిచారు. ఆమె తండ్రి నారాయణ, బంధువు మాధవరావ్‌ భగవత్‌ ఇద్దరూ కూడా బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ సైన్స్‌ (ప్రస్తుతం ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌)లో రసాయన శాస్త్రంలో పట్టాపొందినవారే. వారిని ఆదర్శంగా తీసుకున్న కమల.. జీవ రసాయన శాస్త్రంలో రాణించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల విద్య అనంతరం బాంబే ప్రెసిడెన్సీ కాలే జీలో బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) డిగ్రీ చదివారు. డిగ్రీలో తన సహచరుల కంటే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. 

సీవీ రామన్‌ అభ్యంతరం!
మాస్టర్స్‌ డిగ్రీ చేయాలని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) లో సీటు కోసం కమల ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో నోబెల్‌ బహుమతి గ్రహీత సీవీ రామన్‌ ఐఐఎస్‌సీ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు. తన ప్రవేశాన్ని ఆయన నిరాకరించడంతో కమల దిగ్భ్రాంతికి గురయ్యారు. డిగ్రీలో మంచి ] ూర్కులు సంపాదించినప్పటికీ, కేవలం మహిళ అనే కారణంగా ఆమె సీటు సంపాదించుకోలేక పోయింది! కమల తండ్రి, బంధువు సీవీ రామన్‌ దగ్గరకు వెళ్లి ప్రవేశం కల్పించాలని అభ్యర్థించినా కూడా ఆయన నిరాకరించారు. బాలికలకు ఐఐఎస్‌సీలో ప్రవేశంలేదని, మహిళలు పరిశోధనలలో పురుషులతో సమానంగా పోటీపడలేరని తేల్చి చెప్పారు. కమల పట్టు వదలక ఎలాగైనా ఐఐఎస్‌సీలో చేరడం కోసం దృఢ సంకల్పంతో పోరాడాలని నిశ్చయించుకున్నారు. సీవీ రామన్‌ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం చేశారు. దీంతో దిగివచ్చిన రామన్‌ కొన్ని షరతులతో ఆమెను ఐఐఎస్‌సీలో ప్రవేశానికి అంగీకరించారు. 

ఇవే ఆ షరతులు!
ఒకటి.. రెగ్యులర్‌ అభ్యర్ధిగా కాకుండా సంవత్సరకాలం ప్రొబేషన్‌లో ఉండాలి. రెండు.. గైడ్‌ సూచనల మేరకు రాత్రులలో కూడా పనిచేయాలి. మూడు.. పురుషుల చదువు ధ్యాస మళ్లకుండా ల్యాబ్స్‌లో మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఈ మూడు షరతులను కావాలనే తనను నిరుత్సాహ పరిచేందుకే విధించారని గ్రహించినప్పటికీ కమల ఆ షరతులను అంగీకరించి సీటు సంపాదించారు. దీంతో ఐఐఎస్‌సీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా (1933) గుర్తింపు పొందారు. ‘‘రామన్‌ గొప్ప వ్యక్తి కావచ్చుగాని ఆయనకు స్త్రీల ప్రతిభ, పట్టుదలలపై నమ్మకం లేదు. ఇది చాలా బాధాకరం’ అని ఒకానొక సందర్భంలో ఆమె వాపోయారు. 

ప్రొటీన్‌లపై పరిశోధన
ఐఐఎస్‌సీలో చేరాక పాలు, పప్పు దినుసులు, మొక్కలలో ఉండే ప్రొటీన్లపై పరిశోధనలను ప్రారంభించారు కమల. ఆమె అంకిత భావాన్ని చూశాక గానీ, శాస్త్రీయ పరిశోధనల్లో మహిళలు రాణిస్తారన్న నమ్మకం సీవీరామన్‌కు కలగలేదు. 1936లో ఆమె తన పరిశోధనలను సమర్పించి ఎంఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. వెంటనే యూకేలోని సుప్రసిద్ధ కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఆమె సత్తాను గమనించిన సీవీరామన్‌ మరుసటి ఏడాదే ఐఐఎస్‌సీలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించారు! అలా ఆమె ఒక మార్పునకు నాంది అయ్యారు.

పేదల కోసం పానీయం
కేంబ్రిడ్జిలో కమల బంగాళదుంపలపై పరిశోధన జరిపి సైటోక్రోమ్‌–సీ అనే ఎంజైమ్‌ను కనుగొన్నారు. ఈ ఎంజైమ్‌ జీవులు, మొక్కలు, జంతువులు, మనుషులలో శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరిస్తూ రెండు వారాలలో నలభై పేజీల సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. అలా పీహెచ్‌డీ పట్టా పొంది భారతదేశంలోనే తొలి మహిళా శాస్త్రవేత్తగా కమలా సోహాని గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే యు.ఎస్‌.లోని కెమికల్‌ కంపెనీ నుంచి ఆమెకు అవకాశాలు లభించాయి. అయితే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనాలని భావించి 1939లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలోని లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కళాశాలలో బయో కెమిస్ట్రీ అధిపతిగా పని చేశారు. అనంతరం నేషనల్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడే విటమిన్‌లు, పోషణ, వాటి ప్రభావంపై పరిశోధనలు జరిపారు.

ఆ సమయంలోనే ఎంవీ.సోహానీని వివాహం చేసుకొని 1947లో ముంబాయి వెళ్లారు. బాంబే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ సలహాపై ‘నీరా’ అనే పానియాన్ని పేదల పోషణావసరాల కోసం తయారు చేశారు. నీరాలోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి.. పిల్లలు, గర్భిణులకు పోషకాలుగా, గిరిజన ప్రాంత పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సప్లిమెంటుగా వాడొచ్చని నిరూపించారు.  శాస్త్ర విజ్ఞానంలో సమాజానికి  ఇలా ఎంతో సేవ చేసిన కమలా సోహాని 1998లో ఓ సంస్థ ఏర్పాటు చేసిన సన్మానసభలో అకస్మాత్తుగా మరణించారు. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో నేటితో ముగుస్తున్న ‘నేషనల్‌ సైన్స్‌ డే’ వారోత్సవాలు ఈ తొలి మహిళా శాస్త్రవేత్తకు ఘనమైన నివాళిని ఇవ్వనున్నాయి.  
పోగూరి చంద్రబాబు, 
సాక్షి, తిరుపతి

ఆదర్శ మహిళ కమలా సోహాని
ఆంగ్లేయుల పాలనలో మహిళలపై వివక్షకు ఎదురొడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమలా సోహాని మహిళా లోకానికే ఆదర్శనీయం. అయితే ఆమెకు తగినంత గుర్తింపు దక్కలేదనే భావించాలి. 

యండ్రపల్లి దుర్గయ్య, ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్, 
తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం

మరిన్ని వార్తలు