మూర్ఖుడన్న గురువే మేలు!

10 Jun, 2017 23:09 IST|Sakshi
మూర్ఖుడన్న గురువే మేలు!

అతనొక రాజు. జెన్‌ గురించి నేర్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలియలేదు. మంత్రులను సమావేశపరిచాడు. మనసులోని మాట చెప్పాడు. అందరూ కలిసి ఒక్క మాటగా ఇద్దరు గురువుల పేర్లు చెప్పారు. ఆ ఇద్దరూ మహానుభావులే.

వారిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కాబట్టి ఇద్దరినీ తన తన ఆస్థానానికి పిలిపించాడు. వారితో తన ఆసక్తిని చెప్పాడు. అప్పుడు మొదటి గురువు ‘‘రాజా! నువ్వు గొప్ప మేధావి. నీకు జెన్‌ నేర్పడం నాకు మహా ఆనందం’’ అన్నాడు చిర్నవ్వుతో. రెండోగురువు తొలి గురువు వంక కోపావేశంతో చూసాడు ‘‘రాజు తెలివితక్కువ వాడు. అతనికి జెన్‌ గురించి చెప్పాలంటే అనేక సంవత్సరాలు తలకిందులుగా నిలిచి మూడు చెరువుల నీళ్ళు తాగాలి. విద్య నేర్పడం అంత సులభం కాదు’’ అన్నాడు గట్టిగా.. ఆ రెండో గురువు మాటలు విని మంత్రులు భయంతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. అయిపోయింది..... రాజుని తెలివిలేని వాడని చెప్పిన రెండో గురువు తల తెగి నేలపడటం ఖాయం’’ అని అనుకున్నారు. కానీ రాజు అలా చెయ్యలేదు. ఆ రెండో గురువునే ఎంచుకున్నాడు. ఆయన దగ్గరే జెన్‌ గురించి నేర్చుకోవాలనుకున్నాడు.

ఎందుకో తెలుసా?
‘‘నన్ను గొప్ప మేధావి అని అనుకుంటున్న మనిషి దగ్గర నేనెలా కొత్త విషయాలు నేర్చుకోగలను? ఆయనకన్నా నన్ను తెలివిలేని మూర్ఖుడని చెప్పిన రెండో గురువు దగ్గరైతేనే నేను కొద్దో గొప్పో నేర్చుకోవడానికి వీలు ఉంటుంది... అదే నాకు మేలు చేస్తుంది. నా ఆశయం సిద్ధిస్తుంది’’ అన్నాడు రాజు. – యామిజాల జగదీశ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు