అంతఃపురం దాటిన యువ రాజులు...

30 Aug, 2013 00:41 IST|Sakshi

యువరాజు... మహారాజు కుమారుడు. రాజు తర్వాత సింహాసనాన్ని అధిరోహించి అధికారం చేబట్టే అర్హత కలిగినవాడు. ఇతడికి రాజకీయం, యుద్ధకౌశలం తెలిసి ఉండాలి. అన్ని విద్యలలోనూ ఆరితేరి ఉండాలి. మహారాజు తర్వాత పరిపాలన బాధ్యతలు స్వీకరించి జనరంజకంగా పాలించాల్సిన బాధ్యత యువరాజుది... ఈ ఉపోద్ఘాతమంతా రాచరికాల నాటి యువరాజులకు. రాచరికాలు పోయినా రాజవంశాలైతే ఉన్నాయి. ఆ వంశాలకు చెందిన యువకులు యువరాజులే అయినప్పటికీ  భిన్నమైన ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉన్నారు. అలా అంతఃపురాలు దాటిన యువరాజుల గురించి...
 
 క్రికెట్ అసోసియేషన్‌లో....


 ఉత్తర భారతదేశంలోని మేవార్ రాజ్యాన్ని పాలించిన ప్రసిద్ధ పాలకుడు మహారాణా ప్రతాప్ కుటుంబానికి చెందినవాడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్. రద్దయిపోయిన ఉదయ్‌పూర్ సంస్థానానికి యువరాజు లక్ష్యరాజ్. ఈ యువరాజు తన పేరు మీద ఒక వెబ్‌సైట్ పెట్టి తన అచీవ్‌మెంట్స్‌ను, తన పూర్వీకుల గొప్పతనాన్ని వివరించే పని పెట్టుకున్నారు. కుటుంబపరంగా వస్తున్న ఆస్తులను సంరక్షించడంతో పాటు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
 
 నిరాడంబర జీవితం...


 జైపూర్ రాజవంశానికి చెందినవాడు దేవరాజ్ సింగ్. ఈ యువరాజుకు ఆనువంశికంగా వస్తున్న ఆస్తుల గురించి కోర్టుల చుట్టూరా తిరగడమే సరిపోతోంది. దేవ్‌రాజ్ సింగ్ నాయనమ్మ మహారాణి గాయత్రీదేవి నిలువెత్తు రాచరికానికి నిదర్శనం. ఆమెకు భిన్నంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు దేవ్‌రాజ్ సింగ్.
 
 పత్రిక ఎడిటర్...


 త్రిపురకు చెందిన ‘మాణిక్య’ రాజవంశం నుంచి వచ్చినవారు కిరీట్ ప్రద్యోత్ దేశ్ బర్మన్. వీరి తాతగారు మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ దేవ్ బర్మన్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ప్రస్తుతం ఒక వార్తా పత్రిక ఎడిటర్‌గా ఉన్నారు కిరీట్. ‘ది నార్త్ ఈస్ట్ టుడే’ అనే పత్రికను నడిపిస్తూ రాజకుటుంబ పెద్దగా తన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఈ యువరాజు.
 
 మోడలింగ్‌లో...


 ఒరిస్సాలోని బొలంగిర్ రాచకుటుంబం నుంచి వచ్చిన ఆర్కేష్ సింగ్ దేవ్‌కు నటన  అంటే పిచ్చి. ఆనువంశికంగా వచ్చిన వాటిని వదులుకుని న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.  తగిన అవకాశాలు లభించకపోవడంతో మోడలింగ్ చేస్తున్నాడు. బ్రిటిష్ ఇండియాలో అత్యంత ధనిక సంస్థానాల్లో బొలంగిర్ కూడా ఒకటి. అర్కేష్ తాతగారు మహారాజా రాజేంద్ర నారాయణ సింగ్ ఒరిస్సాకు తొలి ముఖ్యమంత్రి.
 
 కేంద్రమంత్రిగా...


 పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి. గ్వాలియర్ సంస్థానపు యువరాజు.  తండ్రి మాధవ్‌రావ్ సింధియా కూడా ఎంపీగా పనిచేశారు. ఆయన మరణానంతరం జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష హోదా కూడా ఈయనదే.

మరిన్ని వార్తలు