కౌలురైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కౌలురైతు ఆత్మహత్య

Published Fri, Aug 30 2013 12:53 AM

farmer commits suicide

రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ : అప్పుల బాధ, కుటుంబ కలహాలతో కిండ్ర గ్రామ కౌలు రైతు పప్పల కన్నబాబు (45) మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డి మందు తాగిన అతడ్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిన అతడు చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కన్నబాబు గురువారం ఇంటివద్ద భార్య వరహాలుతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలో గడ్డిమందు తాగాడు. కొనఊపిరితో ఉన్న అతడ్ని రాజవొమ్మంగి పీహెచ్‌సీకి 108లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నబాబు మరణించాడు.
 
  కన్నబాబు 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, నాలుగు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా అతడికి సాగులో నష్టాలు వస్తున్నాయి. రూ. లక్షకు పైగా అప్పులు కూడా వున్నాయి. పత్తి, వరి వర్షాలు లేక ఎండిపోతుండడంతో ఇటీవల అతడు ముభావంగా ఉంటున్నాడు. గురువారం ఉదయం పొలానికి వెళ్లడం మాని ఇతర రైతులకు చెందిన ధాన్యాన్ని మిల్లు పట్టించడానికి లాగరాయి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చిన అతడ్ని పొలానికి వెళ్ళకుండా ఎక్కడికిపోయావని భార్య నిలదీసింది. మిల్లు పట్టిస్తే కూలిగా వరితౌడు వస్తుందని వెళ్లానని చెప్పాడు. అయినా వినక భార్య కినుక వహించడంతో కన్నబాబు అక్కడే ఉన్న గడ్డిమందు తాగాడు. కన్నబాబుకు పెళ్లి కావలసిన కూతురు, డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న కొడుకు, చదువు మధ్యలో మానేసి వ్యవసాయంలో సాయపడుతున్న మరో కొడుకు ఉన్నారు. కన్నబాబు మరణంతో ఆ కుటుంబం దిక్కును కోల్పోయింది. భర్త మరణంతో వరహాలు గుండెలవిసేలా రోదిస్తుంటే గ్రామస్తులు కంటతడి పెట్టారు. సెక్షన్ 174 క్రింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై సీహెచ్. గోపాలకృష్ణ తెలిపారు.
 

Advertisement
Advertisement