కుప్పిగంతుల హాస్యం

23 Sep, 2019 01:52 IST|Sakshi

అలనాటి వ్యాసం

‘పెళ్లి చేసి చూడు’ రషెస్‌ చూశాక, దాన్ని ప్రశంసిస్తూ కొడవటిగంటి కుటుంబరావు తెలుగు స్వతంత్రకు వ్యాసం రాశారు. అందులో వ్యక్తం చేసిన అభిప్రాయం ‘సమస్య’ అప్పటినుంచే ఉందని రుజువు చేస్తుంది. 1952లో విడుదలైన విజయా ప్రొడక్షన్స్‌ వారి ఈ చిత్రానికి రచయిత చక్రపాణి. దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌. ఎన్టీ రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి నటీనటులు. 
‘‘సామాన్యంగా మన చిత్ర నిర్మాతలు కొన్ని హాస్య పాత్రలను సృష్టించి ఆ పాత్రలను హాస్య నటులకు వప్పగించి, వారిని అచ్చుపోసి వదిలేసి హాస్యం సాధించటానికి యత్నిస్తారు. (ఈ) చిత్రంలో సృష్టి అయ్యే హాస్యం ఈ అభ్యాసానికి పూర్తిగా విరుద్ధం.
‘పెళ్లి చేసి చూడు’లోని హాస్యానికీ ఇతర చిత్రాలలో హాస్యానికీ ఇంకొక పెద్ద తేడా యేమంటే ఇతర చిత్రాలలో హాస్యం ప్రవేశించగానే కథ పక్కకు జరుగుతుంది. హాస్యనటుడు తన కుప్పిగంతులు పూర్తి చేసి తప్పుకున్నాకగాని తిరిగి కథ సాగదు. ఈ చిత్రంలో హాస్య సంఘటనల పరంపరతోనే కథ ముందుకు నడుస్తుంది.
మన చిత్ర నిర్మాతలకు ఒక పెద్ద అపోహ ఉన్నట్టు కనిపిస్తుంది. అదేమంటే, విమర్శక దృష్టిగలవారు చూడదగిన చిత్రాలను సామాన్య ప్రజ చూడదనీ, సామాన్య ప్రజ చూసేటట్టు చిత్రాలు తీయాలంటే అందులో తుక్కు ప్రవేశపెట్టాలనీను. ఇది వట్టి అజ్ఞానమని ‘పెళ్లి చేసి చూడు’ కచ్చితంగా రుజువు చేస్తుంది. ఈ చిత్రాన్ని ఎంత అమాయక ప్రేక్షకులైనా చూసి ఆనందించవచ్చు. విమర్శనా జ్ఞానం గల ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని పాత్రపోషణా, మనో విజ్ఞానమూ, కథా సంవిధానమూ, వాతావరణ సృష్టీ అద్వితీయంగా కనిపిస్తాయి.’’
(కొడవటిగంటి కుటుంబరావు 
‘సినిమా వ్యాసాలు’ లోంచి)

మరిన్ని వార్తలు