ఒకసారి సిజేరియన్‌ అయితే ప్రతిసారీ అదే తప్పదా?

30 Jan, 2020 00:04 IST|Sakshi

అపోహ – వాస్తవం

మొదటిసారి సిజేరియన్‌ అయితే రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే చేయాలనే అపోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అలాంటి నియమమేదీ లేదు. కాకపోతే రెండోసారి అయ్యే డెలివరీ నార్మల్‌గానే అవుతుందా లేక తప్పనిసరిగా సిజేరియన్‌ చేయాల్సి వస్తుందా అనే అంశం చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్‌ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎన్నో నెలలో చేశారు వంటి అనేక అంశాలపై రెండోసారి నార్మల్‌ డెలివరీయా లేక సిజేరియనా అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు...

►కొందరిలో మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే సిజేరియన్‌ చేసి ఉండవచ్చు. ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. బిడ్డ తల కిందికే ఉంది కాబట్టి నార్మల్‌ డెలివరీ కోసం ఎదురు చూడవచ్చు.

►మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే దారిలో మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్‌ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్‌ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్‌ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్‌ పెల్విస్‌) ఉంటే మాత్రం తప్పనిసరిగా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సిందే.

►సాధారణంగా తల్లుల ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారికి బిడ్డ బయటకు వచ్చే దారి అయిన పెల్విక్‌ బోనీ క్యావిటీ సన్నగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటివారిలో చాలా సార్లు సిజేరియన్‌ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సివచ్చే అవకాశాలు ఎక్కువ.

►మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు  కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... పెద్ద ప్రాణానికీ ప్రమాదం.

►మొదటిసారి సిజేరియన్‌ చేసే సమయంలో గర్భసంచికి నిలువుగా గాటు పెట్టి ఉంటే (క్లాసికల్‌ సిజేరియన్‌) ఇక రెండోసారి సిజేరియనే చేయక తప్పదు. (ప్రస్తుతానికి క్లాసికల్‌ సిజేరియన్స్‌ చాలా అరుదుగా చేస్తున్నారు). ఒకవేళ అప్పట్లో అడ్డంగా గాటు పెట్టి ఉంటే ఈ సారి నార్మల్‌ డెలివరీ కోసం అవకాశం ఇచ్చి చూడవచ్చు. పై అంశాల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మొదటిసారి సిజేరియన్‌ అయినంత మాత్రాన రెండోసారీ తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు.

తల్లీ, బిడ్డా ఆరోగ్యం బాగా ఉండి, పైన పేర్కొన్న అంశాల ఆధారంగా నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే దాని కోసం ప్రయత్నించవచ్చు. అయితే... మొదటిసారి సిజేరియన్‌ అయిన మహిళ... రెండోసారి ప్రసవాన్ని తప్పనిసరిగా ఆసుపత్రిలో (ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీ) జరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో డాక్టర్లు నిర్ధారణ చేసి, తగిన విధంగా చర్యలు తీసుకుంటారు.

డాక్టర్‌ స్వప్న పుసుకూరి
కన్సల్టెంట్‌ ఆబ్‌స్టట్రీషియన్‌ – గైనకాలజిస్ట్,
బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్,
హైదర్‌నగర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు