తెలుగు వారమండీ!

19 Apr, 2019 03:40 IST|Sakshi

మాతృసేవ

చిన్న నుంచి పెద్ద దాకా ఫేస్‌బుక్‌ను ఎడాపెడా ఉపయోగిస్తుండడాన్ని చూసిన సీనియర్‌ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు బుర్రలో ఓ చక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది. అదేమిటంటే, తెలుగును ఇష్టపడే వారందరికీ ఆ మధురిమను రుచి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటే ఎలా ఉంటుంది?’ అని. తనకు వచ్చిన ఈ ఆలోచనను వెంటనే అమలు చేసేశారు. అందులో భాగమే   యూ ట్యూబ్‌లో తనకున్న వీఆర్‌ తెలుగు ఛానల్‌  ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరిట ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫేస్‌బుక్‌ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. దీనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో చిత్తశుద్ధితో తనకు ఎన్ని పనులున్నా పక్కనపెట్టేసి, ఆ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తూ, ఓ యజ్ఞంలా నిర్వర్తిస్తున్నారు. అలా గత ఏడాది మార్చి   17 నుంచి ఇప్పటి వరకు అంటే 54 వారాలుగా ఈ   కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

తెలుగును ఇష్టపడే వారిలో చాలామందిని తన వీఆర్‌ తెలుగు ఛానల్‌కు వీక్షకులుగా చేసుకోగలిగారు. ఎంతోమంది తెలుగు భాషాభిమానులను, పెద్దలను, యువతను ఇందులో భాగస్వాముల్ని చేశారు. అది ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే...‘‘తెలుగు మాట ప్రతీ ఇంటా మార్మోగాలనే సదుద్దేశంతో దీన్ని నేను ప్రారంభించాను. ఇల్లే వేదికగా నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞం ఇంత చక్కగా సాగడానికి కారణం తెలుగు భాషాభిమానులు ఇస్తున్న ప్రోత్సాహం. నాకు సలహాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు, తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు. ఇంటివద్ద సహకరిస్తున్న నా సతీమణి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలకు కృతజ్ఞతలు.

ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి బేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు, ఫోన్‌ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 25 మంది ప్రముఖులు ఇంటివద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరో 25 మంది శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్‌ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 90 కి పైగా వేమన పద్యాలు, 50 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 50 సామెతలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు మీముందు ఉంచాను.

ఇవి కూడా ముమ్మరంగా షేర్‌ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూశారు. దీనికి అనుబంధంగా యూ ట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్‌ తెలుగు చానల్‌’ ద్వారా 10 వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు, దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..’’ 

తెలుగు హారంలో పరిమళించిన కొన్ని పుష్పాలు... 
రత్నాల నరసింహమూర్తి (సీనియర్‌ జర్నలిస్టు), వర్థనపు సుధాకర్‌( డీడీ ఖజానా శాఖ, విశాఖ), పి. లక్ష్మణ్‌ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మహబూబ్‌ నగర్‌); పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), ఆర్‌. మధుసూదన రావు(కథకుడు, సినీగేయ రచయిత); బాబూచారి (గాయకుడు), మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్‌); కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు), డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్‌ సభ్యుడు, సాహితీ వేత్త)లు అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. 

ఫోన్‌ ద్వారా ముచ్చటించిన వారు...
సన్నశెట్టి రాజశేఖర్‌ (సంపాదకులు, ఉత్తరాంధ్ర పత్రిక, శ్రీకాకుళం), 2. భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం; శ్యామసుందర శాస్త్రి, (రేడియో వ్యాఖ్యాత, అనంతపురం) ఈశ్వర రెడ్డి (ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప), మహ్మద్‌ మియా (గజల్‌ గాయకుడు, కర్నూలు), నందిగం శివప్రసాద్‌ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్‌); జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌ (జేసీ, కరీంనగర్‌), ఎం. హరికిషన్‌ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు)

తెలుగు హారం
కార్యక్రమ లక్ష్యాలుప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి; తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం, సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం, మన మాతృభాష కొన్ని వందల తరాలకు అందేలా తెలుగు కుటుంబాలు కృషి చేసేందుకు ప్రేరణ కలిగించడం 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు