ఆంగ్లంతోపాటు ఆంధ్రమూ ...

9 May, 2015 00:15 IST|Sakshi
ఆంగ్లంతోపాటు ఆంధ్రమూ ...

పేరెంటింగ్ టిప్స్
 
ఇప్పటి పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకువచ్చేందుకు ఉగ్గుపాలతో ఇంగ్లిష్ చెబుతూనే, పనిలోపనిగా వాటిని తెలుగులోనూ చెబుతుంటే రెండు భాషల్లోనూ పిల్లలకు ప్రవేశం ఉంటుంది. ఏకకాలంలో రెండు భాషలనూ నేర్పడం మంచిది. ఉదాహరణకు... ఇంగ్లిష్‌లో ఉన్న రైమ్స్, టంగ్‌ట్విస్టర్స్, సామెతలు వంటివి తెలుగులో కూడా ఉన్నాయి. పిల్లలకు భాష నేర్పడం మొదట శరీరభాగాలను చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఈమధ్య తల్లిదండ్రులు వాటిని ఇంగ్లిష్‌లోనే ‘నోస్, మౌత్, ఐస్...’ అంటూ నేర్పుతున్నారు. అలా కాకుండా... ‘ఇది ముక్కు, ఇది నోరు, ఇవి కళ్లు... ఏదీ... నువ్వు చూపించు నీ కళ్లు ఎక్కడ?’ అనడంతో ఇది మొదలవుతుంది.

మీ పిల్లలకు ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ రైమ్‌తో పాటు -  ‘చేత వెన్నముద్ద... చెంగల్వ పూదండ...’ కూడా నేర్పండి.  మీ పిల్లలు సరదాగా ఇంగ్లిష్ టంగ్ ట్విస్టర్స్ చెప్పుకుంటూ ఉంటే అలాంటివి తెలుగులోనూ ఉన్నాయని ‘అడిగెదనని కడువడి జను అడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్...’ అన్న భాగవత పద్యమూ చెప్పండి. పిల్లల్ని చదివించే టైమ్‌లో వాళ్లు ఇంగ్లిష్ సామెతలు చదివేటప్పుడు వాటికి సమానమైనవి తెలుగులోనూ ఉంటాయని, ఉదాహరణకు ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనగానే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ వంటివి గుర్తుచేసుకుని ఎప్పటికప్పుడు చెబుతుండాలి.  

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’, ‘కంచు మోగినట్లు కనకంబు మోగునా’ వంటివి మీ పిల్లలు పాఠ్యపుస్తకంలో చదివి చెబితే... ఒక పద్యపాదమే, నిత్యసత్యమైన సామెతలా నిలిచిపోయిందని వివరించి, ఆ పూర్తి పద్యం నేర్చుకొనేలా మీ పిల్లల్ని ప్రోత్సహించండి.   పిల్లలు కేవలం ఇంగ్లిష్ మాత్రమే చదువుతూ ఉంటే ఆ ఒక్క భాషలో మాత్రమే  ప్రావీణ్యం ఉంటుందని, అదే ఇంగ్లిష్‌తో పాటు తెలుగు కూడా నేర్పుతుంటే బహుభాషలు అలవడతాయన్న దృక్పథాన్ని అలవరచుకోండి.  మీ పుస్తకాల ర్యాక్‌లో పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలతో పాటు ‘వేమన శతకం’, ‘సుమతీ శతకం’లాంటి చిన్న చిన్న పలుచటి పుస్తకాలు కూడా ఉండేలా చూసుకోండి. ఇంగ్లిష్ మీడియంలోని పిల్లలకు తెలుగును ప్రయత్నపూర్వకంగా నేర్పేబదులు...  ఇది సులువు కాదంటారా?
 

 
 

మరిన్ని వార్తలు