పరి పరిశోధన

21 May, 2018 01:01 IST|Sakshi

శాకాహారులకూ కావాల్సినంత బీ–12
శాకాహారం తీసుకునే వారిలో అత్యధికులు విటమిన్‌ బీ12 లోపం కనిపిస్తూంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండటం మొదలుకొని నాడీ వ్యవస్థ సక్రమ పనితీరు వరకూ అనేక అంశాల్లో బీ–12 అత్యవసరం. కాకపోతే ఇది మొక్కల ద్వారా లభించదు కాబట్టి శాకాహారులకు కావాల్సినంత అందదు. ఈ నేపథ్యంలో కెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. కొన్ని రకాల మొక్కల్లోకి ఈ విటమిన్‌ను ఎక్కించవచ్చునని గుర్తించారు.

వాటర్‌ క్రెస్‌ మొక్కలకు అందించే పోషకాల్లో భాగంగా విటమిన్‌ బీ 12 (కోబాల్‌మిన్‌)ను అందించినప్పుడు మొక్క దాన్ని శోషించుకుందని మార్టిన్‌ వారెన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. పోషకాల్లో ఎంత ఎక్కువ కోబాల్‌మిన్‌ ఉంటే మొక్కలో అందుకు తగ్గ పెరుగుదల నమోదైనట్లు తాము ప్రయోగపూర్వకంగా నిరూపించామని వివరించారు. భారత్‌ లాంటి దేశాల్లో శాకాహారులు ఎక్కువగా ఉంటారని.. బీ–12 లోపం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని వారెన్‌ చెప్పారు. పరిశోధన వివరాలు సెల్‌ కెమికల్‌ బయాలజీ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.


కేన్సర్ల గుర్తింపునకు ఊపిరి ఆయుధం
కేన్సర్‌ను గుర్తించాలంటే కణితి భాగాన్ని వెలికి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ బయాప్సీ వల్ల వ్యాధి చాలా వేగంగా ముదురుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బయాప్సీ అవసరమన్నది లేకుండా కేవలం మన ఊపిరి ద్వారా ఆహార నాళ, ఉదర కేన్సర్లను గుర్తించేందుకు ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. జామా ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన అవసరం లేకపోయినా చేసే బయాప్సీల నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈ పద్ధతిని తాము 335 మందిపై పరీక్షించి చూశామని ఫలితాలు 85 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు తెలిసిందని ప్రొఫెసర్‌ జార్జ్‌ హన్నా చెప్పారు. ఆహారనాళ, ఉదర కేన్సర్లను గుర్తించడంలో జాప్యం ఎక్కువగా ఉంటుందని.. ఫలితంగా చికిత్స కూడా కష్టమవుతుందని ఆయన చెప్పారు. అందువల్ల సాధారణ రక్త పరీక్షలతోపాటు శ్వాస పరీక్షలూ నిర్వహిస్తే కేన్సర్లను తొందరగా గుర్తించేందుకు వీలేర్పడుతుందని చెప్పారు.

ఈ కేన్సర్లు ఉన్న వారి శ్వాసలో కొన్ని ప్రత్యేకమైన రసాయన మూలకాలు ఉంటాయని.. తాము వాటిని గుర్తించడంతోపాటు ఎంత మోతాదులో ఉంటే ఏ రకమైన ఫలితముంటుందనేది కూడా తెలుసుకున్నామని జార్జ్‌ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ పద్ధతిని మెరుగుపరుస్తామని, భవిష్యత్తులో దీన్ని ఇతర కేన్సర్ల గుర్తింపునకూ వాడే అవకాశం లేకపోలేదని ఆయన వివరించారు.


వజ్రంతో వైద్య పరీక్షలు చౌక!
ఎమ్మారై వంటి వైద్య పరీక్షలను చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గాన్ని కనుక్కున్నారు. ఎమ్మారై యంత్రాల్లో వాడే ఖరీదైన సూపర్‌కండక్టింగ్‌ అయస్కాంతాలకు బదులుగా వజ్రాల్లో ఉండే అతి సూక్ష్మమైన లోపాలను వాడుకోవచ్చునని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం ఒకటి పరిశోధన పూర్వకంగా గుర్తించింది. కేన్సర్‌ కణితులతోపాటు శరీరం లోపలిభాగాలను స్పష్టంగా చూసేందుకు ఎమ్మారై, రసాయన మూలకాల అమరికను కచ్చితంగా తెలుసుకునేందుకు ఎన్‌ఎంఆర్‌ యంత్రాలు ఉపయోగపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

వజ్రాలకున్న ప్రత్యేక భౌతిక ధర్మాలను వాడుకోవడం ద్వారా ఎమ్మారై, ఎన్‌ఎంఆర్‌ యంత్రాలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చునని అంతేకాకుండా ఈ ధర్మాలను నీటిలోకి చేర్చి ఎమ్మారైల ద్వారా మరింత స్పష్టమైన చిత్రాలను తీయడం వీలవుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన భారతీయ సంతతి శాస్త్రవేత్త అశోక్‌ అజోయ్‌ తెలిపారు. నానో, మైక్రోస్థాయి వజ్రాలపై బలహీనమైన అయస్కాంత క్షేత్రం సమక్షంలో పచ్చ రంగు లేజర్‌ కిరణాలను ప్రసారం చేసినప్పుడు వాటి స్పిన్‌ పోలరైజేషన్‌ వందల రెట్లు ఎక్కువైందని.. ఈ ధర్మం ఆధారంగానే ఎమ్మారై, ఎన్‌ఎంఆర్‌లు పనిచేస్తాయని వివరించారు.

వజ్రాలతో పనిచేసే ఎమ్మారై, ఎన్‌ఎంఆర్‌ యంత్రాల సైజు చాలా తక్కువగా ఉంటుందని.. తద్వారా ఈ పరీక్షలు చౌక కావడమే కాకుండా.. విస్తృత వినియోగంలోకి వచ్చే అవకాశముందని ఆయన వివరించారు. గ్రాఫైట్‌ను అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతలకు గురిచేయడం ద్వారా సూక్ష్మస్థాయి వజ్రాలను కూడా చౌకగా తయారు చేయవచ్చునని అశోక్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు