అయస్కాంతాలతో  కండరాలకు శక్తి...

24 Jan, 2019 01:11 IST|Sakshi

వ్యాయామం చేస్తూ ఉంటే కండరాలు దృఢంగా మారతాయి. చాలాసార్లు విన్నమాటే ఇది. గాయాలై కదల్లేని వారి గతేమిటి? ఎంరెజెన్‌ వాడితే చాలంటున్నారు సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అయస్కాంత శక్తితో పనిచేసే ఈ ఎంరెజెన్‌ను రోజూ ఉపయోగిస్తే ఎలాంటి వారికైనా వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుందని అల్‌ఫ్రెడో ఫ్రాంకో ఒబెర్గన్‌ అంటున్నారు. కండరాలపై నిర్దిష్ట తీవ్రతతో ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించ‌డం ద్వారా ఎంరెజెన్‌ పనిచేస్తుందని ఫలితంగా ఖర్చయిపోతున్నట్లు భ్రమపడి కండరాలు మళ్లీ దృఢంగా తయారయ్యే ప్రయత్నం చేస్తాయని వివరించారు.

వ్యాయామం అస్సలు చేయని లేదా చేయలేని వారి కండరాలు కాలక్రమంలో బలహీనపడుతూ ఉంటాయని.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను ఎంరెజెన్‌ సాయంతో నివారించవచ్చునని చెప్పారు. 2015, 2017లలో తాము ఈ యంత్రాన్ని కొంతమందిపై ప్రయోగించి చూశామని వారానికి ఒక రోజు పది నిమిషాలపాటు.. ఐదు వారాలపాటు ఒక కాలి కండరంపై దీన్ని వాడినప్పుడు కండరాల శక్తిలో 30 నుంచి 40 శాతం వరకూ పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. రెండో ప్రయోగంలో మోకాలి శస్త్రచికిత్స చేసిన వాళ్లు కొంతమందిని రెండు గుంపులుగా విడదీశామని.. కొందరికి ఎంరెజెన్‌.. మిగిలిన వాళ్లకు సాధారణ ఫిజియోథెరపీ ఇచ్చామని యంత్రాన్ని వాడిన వాళ్లు చాలా తొందరగా కోలుకున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు