నా భార్యను తిరిగి దుబాయ్‌ పంపించండి

1 Sep, 2019 07:09 IST|Sakshi

రాకుమారి 

‘నీ అబద్ధపు రోజులు ముగిశాయి. గతంలో మనం ఏమిటి, ఇప్పుడు నువ్వేమిటి అన్నది ప్రశ్నే కాదు. నా దగ్గర నీకిక స్థానం లేదు. నువ్వెరితోనైతే తీరికలేనంతగా ఉంటావో వారితోనే ఉండిపో. నువ్వు చచ్చావో బతికావో నాకు అక్కర్లేదు’ అని భర్త ఎంతగా తూలనాడినా.. ఆమె ఇప్పటి వరకు ఒక్క మాటా అనలేదు.

గుర్రప్పందాలను వీక్షించడం కోసం ఇంగ్లండ్‌లోని ఆస్కాట్‌ రేస్‌ కోర్సుకు క్రమం తప్పకుండా – అది కూడా చేతిలో చెయ్యి వేసుకుని – వస్తుండే ఓ రాచకుటుంబపు జంట ఈ ఏడాది జూన్‌లో ఆ దరిదాపుల్లోనే కనిపించలేదు! ఆ జంటలోని ఒక వ్యక్తి మాత్రమే ఒంటరిగా డీలాపడిన ముఖంతో అక్కడికి వచ్చారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యు.ఎ.ఇ.) ప్రధాని, ఉపాధ్యక్షుడు అయిన మొహమ్మద్‌ బిన్‌ రిషీద్‌ అల మాక్తౌమ్‌ ఆయన! రషీద్‌ దుబాయ్‌ పాలకుడు కూడా. యు.ఎ.ఇ.లోని ఏడు ఎమిరేట్స్‌లో దుబాయ్‌ ఒకటి. ఆయన ఉన్నప్పుడు ఆయన పక్కన అవిభాజ్యంగా ఎవరు ఉంటారో తెలిసిన ఇతర పాలకులు, ప్రసిద్ధులు రషీద్‌ రాకలో నిండుదనం లేకపోవడాన్ని వెను వెంటనే గ్రహించారు.

అవును. దుబాయ్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుస్సేన్‌ ఆయన పక్కన లేరు! రషీద్‌ ఆరో భార్య ఆమె. అసలు వాళ్లిద్దరూ భార్యాభర్తలు అవడానికి కారణమైన ప్రేమను అంకురింపజేసింది గుర్రప్పందాలు, గుర్రాల విన్యాసాలపై ఉమ్మడిగా వారికి ఉన్న ఆసక్తే.  జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు మారు సోదరి అయిన హయా తన ముప్పై ఏళ్ల వయసులో 2004లో రషీద్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు యాభై మూడేళ్లు. 

భర్తతో కలిసి ఆస్కాట్‌ రేస్‌కోర్సుకు రాకుండా రాకుమారి హయా ఏమైనట్లు అని మొదట ఎవరికీ సందేహం రాలేదు. ఆమె ఎప్పుడూ అనేక సామాజిక కార్యక్రమాలలో మునిగి ఉంటారు. అయితే ఆస్కాట్‌ రేస్‌ తర్వాత కూడా రషీద్‌తో కలిసి ఆమె కనిపించకపోవడంతో తొలిసారిగా మీడియా అనుమానించింది. పైకి వెలుగు జిలుగులతో కనిపించే రాజప్రాసాదం లోపల హింసాత్మక చర్యలు, వ్యక్తుల్తి బంధించి వేధించడం వంటి అకృత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. జూన్‌ నుంచి ఒక నెల వెనక్కు వెళ్లి రాకుమారి ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నారా అని చూశారు. లేదు! ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌లలోకి వెళ్లారు.

మే 20 నాటికే అవన్నీ మూతబడి ఉన్నాయి. ఏమై ఉంటుంది? ఆత్మహత్య చేసుకుని ఉంటుందా? అవకాశమే లేదు. హయా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం గల మహిళ. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ రాయబారిగా పని చేశారు. ఒకప్పటి ఒలింపిక్‌ క్రీడాకారిణి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. మహిళల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారు. కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే సామాజిక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలు. 11 ఏళ్ల కూతురు జలీలా, ఏడేళ్ల కొడుకు జాయేద్‌. మొదట హయా ఒక్కరే కనిపించడం లేదు అనుకున్నారు. తర్వాత ఈ ఇద్దరు పిల్లలూ కనిపించని విషయం లోకం గమనింపునకు వచ్చింది!

పిల్లలతో పాటు దేశం వదలి వెళ్లిపోయిన (తప్పించుకుపోయిన?) దుబాయ్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుస్సేన్‌

రాకుమారి హయాను, ఆమె పిల్లల్ని రషీద్‌ గానీ ఏమైనా చేసి ఉంటాడా అనే ఒక పెనుభూతపు అనుమానం మేఘమై దుబాయ్‌ ఆకాశాన్ని కమ్మేసింది. అయితే ప్రజలందరితోపాటు రషీద్‌ కూడా తన భార్యపిల్లలకు కోసం ఎదురుచూస్తున్నారన్న సంగతి బయటపడే లోపే, హయా తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని దేశం నుంచి పారిపోయారనే వార్త గుప్పుమంది. ఒక జర్మన్‌ దౌత్యవేత్త సహకారంతో ఆమె దుబాయ్‌ నుంచి జర్మనీకి తప్పించుకున్నారని అరబ్‌ మీడియా వెల్లడించింది. ‘నా భార్యను తిరిగి దుబాయ్‌ పంపించండి’ అని రషీద్‌ చేసిన విజ్ఞప్తిని జర్మనీ మన్నించకపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని మరో వార్తా కథనం! రాజప్రాసాదాన్ని వదిలివెళ్లేటప్పుడు హయా 3 కోట్ల 20 లక్షల పౌండ్ల విలువైన నగదును కూడా (సుమారు 300 కోట్ల రూపాయలు) పిల్లల సంరక్షణార్థం తీసుకెళ్లిన  విషయం మెల్లగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం హయా లండన్‌లో ఉన్నట్లు తెలుస్తున్నా, లండన్‌లో ఎక్కడున్నారో తెలిసేలా ఉండడం లేదు. ‘‘నీ అబద్ధపు రోజులు ముగిశాయి. గతంలో మనం ఏమిటి, ఇప్పుడు నువ్వేమిటి అన్నది ప్రశ్నే కాదు. నా దగ్గర నీకిక స్థానం లేదు. నువ్వెరితోనైతే తీరికలేనంతగా ఉంటావో వారితోనే ఉండిపో. నువ్వు చచ్చావో బతికావో నాకు అక్కర్లేదు’అని రషీద్‌ జూన్‌ 30న ఒక ట్వీట్‌ మాత్రం ఇచ్చి ఊరుకున్నారు తప్ప వెతికే పని, వెతికించే పని పెట్టుకోలేదు. అయితే ఇవాళ్టి వరకు ఆయన్ని నిందిస్తూ హయా ఏ తీరం నుంచీ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. తను వెళ్లిపోడానికి గల కారణం కూడా ఆమెలా అజ్ఞతంగానే ఉండిపోయింది.


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా