కొలవలేని శబ్దాలు

16 Apr, 2018 00:22 IST|Sakshi
క్వీన్‌ ఎలిజబెత్‌ 

చెట్టు నీడ

నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు.

క్వీన్‌ ఎలిజబెత్‌ చెట్లను ప్రేమిస్తారు. రాణిగారికి ఉన్న ఈ చెట్ల ప్రేమపై ప్రకృతివేత్త (నేచురలిస్ట్‌) డేవిడ్‌ ఎటెన్‌బరో ‘ది క్వీన్స్‌ గ్రీన్‌ ప్లానెట్‌’ అనే డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఆ పని మీదే మంగళవారం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోని పూలవనంలో ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. రాణిగారు అతడికి ఏదో చెప్పబోతుంటే పైన వెళుతున్న హెలికాప్టర్‌ చెప్పనివ్వడం లేదు! అట్నుంచటు, ఇట్నుంచటు మాటలకు అసౌకర్యం కలిగించే పెద్ద ధ్వనితో తిరుగుతూనే ఉంది. రాణిగారికి చికాకు వేసింది. పైగా ఈ తొంభై రెండేళ్ల వయసులో చెప్పిందే చెప్పడం ఎవరివల్ల మాత్రం అవుతుంది? ‘‘ఏదైనా మాట్లాడుతున్నప్పుడే ఈ హెలికాప్టర్‌లు ట్రంప్‌లాగో, ఒబామాలాగో రొదపెడతాయెందుకో?’’ అని ఆమె నిస్పృహ చెందారు. రాణిగారిలోని ఈ ‘సెన్సాఫ్‌ హ్యూమర్‌’ను ఉత్తర, దక్షిణార్థ గోళాలు రెండూ ఉదయపు వేళ తేనీటి కప్పులతో చక్కగా ఆస్వాదించాయి.
రొద పెట్టేవారు నిత్య జీవితంలో మన చుట్టూ ఉంటారు. వారు మనల్ని మాట్లాడనివ్వరు, ఆలోచించనివ్వరు. నేరుగా వచ్చి ఏమీ వారు మన ధ్యాసను మరల్చరు కానీ వారి ధోరణిలో వారు డబడబమని ‘శబ్దాలు’ చేస్తూనే ఉంటారు. శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. అయితే వీళ్లు చేసే శబ్దాలను దేనితోనూ కొలవలేం.. మన నిస్పృహతో తప్ప! సదస్సులు, సమావేశాలు, సంభాషణలు, ఆఖరికి.. కుటుంబంలో కూడా నిత్యం ఈ కొలవలేని శబ్దాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. చెప్పేది వినరు. వినకపోవడం శబ్దం. చెబుతున్నది చెప్పనివ్వరు. చెప్పనివ్వకపోవడం శబ్దం. నొసలు విరుపు, పెదవి బిగింపు.. ఇవీ శబ్దాలే. మన కోసమని లోకం చప్పుడు చెయ్యకుండా ఉండదు. తన లోకంలో తను ఉంటుంది. తనకు తెలీకుండానే మన లోకంలోకి వచ్చి వెళుతుంది.. రాణిగారి తలపై తిరిగిన హెలికాప్టర్‌లా! అప్పుడు రాణిగారైనా, సాధారణ మనుషులైనా నిస్పృహ చెందడం సహజమే. అయితే నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు. అమెరికా అధ్యక్షులపై బ్రిటన్‌ రాజమాత వేసిన సున్నితమైన సెటైర్‌లో కనిపిస్తున్న అందమైన జీవిత సత్యం ఇది. చికాకులపై ఇంత సాల్ట్‌ వేసుకుంటే అవీ రుచిగానే ఉంటాయి. 
– మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు