నాకూ రాజకీయాలు చేతనైతది | Sakshi
Sakshi News home page

నాకూ రాజకీయాలు చేతనైతది

Published Mon, Apr 16 2018 12:24 AM

Kodandaram launched the partys flag - Sakshi

హైదరాబాద్‌: ప్రజలు సామాజిక తెలంగాణ, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే రాష్ట్రాన్ని కోరుకున్నారని వాటిని తమ పార్టీ నెరవేరుస్తుందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయాలు నడపడం నాకూ చేతనైతదని రుజువు చేయడానికే యాత్రకు బయల్దేరానన్నారు. ఆదివారం రాంనగర్‌లో ముషీరాబాద్‌ నియోజకవర్గం టీజేఎస్‌ నాయకుడు ఎం. నర్సయ్య ఏర్పాటు చేసిన సభలో పార్టీ జెండాను కోదండరాం ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. జెండాలోనే జనం ఉన్నారని, పాలపిట్ట రంగు విజయా నికి సంకేతమని తెలిపారు. రాజకీయాల్లో విజయాన్ని సాధించి తీరుతామన్నారు. రాజకీయ నాయకులకు వంగి వంగి దండాలు పెట్టే పద్ధతి మారాలన్నారు. మంచి వైద్యు డిని ఎంపిక చేసుకున్నట్లే రాజకీయ నాయకులనూ ఎంపిక చేసుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు కావొస్తున్నా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోగుల ఇక్కట్లు ఏమైనా తప్పాయా అని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఆప్‌ ప్రతి బస్తీలో ఆస్పత్రి పెట్టిందని, ప్రతి ఎమ్మె ల్యే ఆఫీసులో ఫోన్‌ నంబర్‌ను ప్రజలకు ఇస్తున్నారని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. త్వర లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జెండా ఆవిష్కరణ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రౌతు కనకయ్య, జోత్న్స, ఎం.సత్యంగౌడ్, కె. కిరణ్, జశ్వంత్, మధు, డాక్టర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement